
రాష్ట్రంలో ఐదు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాలకు శాసనమండలి ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా ఉన్న స్థానం నుండి ఉన్నత విద్యావంతులు ఓటర్లుగా ఉన్న స్థానాల నుండి మేధావులు శాసనమండలికి ఎన్నికైతే సమాజ ప్రయోజనాల కోసం చట్టాలు చేయడంలో మంచి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుందనేది రాజ్యాంగ నిర్మాతల భావన. సాధారణంగా శాసనమండలి టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాల్సి ఉంది. కొంచెం అటు ఇటుగా ఇప్పటి వరకు అదేవిధంగా జరిగాయి.
2007లో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన ఏడుగురు సభ్యులు చుక్కా రామయ్య చైర్మన్‌గా, డి. రామిరెడ్డి ఫ్లోర్ లీడర్‌గా ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) ఏర్పడి శాసనమండలిలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించారు. అటు అధికారపక్షం వైపునకు గాని, ప్రతిపక్షం వైపునకు కానీ ఒరిగి పోకుండా నికరంగా ప్రజల పక్షాన నిలబడి అనేక ప్రజా సమస్యలను సభలో లేవనెత్తి అధికార ప్రతిపక్ష నాయకుల మన్ననలను కూడా పొందటమే కాకుండా మధ్యతరగతి వర్గంలో పిడిఎఫ్ ఒక విశిష్ట స్థానం పొందింది. సభలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, యువ, విద్యార్థి, మహిళ, చిరుద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, బడుగు బలహీన వర్గాల వాణిని బలంగా వినిపించడంలో పిడిఎఫ్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించింది. బయట ఆయా వర్గాల పోరాటాలకు పిడిఎఫ్ అండగా నిలిచింది. తమకు వచ్చే ఎలవెన్సులను సైతం ప్రజా ఉద్యమాలకు వినియోగించే సంస్కృతి పిడిఎఫ్ శాసనమండలి సభ్యులది. రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు శాసనమండలి సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం శాసన మండలిలో ఐదుగురు పిడిఎఫ్ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాసనమండలి టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు జరుగుతున్న ఐదు స్థానాల్లోనూ పిడిఎఫ్ అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను వైసిపి ప్రభుత్వం తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నది. జగన్మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు అయ్యాయి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి అవగాహన లేక హామీ ఇచ్చారని చెప్పి గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ తెస్తామని అంటున్నారు. 2021 జనవరిలో ఇచ్చిన డిఏ జీవోలు 30 నెలల బకాయిలను మూడు వాయిదాలలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో చెల్లిస్తామని రెండేళ్లయినా నేటికీ చెల్లింపులు జరగలేదు. పైగా ఇవ్వని డిఏ అరియర్లకు ఇన్‌కమ్ టాక్స్ కూడా చెల్లించారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఈ ప్రభుత్వమే అమలు చేయని పరిస్థితుల్లో రాబోయే ప్రభుత్వాలు అమలు చేస్తాయని గ్యారెంటీ ఏమీ లేదు. కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వ హామీ కూడా అమలుకు నోచుకోలేదు. ఇచ్చిన డిఏల బకాయిల చెల్లింపు లేదు. కొత్త డిఏలు సంక్రాంతికి ఇస్తామంటున్నారు కానీ...ఏ సంక్రాంతికో చెప్పడం లేదు. ఉద్యోగులు 11వ పిఆర్‌సి వేతనాల అమలు కోసం నియమించిన ఆశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టును కూడా బయట పెట్టకుండా ఇష్టారాజ్యంగా రివర్స్ పిఆర్‌సి ఏకపక్షంగా అమలు చేశారు. ఉద్యోగులలో ఉన్న అసంతృప్తి 2012 ఫిబ్రవరి 3వ తేదీన ఉవ్వెత్తున ఎగసి విజయవాడ బిఆర్‌టిఎస్ రోడ్డులో లక్షమంది కదం తొక్కితే ఉద్యోగ సంఘ నాయకులను నయానో భయానో దారికి తెచ్చుకుని ఆశించిన ఫలితం రాకుండా చేసింది. చివరికి ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్, ఏపీజిఎల్‌ఐ సొమ్మును సైతం కైంకర్యం చేసి రుణాలు, ఫైనల్ పేమెంట్లు చెల్లించకుండా సంవత్సర కాలంగా మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో పెట్టింది.
డిఏ మరియు సరెండర్ లీవ్ బకాయిలు రూ.ఐదు వేల కోట్ల చెల్లింపులు నిలిపివేసింది. ఇవి చాలవన్నట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆకస్మిక పర్యటనలతో తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు. పైగా ఉపాధ్యాయులను ప్రశాంతంగా పాఠశాలలో పాఠాలు చెప్పనీయకుండా నాడు-నేడు పనుల పర్యవేక్షణ, వివిధ ప్రభుత్వ పథకాల అమలు, బాత్రూమ్‌ల మెయింటెనెన్స్, బియ్యం, కోడిగుడ్లు, చిక్కీలు, బ్యాగులు, బూట్లు, సాక్స్, బెల్టులు పంపిణీ యాప్ లలో అప్‌లోడ్ చేయటం, డౌన్‌లోడ్ చేయడం, దఫదఫాలుగా వచ్చే పుస్తకాలు, జె.వి.కె కిట్లు మండల కేంద్రాల నుండి తీసుకు రావడం, పంచడం అక్విటెన్సులు తయారు చేయడం వంటి బోధనేతర విధులలో సతమతం అవుతున్నారు. 11వ పిఆర్‌సి అరియర్లు రూ.5000 కోట్లు చెల్లించే విషయం ఊసే ఎత్తటం లేదు. కనీసం ఒకటవ తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఒత్తిడి నేపథ్యంలో ఉపాధ్యాయులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. తరగతి గదిలోనే గుండెపోటుతో మరణిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఒక హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దురదృష్టకరం.
పాఠశాల విద్యలో సంస్కరణల పేరుతో వేలాది పాఠశాలల మూసివేతకు, 50 వేల ఉపాధ్యాయ పోస్టులకు మంగళం పాడటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విద్యాశాఖలో 50,677 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు లక్షల మంది బిఇడి, డిఇడి చేసి డిఎస్‌సి కోసం ఎదురుచూస్తున్నారు. 2,46,000 పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేసే ఉద్దేశమే కనిపించడం లేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి పోస్టులు భర్తీ చేస్తామని జాబ్ లెస్ క్యాలెండర్‌గా మార్చి నిరుద్యోగులకు నిట్టూర్పే మిగిల్చారు. కాంట్రాక్టర్లకు లక్ష కోట్ల రూపాయలకు పైగా బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉంచారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఇంత అస్తవ్యస్త పాలన రాష్ట్రంలో ఎన్నడూ చూసిన చరిత్ర లేదు. పైగా ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అని ముఖ్యమంత్రి అనడంతో గ్రాడ్యుయేట్, టీచర్ ఎన్నికలలో ఏ విధంగానైనా గెలవాలని అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. పొరపాటున గెలిస్తే తమ పరిపాలనకు మేధావులు, ఉపాధ్యాయుల ఆమోదం ఉందని గొప్పలు చెప్పుకునే అవకాశం ఉంది. అందుకు అవకాశం ఇవ్వకుండా మేధావులైన ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు తమకు ఉన్న ప్రిఫరెన్షియల్ ఓట్లు అన్నిటిని వినియోగించుకోవడం మంచిది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బృహత్తరమైన బాధ్యత మేధావులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావంతులు అందరిపైన ఉన్నది. ప్రభుత్వ విధానాలను ఓడించి ఉద్యమ అభ్యర్థులకు పట్టం కట్టి ఉద్యమాలకు ఊపిరి పోద్దాం.
వ్యాసకర్త పిడిఎఫ్ శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జి