Nov 08,2023 08:00

- జనసేనను నమ్మే స్థితిలో జనం లేరు
- విధానాలు మార్చుకోకపోతే టిడిపికి గడ్డుకాలం : పి. మధు
- వనరులున్నా అభివృద్ధికి దూరంగా కోనసీమ : మంతెన సీతారాం
- కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగిన ప్రజారక్షణ భేరి యాత్రలు
ప్రజాశక్తి - యంత్రాంగం ;బిజెపికి రాష్ట్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని సిపిఎం సీనియర్‌ నేత, మాజీ ఎంపి పి.మధు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైసిపికి బుద్ధి చెప్పాలన్నారు. తన విధానాలు మార్చుకోకపోతే టిడిపికి గడ్డుకాలం తప్పదని, జనసేనను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. మతోన్మాదం, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతారన్నారు. దేశ సమగ్రాభివృద్ధికి వామపక్షాలు మాత్రమే ప్రత్యామ్నాయమని తెలిపారు. సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని మండపేట, రావులపాలెం, అమలాపురం, చించినాడ బ్రిడ్జి మీదుగా పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆ జిల్లాలోని యలమంచిలి, నరసాపురంలో యాత్ర కొనసాగింది. ఆయా చోట్ల యాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇసుక ర్యాంపు కార్మికులు, కొబ్బరి ఒలుపు, దింపు కార్మికులు, యుటిఎఫ్‌ నాయకులు, అంగన్‌వాడీలు తమ సమస్యలపై యాత్ర బృందానికి వినతిపత్రాలు అందజేశారు.
యలమంచిలి మండలం చించినాడలో అమరవీరుల స్తూపం వద్ద యాత్ర బృందం నివాళులర్పించింది. అరుణ పతాకాన్ని మధు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మధు మాట్లాడుతూ.. బిజెపి పాలనలో నిత్యావసర, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. మణిపూర్‌లో రెండు తెగల మధ్య వివాదం సృష్టించారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భావించిన బిజెపికి ఏం చేయాలో తెలియక రాష్ట్ర అధ్యక్షులను మార్చి టిఆర్‌ఎస్‌, వైసిపిలకు అండగా నిలిచిందని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం మాట్లాడుతూ.. పదేళ్లు పాలించిన బిజెపి, నాలుగున్నరేళ్లు పాలించిన వైసిపి రెండూ కలిసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయన్నారు. అంబేద్కర్‌ సెంటర్‌లో జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోక్‌నాధం, రాష్ట్ర నేత కె.ధనలక్ష్మి తదితరులు మాట్లాడారు.

  • కోనసీమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి?

కోనసీమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం ప్రశ్నించారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట, రావులపాలెం, అమలాపురంలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ.. ఈ జిల్లాలో పొదల్లో తాచుపాముల్లా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఉన్నాయని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని సహజ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెట్టి, స్థానికులకు మొండి చేయి చూపుతున్నారన్నారు. పైప్‌లైన్లు ద్వారా రూ.180కే గ్యాస్‌ సరఫరా చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులను సైతం పక్కదారి పట్టించిందని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర నాయకులు ఎవి.నాగేశ్వరరావు, కె. ధనలక్ష్మి, హరిబాబు, తదితరులు పాల్గన్నారు.

  • మత విద్వేషాలతో పబ్బం గడుపుతోన్న కేంద్రం : లోకనాథం

మత విద్వేషాలను రెచ్చగొడుతూ బిజెపి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం విమర్శించారు. అమలాపురం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. దీనిపై ప్రశ్నించాల్సిన వైసిపి అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని తెలిపారు. టిడిపి, జనసేన పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం వైసిపితో పోటీపడి బిజెపికి మద్దతు పలుకుతున్నాయని విమర్శించారు. కొబ్బరి రైతులకు ప్రోత్సాహకం కరువైందని, ఆక్వా చెరువులతో కోనసీమ కలుషితమైందని అన్నారు. కోనసీమ రైల్వేలైను విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.