- వద్దువద్దంటున్న సర్కార్
- గందరగోళంలో రైతులు
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : ప్రభుత్వ తీరుతో వరి రైతులకు కష్టాలు తప్పడం లేదు. దిగుబడి బాగా వస్తుందనే, ధర కూడా ఆశాజనకంగా ఉంటుందనే కారణంతో ఏటా రబీ సీజన్‌లో రైతులు బొండాలు రకం ధాన్యం పండించేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం మాత్రం సన్నాలనే సాగు చేయాలని, బొండాలు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెబుతోంది. దీంతో రైతులు గందరగోళంలో ఉన్నారు. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో 1.70 లక్షల ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 71,711 ఎకరాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.95 లక్షల ఎకరాల్లో రైతులు వరిని సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాల్లో ఖరీఫ్‌లో సన్నాలు రకం, రబీలో బొండాలు రకం ఎక్కువగా సాగు చేస్తుంటారు. బొండాలు రకం ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. సన్నాల సేకరణకే ముందుకొస్తోంది.
పెట్టుబడులు పెరగడంతో...
వ్యవసాయ పెట్టుబడులు ఏటా అంతకంతకూ పెరుగుతున్నాయి. దమ్ములు, ఎరువులు, పురుగుల మందుల ధరలు, కోత మిషన్లకు, ట్రాక్టర్లకు అద్దెలు, ఇతర ఖర్చులు గణనీయంగా పెరిగి తమకు నష్టమే మిగులుతోందని పలువురు రైతులు వాపోతున్నారు. దిగుబడి తక్కువగా ఉండే ధాన్యం సాగు పట్ల ఆసక్తి చూపడం లేదు. దిగుబడి ఎక్కువగా వచ్చే బొండాల రకం సాగుకు మొగ్గు చూపుతున్నారు. వర్షాలు, తుపానుల సమయంలో, నీటి ఎద్దడి సమయంలో ఈ వంగడం తట్టుకుని నిలబడుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 41 నుంచి 48 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ రకానికి మార్కెట్లో క్వింటాలుకు రూ.2,500 ధర లభిస్తోంది. బొండాలు రకం ధాన్యానికి కేరళలో డిమాండ్ ఎక్కువగా ఉంది. అక్కడ రికార్డు ధర పలుకుతోంది. సన్నాలు రకానికి ప్రభుత్వం కనీస మద్దతు ధర ఎ-గ్రేడ్‌కు రూ.2,060, కామన్ రకానికి రూ.2,040 ఇస్తోంది. సన్నాలు రకం ఎకరానికి 30 నుంచి 33 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. తేమ శాతం ఎక్కువగా ఉంటే ధర తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. రబీలో పండించే బొండాలు రకం వరిని ఈ సీజన్ నుంచైనా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. సాగునీరు లభ్యత, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ రోజుల్లో పంట చేతికి వచ్చే రకాల మాత్రమే వేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. 120 రోజుల పంట కాలం కలిగిన రకాలైన ఎంటియు 1121, 1224, 3626 రకాలను మాత్రమే సాగు చేయాలని నిర్దేశిస్తున్నారు. 1121 రకం సాగు చేస్తే సకాలంలో మంచి దిగుబడులు వస్తాయని చెబుతున్నారు.










