Jul 08,2023 06:17

భారతదేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన ప్రజా నాయకుడు, కష్టజీవుల పక్షపాతిగా జీవితాంతం పోరాడిన శ్రామిక నేత జ్యోతిబసు. నేడు ఆ మహానేత 109వ జయంతి. 1914 జులై 8న జ్యోతి కిరణ్‌ బసు మధ్య తరగతి కుటుంబంలో జన్మిం చారు. బసు తండ్రి హోమియోపతి వైద్యం చేసేవారు. వారి కుటుంబం నాటి స్వాతంత్య్రోద్యమానికి అండగా ఉండేది.
సూర్యసేన్‌ నాయకత్వాన సాగిన చిట్టగాంగ్‌ సాయుధ పోరాటం, జ్యోతిబసుకు విద్యార్థి దశలో స్ఫూర్తినిచ్చింది. ఉన్నత చదువులకు బసు లండన్‌ వెళ్ళారు. అక్కడ గ్రేట్‌ బ్రిటన్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకులతో పరిచయం ఏర్పడింది. వారి ప్రభావంతో అక్కడ శ్రామిక పోరాటాలలో పాల్గొన్నారు. యువకుడైన బసుపై ఆ పోరాటాలు చెరగని ముద్ర వేశాయి. స్వదేశానికి తిరిగి రాగానే కమ్యూనిస్టు ఉద్యమంలో చేరాలనే తలంపుకు నాంది అక్కడే పడింది.
బారిష్టరు చదువు పూర్తిచేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన బసు కలకత్తా కోర్టులో లాయర్‌గా నమోదు చేసుకున్నారు. అయినా లాయర్‌గా ప్రాక్టీసు చెయ్యకుండా కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం పూర్తి కాలం కార్యకర్తగా పని చేయాలని నిర్ణయించుకున్నారు. 1940లలో ఫాసిస్టు వ్యతిరేక రచయితల సంఘానికి కార్యదర్శిగా పని చేశారు. 1944లో రాష్ట్రంలో ఏర్పడ్డ రైల్‌రోడ్‌ వర్కర్స్‌ యూనియన్‌కు కార్యదర్శిగా ఎన్నికై ప్రత్యక్షంగా కార్మికోద్యమాలలో పాల్గొనసాగారు. 1946లో అదే రైల్వే వర్కర్స్‌ నియోజకవర్గం నుండి చట్టసభకు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేంతగా ఆ ఉద్యమంతో మమేకమయ్యారు. అప్పటి నుండే కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చెయ్యటానికి చట్ట సభలను ఎలా వినియోగించుకోవచ్చో ఆయన ఆచరణలో తెలియచేశారు.
బెంగాల్‌ తెభాగా ఉద్యమ కాలంలో జ్యోతిబసు ముఖ్య పాత్ర వహించారు. స్వతంత్ర భారతదేశంలో 11 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ప్రజా ప్రతినిధి బసు. జ్యోతిబాబుగా బెంగాల్‌ ప్రజలు ఆయనను ఆప్యాయంగా పిలుచుకునే వారు. 1977లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జ్యోతిబసు 2000లో స్వచ్ఛందంగా ఆ పదవి నుండి తప్పుకున్నారు. 24 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శ్రమజీవుల కోసం ఆయన అనేక చర్యలు చేపట్టారు. భూసంస్కరణలు చేపట్టి పేదలకు భూపంపిణీ చెయ్యడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగు చేశారు. గ్రామ పంచాయితీలకు అధికారాలు కట్టబెట్టి, నిధులు అందచేసి స్థానిక సంస్థలలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని అమలు చేశారు. తద్వారా ఆ యా గ్రామాల ప్రజల అవసరాలు తీరి అభివృద్ధి చెంది నిజమైన గ్రామ స్వరాజ్యాలుగా మారాయి. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే పోరాటాలకు అండగా ప్రభుత్వం ఉండేది. కార్మికుల పోరాటాలలో పోలీసుల జోక్యం ఉండేది కాదు. ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం జరిగే పోరాటాలకు అండగా ఆయన నిలబడేవారు. ఒక వామపక్ష ప్రభుత్వం ప్రజావసరాలు తీర్చేట్లు, ఉద్యోగ కార్మిక హక్కుల పరిరక్షణకు ఎలా పాలన చేస్తుందనేది జ్యోతిబసు ఆచరించి చూపారు. ఆ పాలన ప్రజా మన్నన పొందింది. ప్రజాబంధుగా ఉన్న జ్యోతిబసుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు.
సిఐటియు సంస్థాపక సమావేశాలు 1970 మే లో కామ్రేడ్‌ జ్యోతిబసు ఆధ్వర్యంలో కలకత్తాలో జరిగాయి. ''కార్మిక వర్గం ఐక్యం కావటానికే ఉన్న సంఘం వీడి, సిఐటియు ఏర్పాటు చేశా''మని నాటి బహిరంగ సభలో చైతన్య పూరిత ప్రసంగం చేశారాయన. అఖిల భారత ఉపాధ్యక్షునిగా సేవలు సైతం అందించారు. తెభాగా పోరాటం, చైనా యుద్ధ కాలం, ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. రెండు సార్లు రాజకీయ దుండగుల దాడిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 1970లలో పాట్నా రైల్వే స్టేషన్‌లో తుపాకి ద్వారా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆయనకు స్వాగతం పలకటానికి వెళ్ళిన బీమా ఏజెంట్‌ ఆ కాల్పుల్లో చనిపోయారు. ఎమర్జెన్సీ కాలంలో బెంగాల్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగించిన ఫాసిస్టు బీభత్సకాండను...ప్రజలతో మమేకమై ఎదుర్కొన్నారు. 1990లలో దేశంలో మతం పేరిట ఉద్రిక్తతలు సృష్టించటానికి ఉన్మాదులు ప్రయత్నించినా, బెంగాల్‌లో వాటికి తావు లేకుండా చేశారు. 1964లో సిపిఐ(ఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నవరత్న నేతలలో జ్యోతిబసు ఒకరు. ఏడు దశాబ్దాల పాటు శ్రామిక పోరాటాలలో ప్రజా ఉద్యమాలతో మమేకమైన జ్యోతిబసు 2010 జనవరి 17న కన్నుమూశారు.
కార్పొరేట్లకు సాగిలపడి సహజ వనరులను, జాతి సంపదను ప్రైవేట్‌ పరం చేస్తున్న పాలకులు, మతం కులం వంటి విభజిత వాదాలతో ప్రజల మధ్య అనైక్యత సృష్టిస్తున్న శక్తులు, తిరోగమన భావజాలంతో నడుస్తున్న ప్రభుత్వాలు ఉన్న పరిస్థితులలో... జ్యోతిబసు నమ్మిన కార్మికవర్గ సిద్ధాంతం, చేసిన కార్యాచరణ మాత్రమే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలవు. కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం, సామాజిక మార్పు కోసం ఆయన తన జీవిత కాలం కృషి చేసిన బాటలో కొనసాగి...ఆ లక్ష్య సాధన కోసం పని చేస్తామని ప్రతినబూనటమే మనం ఆయనకిచ్చే నివాళి.

- ఎం.వి. సుధాకర్‌,
సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, సెల్‌ : 9490098414