నందిగామ టౌన్ (ఎన్టిఆర్) : నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నమ్మ పార్థివదేహాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సోమవారం సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... మాతృ సమానురాలు మాడుగుల నాగరత్నమ్మ పదేళ్లపాటు తమతో రాజకీయ ప్రయాణం చేశారని, ఎంతో గొప్ప మనసున్న ఆమె మృతి చెందారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు కౌన్సిలర్ ఎన్నికైన వార్డు అభివృద్ధికి ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. ఆమె ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మంచి పేరు సంపాదించుకున్నారని చెప్పారు. మాడుగుల నాగరత్నమ్మ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం నందిగామ నగర పంచాయతీ వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నం కుటుంబ సభ్యులకు మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య సానుభూతి ప్రకటించారు. నందిగామ పట్టణం ఏడవ వార్డు వద్ద సోమవారంనాడు స్థానిక టిడిపి నేతలతో కలిసి నందిగామ నగర పంచాయతీ వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నం పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.