- ఎంటియు 1061ని 'ఎ' నుంచి కామన్ గ్రేడ్‌కు మార్పు
- క్వింటాలుకు రూ.20 నష్టపోతామని రైతుల ఆవేదన
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : ధాన్యం సేకరణలో ప్రభుత్వం కిరికిరి చేస్తోంది. అత్యధిక విస్తీర్ణంలో సాగైన వరి వంగడం గ్రేడింగ్‌లో మార్పులు చేస్తూ ఈ నెల 26న ఉత్తర్వులు జారీ చేసింది. 19 ఏళ్లుగా 'ఎ' గ్రేడ్‌గా సేకరిస్తోన్న ఎంటియు 1061 ధాన్యాన్ని కామన్ వెరైటీగా మార్పు చేసింది. ఆర్‌బికెలకు ఇచ్చిన ధాన్యం సేకరణ ఆప్షన్‌లో సార్టెక్స్, నాన్ సార్టెక్స్, కామన్ మూడు రకాలుగా గ్రేడింగ్ చేశారు. ఈ రకం ధాన్యాన్ని కామన్ ఆప్షన్లో నమోదు చేయాలని ఆర్‌బికెలకు తాజాగా ఈ నెల 26న ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. 'ఎ' గ్రేడ్ వెరైటీలకు క్వింటాలుకు రూ.2,060, కామన్ వెరైటీలకు రూ.2040 కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేడ్‌లో మార్పు చేయడంతో ఎంటియు 1061 రకం వంగడాన్ని సాగు చేసిన రైతులు క్వింటాలుకు రూ.20 వరకు నష్టపోనున్నారు. ఈ సీజన్లో వాతావరణం అనుకూలించడంతో ఈ రకం వంగడం అత్యధిక దిగుబడులను ఇస్తోంది. ఎకరానికి 28 క్వింటాళ్లకుపైగా దిగుబడులు వస్తున్నాయి. కామన్ వెరైటీగా నిర్ణయించడంతో ఎకరానికి రూ.560 వరకు రైతుల ఆదాయానికి గండిపడనుంది. కృష్ణా జిల్లాలో మొత్తం 3.96 లక్షల ఎకరాల్లో వివిధ రకాల వరి వంగడాలు సాగు చేశారు. ఎంటియు 1061 వంగడాన్ని అత్యధికంగా 2.50 లక్షల ఎకరాల్లో వేశారు. గ్రేడ్‌లో మార్పుతో ఈ రకం సాగు చేసిన రైతులు రూ.14 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోనున్నారు. ఈ రకం ధాన్యాన్ని ఉమ్మడి గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో కూడా సాగు చేస్తున్నారు.
సాగుపైనా ప్రభావం చూపే అవకాశం
వరి సాగు పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిపోయింది. ఎకరానికి రూ.40 వేల వరకు ఖర్చవుతోంది. చీడపీడలను, అధిక వర్షాల సమయంలో ముంపు బెడదను తట్టుకుంటూ తక్కువ పెట్టుబడితోనే ఎంటియు 1061 వరి వంగడం అధిక దిగుబడులు ఇస్తోంది. 'ఎ' గ్రేడ్‌గా ఉండడంతో కామన్ వెరైటీల కన్నా అధిక ధర లభిస్తోంది.
ఇతర వంగడాలతో పోలిస్తే సాగు ఖర్చు తక్కువగా ఉండడంతో 2003 సంవత్సరం నుంచి రైతులు అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో ధాన్యం సేకరణ ప్రారంభమైన పది రోజుల తర్వాత ఈ రకం వంగడాన్ని కామన్ వెరైటీకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, భవిష్యత్తులో ఈ రకం వరగడం సాగుపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.










