Feb 17,2023 11:07
  • ఆదేశాలే ఆచరణకు రాలేదు..

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : కనీస మద్దతు ధర కోసం పప్పుశనగ రైతులు ఎదురు చూస్తున్నారు. రబీలో సాగైన పంట నూర్పిడులు జరుగుతున్నా సేకరణ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో రైతులు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు అడిగిన ధరకే పంటను అమ్ముతున్నారు.
         ఉమ్మడి అనంతపురం జిల్లాలో నల్లరేగడి నేలలున్న ప్రాంతాల్లో పప్పుశనగ పంట పెద్దఎత్తున సాగవుతుంది. రబీలో 1.60 లక్షల ఎకరాలు సాగు చేశారు. అనంతపురం జిల్లా పరిధిలోనే 1.56 లక్షల ఎకరాల్లో పప్పుశనగ పంట సాగైంది. ఈ పంట ఇప్పుడు చేతికొచ్చి నూర్పిడిలు జరుగుతున్నాయి. ప్రతి పంటనూ కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేదు. రైతు భరోసా కేంద్రాల్లో పేర్ల నమోదు ప్రక్రియ మాత్రమే మొదలైంది. ఎప్పటి నుంచి సేకరణ ప్రారంభమవుతుందో తెలియక రైతులు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
 

                                                                క్వింటా రూ.4500కే కొనుగోలు

పప్పుశనగ పంటకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాళుకు రూ.5330 ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నది క్వింటా రూ.4500 వరకు మాత్రమే ఉంది. కనీస మద్దతు ధర కంటే రూ.830 తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సిన వస్తోంది. పంట విత్తుకునే సమయంలో ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చిన ధరనే క్వింటా రూ.5200 ఉంది. సబ్సిడీ కాకుండా క్వింటా రూ.6100గా నిర్ణయించి రైతులకు ఇచ్చింది. ఇప్పుడు చూస్తే క్వింటా ధర రూ.4500 మాత్రమే ఉండటంతో ప్రభుత్వం తక్షణం మద్దతు ధరకు పప్పుశనగ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసినా ఒక్కో రైతు నుంచి 25 క్వింటాళ్లు వరకు మాత్రమే పరిమితి ఉంది. ఆపైన పండిన పంటను రైతుల నుంచి కొనుగోళు చేయడం లేదు. దీంతో మూడు ఎకరాలపైనున్న రైతులు తక్కిన పంటను బయట అమ్ముకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఎకరానికి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అంటే మూడు ఎకరాల రైతుకు పూరి స్థాయిలో పంట తొమ్మిది క్వింటాళ్లు వస్తే మూడు ఎకరాలకే 27 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఆపైన భూమి కలిగిన రైతులు బహిరంగ మార్కెట్‌పైనే ఆధారపడాల్సి వస్తుంది. తొమ్మిది ఎకరాల్లో పంట వేశాను
           తొమ్మిది ఎకరాల్లో పప్పుశనగ పంటను సాగు చేశాను. ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చు వచ్చింది. తొమ్మిది ఎకరాలకు కలిపి మొత్తం రూ.1.35 లక్షలు పెట్టుబడి వచ్చింది. వర్షాలతో దిగుబడి కొంత తగ్గినా మొత్తం 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఇప్పుడు ఈ పంటను కొనేవారు లేరు. ప్రభుత్వం కొనుగోలు ఇంకా ప్రారంభించలేదు. కేవలం పేర్లు నమోదు మాత్రమే చేసుకుంటున్నారు. వారు ఎప్పుడు కొనుగోళ్లు ప్రారంభిస్తారో తెలియదు. బయట చూస్తే క్వింటా రూ.4500 వరకు మాత్రమే ధర ఉంది. ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
                                                                                          రమేష్‌ రైతు, రావి వెంకటాంపల్లి గ్రామం, తాడిపత్రి మండలం.

                                                                 ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించాలి

పప్పుశనగను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని మాటలు మాత్రమే చెబుతోంది. ఆచరణలో కొనుగోళ్లు ఇంకా ప్రారంభించలేదు. ఇప్పటికే 70 శాతానికిపైగా పంట నూర్పిడి పూర్తయ్యింది. రైతులు ఇళ్లలో పెట్టుకునే పరిస్థితుల్లేవు. బయట ధర కూడా లేదు. అందుకే తక్షణం ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించాలి. కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు చేపట్టాలి.
                                                   చంద్రశేఖర్‌రెడ్డి , ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి.