Apr 09,2023 06:39

దక్షిణ భారత దేశంలో అత్యధిక బాల్య వివాహాలు జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ ఐదవ సర్వే బాల్యవివాహాల తీవ్రతను వెల్లడించింది. ఆ వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహాలు అత్యంత ముఖ్యమైన సమస్య అని, వీటిని అరికట్టేం దుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని శపథాలు చేశాయి. ఇది ఇప్పుడే కాదు. ప్రతి సర్వే సందర్భంగా ఈ విధమైన బీరాలు పోవడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారింది. కానీ ఆచరణలో బాల్యవివాహాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

  • ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు

2021లో ప్రపంచంలో 1 కోటి 30 లక్షల మంది పిల్లలు (ప్రపంచంలో వున్న మొత్తం పిల్లల్లో పది శాతం మంది) 20 ఏళ్ల లోపు తల్లులకు జన్మించినట్లు ఐక్యరాజ్యసమితి లోని ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖ ప్రకటించింది. మన దేశంలో పద్దెనిమిదేళ్ల లోపు బాలికలకు వివాహాలు జరుగుతున్నాయన్న గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో 73 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 71 శాతం, రాజస్థాన్‌లో 68 శాతం, బీహార్‌లో 67 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 64 శాతం ఈ తరహా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తాజాగా ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మన రాష్ట్రంలో 20-24 సంవత్సరాల మధ్య వయసున్న 29.3 శాతం మంది మహిళలకు 18 సంవత్సరాల లోపే పెళ్లిళ్లు అయ్యాయి. ఇందులో పట్టణాల్లో 21.7 శాతం మంది, గ్రామాల్లో 32.9 శాతం మంది యువతులకు చిన్నతనంలోనే వివాహాలు చేస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది. వీరిలో 12.6 శాతం మంది 15 నుండి 19 సంవత్సరాల లోపే గర్భం దాల్చారు. రాయలసీమ లోని ఎనిమిది జిల్లాలలో గత ఎనిమిది నెలల్లో 1,46,046 మంది గర్భం దాల్చినట్టు నమోదు కాగా అందులో 12 వేల మంది బాలికలు వుండడం ఆందోళనకరం. గుంటూరు జిల్లా (ఉమ్మడి జిల్లా)లో 20.7 శాతం, చిత్తూరు 19.7, ప్రకాశం 16.4, నెల్లూరు 14.9, అనంతపురం 13.6, కర్నూలు జిల్లాలో 12.4 శాతం మంది అమ్మాయిలు చిన్న వయసులోనే గర్భం దాల్చారని ఈ నివేదిక ప్రకటించింది.

  • సామాజిక రుగ్మత

చట్టప్రకారం నిర్ణయించిన వయసు కంటే ముందు జరిగే వివాహాలను బాల్యవివాహాలు అంటాం. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు పెళ్లీడు వయసుగా ప్రభుత్వాలు నిర్ణయించాయి. పెళ్లికి అమ్మాయిల కనీస వయసు 18గా ప్రపంచంలో చాలా దేశాలు నిర్ణయించాయి. ఈలోపు వివాహాలు జరపడాన్ని ప్రభుత్వాలు చట్టబద్ధంగా నిషేధించి, శిక్షలు కూడా నిర్ణయించాయి. మన దేశంలో ప్రాచీన కాలం నుండి కొనసాగిన అనేక సామాజిక రుగ్మతల్లో బాల్యవివాహాలు కూడా ముఖ్యమైనవి. అశాస్త్రీయ భావజాలమైన మనుధర్మ ప్రభావం మన కుటుంబ వ్యవస్థ మీద చాలా ఎక్కువగా వుండడం కూడా ఈ స్థితికి కారణం. చదువు కొందరికే పరిమితం కావడం, భూస్వామ్య కుటుంబాల అనుకరణ, కనీస జీవన ప్రమాణాలు తక్కువగా వుండడం...లాంటి అనేక కారణాలు బాల్యవివాహాలు కొనసాగడానికి తోడ్పడ్డాయి. జాతీయోద్యమ వేళ పరాయి పాలనపై పోరాడుతూనే మన సమాజంలోని అనేక రుగ్మతలపై ఉద్యమించాం. అందులో భాగంగానే బాల్యవివాహాల నిషేధం కోసం, వితంతు వివాహాల కోసం పోరాడార. దీని ఫలితంగా 1872 లోనే బాల్య వివాహాలను రద్దు చేస్తూ అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం చట్టం చేయాల్సి వచ్చింది. కాలానుగుణంగా ఈ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అనేక సవరణలు, చేర్పులు చేశారు. తాజాగా 2007 జనవరి 10న ఆమోదం పొందిన బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం బాల్య వివాహాన్ని ప్రొత్సహించే వారితో పాటు వివాహం జరిపే వారికి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. చట్టాలు, శిక్షలు ఇంత ఖచ్చితంగా వున్నా నేటి ఆధునిక కాలంలో కూడా బాల్యవివాహాలు ఎందుకు కొనసాగుతున్నాయి?

  • అక్షరాస్యత

నిరక్షరాస్యత బాల్యవివాహాలతో ముడిపడి వుంది. చదువు లేకపోవడంతో బాల్య వివాహాల వల్ల వచ్చే ఇబ్బందులను గుర్తించకపోవడం, వాటి గురించి ప్రభుత్వాలు పెద్దగా ప్రచారం చేయకపోవడం, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, ఆడపిల్లకు ఎంత త్వరగా పెళ్ళి చేస్తే అంత మంచిదనే అపోహ, ఎక్కువ చదివిస్తే మరింత చదువుకున్న వారితో పెళ్లి చేయాల్సి వస్తుందనే భయం వంటి అనేక అంశాలు బాల్యవివాహాలకు కారణాలు. కరోనా మహమ్మారి కూడా బాల్యవివాహాలు పెరగడానికి కారణమైంది. పాఠశాలలు మూతపడడంతో పాటు, లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల పెళ్లిళ్ల ఖర్చు తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో బాల్యవివాహాలు పెద్ద సంఖ్యలో జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నూతన విద్యావిధాన చట్టం అమలుతో అనేక పాఠశాలలు మూతపడుతున్నాయి. విద్యను అభ్యసించాల్సిన అమ్మాయిలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు అందుబాటులో లేకపోవడంతో పక్క ప్రాంతాలకు వెళ్లి చదువుకోవలసి రావడం అమ్మాయిలకు ఒక ప్రధాన సమస్యగా వుంది. అమ్మాయిలకు రక్షణ వుండదని, ప్రేమలో పడతారనే భయంతో బాల్యవివాహాలు జరుగుతున్నాయి.

  • లింగ వివక్ష- ఆరోగ్యం

లింగ అసమానత కూడా బాల్యవివాహాలకు ఒక కారణం. అమ్మాయిల సంఖ్య తక్కువగా వుండడంతో వయసుతో సంబంధం లేకుండా దగ్గరి బంధువుల్తో పెళ్లిళ్లు చేస్తున్నారు. వ్యాపార నాగరికత పెరిగే ఈ సమాజంలో కూడా శాస్త్ర విజ్ఞానం పెరిగేకొద్దీ సామాజిక అసమానతలు రద్దుకావాలి. కాని మన దేశంలో పురాతన భావాలు, ఆధునిక అనుకరణల మిశ్రమం మన సమాజాన్ని వెంటాడుతున్నది. ఇప్పటికీ కుల వివక్ష, లింగ వివక్ష కొనసాగుతూనే వున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో వెయ్యి మంది బాలురకు 943 మంది అమ్మాయిలు వున్నారు. సమాన లింగనిష్పత్తి సాధించకుండా బాల్యవివాహాలను నిరోధించడం అంత తేలిక కాదు. యుక్తవయసు రాకముందే పెళ్లి చేయడం, గర్భం దాల్చడం వల్ల శిశు మరణాల్లో 15 శాతం పిల్లలు పురిట్లోనే మరణిస్తున్నారు. అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ముఖ్యమైనది.
వాస్తవానికి బాల్య వివాహం కేవలం కుటుంబ సమస్య కాదు. చిన్నారుల ఆరోగ్యం, భవిష్యత్తుతో పాటు ఒక జాతి నిర్మాణానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం. ఈ సమస్య మూలాలు సామాజిక వ్యవస్థలో, ఆర్థిక స్థితిలో, ప్రపంచీకరణ విధానాల్లో, మతతత్వ భావజాలంలో వున్నాయి. వీటిని లోతుగా పరిశీలించి శాస్త్రీయమైన పరిష్కారాలు చేపట్టకపోతే బాల్య వివాహాల ప్రభావం సమాజంపై చాలా తీవ్రంగా వుంటుంది.

ram

 

 

 

 

-వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి. రాంభూపాల్‌