
ప్రపంచ అందమైన జంతువుల జాబితాలోనున్న కృష్ణ జింకలు తెలుగునేలపై తెల్లారిపోతున్నాయి. భారతదేశ అరుదైన జంతు జాలాల్లో ఒకటి కృష్ణ జింక. ఇది మన రాష్ట్ర అధికార జంతువు కూడా. ఇవి గుంపులు గుంపులుగా లయబద్దంగా సంచరిస్తాయి. చాలా దూరాల నుంచి అలికిడి పసిగట్టగలవు. వాటికడ్డొచ్చిన ఎత్తులను సునాయాసంగా దూకేయగలవు. ఆపద వస్తే చాలా వేగంగా పరిగెడతాయి. జింకల గుంపులు బారులు తీశాయంటే ఎవరైనా సరే తేరిపార చూడాల్సిందే! అటువంటి మన వారసత్వ సంపద ఇప్పుడు సరైన రక్షణ చర్యలు లేక గోదావరి వరదల్లో చిక్కుకుని వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. క్రమక్రమంగా కనుమరుగవుతున్న వాటి ఉనికి భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారనుంది. దట్టమైన అడవుల్లో కాకుండా అభయారణ్యాల్లోను, నదుల మధ్య ఉండే లంక భూముల్లోను, చిత్తడి అడవులలోనూ కృష్ణ జింకలు ఎక్కువగా ఉంటాయి. ఉభయ గోదావరి లంకలో మెండుగానూ, కృష్ణానది లంకల్లోను, కర్నూలు గ్రేట్ ఇండియన్ బట్టమేకపక్షి అభయారణ్యంలోను, మైదాన అరణ్యాలలో అక్కడక్కడా కృష్ణ జింకల సంతతి ఉంది.
ప్రతి ఏటా జులై, ఆగస్టు నెలల్లో గోదావరి నదికి వరదలు రావడం తథ్యం. వీటిని సంరక్షించాల్సిన అటవీశాఖ, వన్య ప్రాణుల సంరక్షణ సమితి ముందు చూపు లేకుండా 'నిమ్మకు నీరెత్తినట్లు' వ్యవహరించడంతో ఏటా సంభవించే వరదలకు అనేక జింకలు బలైపోతున్నాయి. ఈ ఏడాది వరద గరిష్ట స్థాయికి చేరుకోవడంతో వందల సంఖ్యలో జింకలు దయనీయ స్థితిలో జల సమాధి అవుతున్నాయి. ఆ చారునేత్రాలు ఊపిరి నిలుపుకోవడానికి ప్రయత్నించి విలవిలలాడుతూ నీటిలో విగతజీవులుగా మారుతున్న దృశ్యం కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రాణరక్షణ కోసం ఊళ్ళ మీదకొచ్చిన కొన్ని జింకలు కుక్కల దాడులకు గురౌతున్నాయి. మరికొన్ని రోడ్లమీద భారీ వాహనాల కిందపడి ప్రమాదాలకు బలైపోతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలను గోదావరికి వరద ముప్పును అధికారులు ముందే పసిగట్టారు. కానీ సంబంధిత యంత్రాంగం అప్రమత్తం కాకపోవడంతో విలువైన జీవ సంపద ఉసూరుమంటూ మృత్యువాత పడుతోంది.
వయ్యారాలు ఒలకబోసే కృష్ణ జింకల ఫోటోలను వన్య ప్రాణుల సంరక్షణ సమితి గోదారి తీరాన అక్కడక్కడా హోర్డింగులు పెట్టి చేతులు దులుపుకుంది తప్ప సంరక్షణా చర్యలు పెద్దగా కనిపించడంలేదు. అసలు గోదావరి లంకల్లో ఎన్ని జింకలున్నయనే గణాంకాలు కూడా యంత్రాంగం దగ్గర లేకపోవడం నిజంగా నిర్లక్ష్యమే. వరదలే కాకుండా వీటికి వేటగాళ్ళ బెడదా ఉంది. గోదావరి లంకల్లో యథేచ్ఛగా సాగే ఇసుక తవ్వక శకటాల సడి కూడా ఈ మూగజీవాల మనుగడని మట్టుపెట్టేస్తున్నాయి. లంకల్లో చెట్ల కింద ఉండే ఇసుక తిన్నెల్లో జింకల సంతానోత్పత్తికి అనువైన వాతావరణం వుంది. చిన్నపాటి చప్పుడును సైతం తాడలేని ఈ జింకలు శబ్దాలు వినిపిస్తే చెంగుచెంగున ఎగిరి దూరంగా పరుగులు తీస్తాయి. అందుకే వీటిని ఇండియన్ కంగారూస్ అని కూడా అంటారు. స్థానికంగా నల్ల జింకలు అని కూడా పిలుస్తుంటారు. అధికార జంతువని అన్నిచోట్లా దీన్ని ఘనంగా ప్రదర్శిస్తున్నాం. కానీ వాటి సంరక్షణ చర్యల్లో మాత్రం అడుగడుగునా అలసత్వమే.
నిజానికి వన్యప్రాణుల సంరక్షణ కోసం మనకు కట్టుదిట్టమైన చట్టాలున్నా అమలులో నిర్లక్ష్యమే. 1972 వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, హింసించినా, ఆపద తలపెట్టినా శిక్షా నేరం. దీని ప్రకారం ఆరేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడుతుంది. సమగ్ర జీవులను సంరక్షించే 'జీవవైవిధ్య చట్టం' 2002 నుంచి అమల్లోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత 2018 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అధికార చిహ్నాలను ప్రకటించింది. ఇందులో కృష్ణ జింకను అధికార జంతువుగా ప్రకటించింది. ఎంతో హోదా, దర్పమున్న ఈ అధికార జంతువు సంరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు ఉండాలి. కానీ అది ప్రచారం పటోటాపానికే ఉపయోగపడింది.
ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం మన అధికార జంతువుల ఉనికిని సంరక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. గోదావరి లంకల్లో ఇంకా జింకలు ఎన్ని మిగిలి ఉన్నాయనేది డ్రోన్ ద్వారా సర్వే నిర్వహించాలి. జింకలు మసిలే చోట చుట్టుపక్కల ఉన్న ఇసుకతో ఎత్తు మేటలు వేస్తే ఆపద సమయంలో జింకలు ఈ సంరక్షణ కేంద్రాల్లో ప్రాణాలు నిలుపుకుంటాయి. జింకలు నివాస ప్రాంతాల్లో తవ్వకాలను నిలిపివేయాలి. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షించాలి. లంకల్లో జింకల వేటగాళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి.
- చిలుకూరి శ్రీనివాసరావు,
జాతీయ పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీత, సెల్ : 8985945506