Sep 17,2022 10:15
  • మూడోరోజూ కొనసాగిన ప్రచారోద్యమం

ప్రజాశక్తి-యంత్రాంగం : బిజెపి ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకొనేందుకు దేశరక్షణ భేరీ పేరుతో సిపిఎం చేపట్టిన ప్రచారోద్యమం శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరింది. రాష్ట్రంలో ర్యాలీలు, సమావేశాలు, సదస్సులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలను ప్రజలకు విరసిస్తూ కరపత్రాలను సిపిఎం శ్రేణులు విస్తృతంగా పంపిణీ చేశారు. అనంతపురంలో ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటాయన్నారు. అన్ని వస్తువులపై జిఎస్‌టి పేరుతో ప్రజలపై భారం మోపారని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసి, బ్యాంకులు, బిఎస్‌ఎన్‌ఎల్‌తో సహా అన్నిటినీ ప్రైవేటీకరించి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని వివరించారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టే ఆందోళనలో ప్రతి ఒక్కరూ భాగస్వామలు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు బిజెపి చేసిన మోసాలను వివరిస్తూ అనంతపురంలోని ఎస్‌కె యూనివర్సిటీ వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. సత్యసాయి జిల్లాలోని నల్లచెరువు, ఓబుళదేవరచెరువు తదితర మండలాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. కడప జిల్లా ఒంటిమిట్టలో బైక్‌ జాతాను సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు ప్రారంభించారు. ఒంటి మిట్టనుంచి ప్రారంమైన బైక్‌ జాతా బద్వేలు వరకు కొనసాగింది. కడపలో కరపత్రాలు పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో జీపు జాతాను సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ ప్రారంభించారు. బనగానపల్లె, రాళ్ల కొత్తూరు, అవుకు మండలం గోకులదిన్నె, వేములపాడు, గుండ్ల సింగవరం, పెద్ద కొట్టాల, అవుకు, చెర్లోపల్లె, రామాపురం వరకూ 30 కిలోమీటర్లు తొలి రోజు జీపుజాతా సాగింది. నందికొట్కూరు నియోజకవర్గ జాతా మూడో రోజు జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచ, జూపాడుబంగ్లా, 80 బన్నూరు, తరిగోపుల, లింగాపురం, పారుమంచాల, తూడిచర్ల గ్రామాల్లో సాగింది. అనకాపల్లి జిల్లా పరవాడ, గొర్లివానిపాలెం, కె.కోటపాడు మండలాల్లో ప్రచారం నిర్వహించారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా జి.మాడుగుల మండలం భీరం పంచాయతీలో కరపత్రాలు పంపిణీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం, పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో చేపట్టిన ప్రచార జాతాల్లో ఒకటి బంటుమిల్లి, మరో జాతా మోపిదేవి చేరుకుంది. ఎన్‌టిఆర్‌ జిల్లాలో నాయకులు విస్తృత సమావేశాలు నిర్వహించారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద ఆటో కార్మికులకు బిజెపి ప్రమాదం గురించి కరపత్రాలను పంపిణీ చేస్తూ వివరించారు. నందిగామ సెంటర్లో ప్రచారం చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో దేశరక్షణ భేరి ప్రచారం ప్రారంభమైంది. దేశరక్షణభేరి వాల్‌ పోస్టర్‌ను గుంటూరులో ఆవిష్కరించారు. దుగ్గిరాల, తాడేపల్లిలోని సీతానగర్‌, కెఎల్‌రావు కాలనీలో కరపత్రాలు పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏలూరి సిద్దయ్య విజ్ఞాన్‌ భవన్‌లో దేశరక్షణ భేరిని జయప్రదం చేయాలని సమావేశం నిర్వహించారు. నెల్లూరులో ప్రచారాలు చేశారు.