Jul 06,2022 06:47

సైబర్‌ నేరగాళ్ళు లోన్‌ యాప్‌లతో యువతను దోచుకుంటున్నారు. సులభ రుణాలను ఎరజూపి ఉచ్చులో పడ్డాక ఒకటికి నాలుగింతలు గుంజుతున్నారు. కట్టలేకపోతే గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్‌ చేస్తూ విచక్షణారహిత సంభాషణలతో మనోవేదనకు గురి చేస్తున్నారు. రుణ గ్రహీతల వ్యక్తిగత డేటా చోరీ చేసి దీన్నుంచి వారి, కుటుంబ సభ్యుల ఫోటోలను సేకరించి వాటిని న్యూడ్‌గా మార్ఫింగ్‌ చేసి మరీ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నయా సైబర్‌ కిరాతకులు మహిళలను సైతం వదిలి పెట్టట్లేదు. ముఖ్యంగా విద్యార్థులు ఈలోన్‌ యాప్‌ ల ఉచ్చులో పడుతున్నారు. లోన్‌ యాప్‌ల ఏజెంట్ల దురాగతాలకు వందలాది ప్రాణాలు దూదిపింజల్లా గాలిలో కలిసిపోతున్నాయి.
      ఎటువంటి ష్యూరిటీ అవసరం లేకపోవటం, అనుకున్నదే తడవుగా ప్రాసెసింగ్‌ జరిగిపోవటం, క్షణాల్లో ఖాతాలో డబ్బులు జమవడంతో యువతను రుణ యాప్‌ లు బాగా ఆకర్షిస్తున్నాయి. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న వెంటనే పాకెట్‌ మనీ చేతికందేస్తోంది. అవసరార్థం కాకుండా యువత ఎక్కువ విలాసాలకే ఈ యాప్‌ ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. రుణం పొందే ఆత్రుతలో కనీసం నియమావళిని చదవకుండా అడిగినదానికల్లా ఓకే అని టిక్‌ చేస్తూ చకచకా ముందుకు సాగిపోతున్నారు. ఇక్కడే అసలు కిటుకు మొదలవుతోంది. బ్యాంకు అకౌంటు, ఆధార్‌ నెంబర్‌, పాన్‌ కార్డు నెంబర్లు వంటి వ్యక్తిగత డేటా అంతా యాప్‌ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి.
       సైబర్‌ నేరగాళ్ళు వీటి ఆధారంగా వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి, వేధిస్తూ వాళ్లకు కావలసినంత డబ్బు గుంజుతున్నారు. ప్రశ్నిస్తే వాళ్లు సేకరించిన డేటాతో ఇష్టా రాజ్యంగా ముప్పుతిప్పలు పెడుతున్నారు. పిల్లలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక, వేదన భరించలేక, ఒకటికి నాలుగింతలైన అప్పు తీర్చలేక ఒత్తిడిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా రుణ యాప్‌ల దందా యథేచ్ఛగా సాగుతోంది. కోవిడ్‌-19 తదనంతర కుటుంబాల్లో ఏర్పడ్డ ఆర్థిక స్థితి నేపథ్యంలో వీటి ప్రభావం పెరిగిపోతోంది. ప్రజల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకొని సైబర్‌ కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు.
        వీటి బారిన పడి మరింత మంది మోసపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మరింత పటిష్టమైన చట్టాలను తీసుకొచ్చి, అమాయకులను దోపిడీ చేస్తున్న అక్రమ రుణ యాప్‌ల నిర్వాహకులను కఠినంగా శిక్షించాలి. వీటి ధన దాహానికి బలైపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. రుణ గ్రహీతలు కూడా సమగ్ర సమాచారం తెలుసుకున్న తర్వాతే, అది గుర్తింపు పొందిన రుణ యాప్‌ అని ధ్రువీకరించిన తర్వాతే ఆ యాప్‌ సేవలు వినియోగించుకోవాలి.
                       - చిలుకూరి శ్రీనివాసరావు, సెల్‌ :8985945506