May 22,2023 21:47

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత, రాయలసీమ కథారత్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (84) సోమవారం తెల్లవారు జామున 5.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయనకు భార్య పద్మావతమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు సాహిత్యంలో కథకునిగా, విద్యావేత్తగా, పరిశోధకునిగా నిరంతర సృజనశీలిగా సుప్రసిద్ధులైన ఆయన 1939 జులై పదిన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రంగసాయిపురంలో కేతు వెంకటరెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు. విద్యార్థి దశ నుంచి విశ్వవిద్యాలయ ఆచార్యుల వరకు తెలుగు భాషను, సాహిత్యాన్ని గ్రంథ రచనల ద్వారా, సాహిత్య సభల ద్వారా, ఆకాశవాణి ద్వారా దూర విద్య ద్వారా అందించడానికి కేతు నిరుపమాన కృషి చేశారు. మంచి విమర్శకులుగా పేరుపొందారు. సాహిత్య రచనలో వ్యక్తమయ్యే సామాజికాంశాలే ఏ సమాజ శాస్త్ర సహాయం తీసుకోవాలో నిర్ణయిస్తాయని ఆయన విశ్లేషించారు. విశ్వనాథరెడ్డి అంత్యక్రియలు ఆయన సొంతూరులో బుధవారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఆయన మృతికి రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

  • కేతు విశ్వనాథరెడ్డి మృతి సాహిత్య లోకానికి తీరనిలోటు :  గవర్నరు జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌

1996లో తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కథా రచయిత, నవలా రచయిత, వ్యాసకర్త కేతు విశ్వనాథరెడ్డి మృతి సాహిత్య లోకానికి తీరని లోటని రాష్ట్ర గవర్నరు జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విశ్వనాథరెడ్డి కుటుంబ సభ్యులకు గవర్నరు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

  • ఆయన సేవలు చిరస్మరణీయం : సిఎం

ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం పట్ల సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. సామాజిక సంస్కరణలను ఆవశ్యకతను చెబుతూ ఆయన రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని సిఎం పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించి 2021లో వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

  • తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు : చంద్రబాబు

విశ్వనాథరెడ్డి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజల జీవితాలను, వారి సమస్యలను ముఖ్యంగా రాయలసీమ సామాజిక అంశాలను, బాధలను తన రచనల్లో కళ్లకు కట్టారని, ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

  • తెలుగు సాహిత్యానికి, కళలకు వారి సేవలు మరువలేనివి : సిపిఎం

ప్రముఖ అభ్యుదయ రచయిత కేతు విశ్వనాథ రెడ్డి, ప్రముఖ నటుడు శరత్ కుమార్ మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్ర సంతాపం ప్రకటించారు. తెలుగు సాహిత్యానికి, కళలకు వారు చేసిన సేవలను కొనియాడారు.

  • రాయలసీమకు వన్నె తెచ్చిన విశ్వనాథరెడ్డి : కె నారాయణ, రామకృష్ణ

రాయలసీమకు వన్నె తెచ్చిన కేతు విశ్వనాథరెడ్డి ఇక లేరంటే నమ్మశక్యంగా లేదని, ఆయన మరణం తీరని లోటని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని, మాజీ ఎంపి ఎద్దుల ఈశ్వరరెడ్డి, ఎన్‌ శివరామిరెడ్డి, జె వెంకట రామిరెడ్డి, గజ్జెల మల్లారెడ్డి వంటి వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేశారు.

  • రాయలసీమ వేదనలకు అక్షరరూపమివ్వడంలో ఆయనది గొప్ప ముద్ర : తెలకపల్లి రవి, కెంగార మోహన్‌

భారతీయ సాహిత్యంలో తెలుగు కథను ఉన్నత శిఖరానికి చేర్చిన కథకుడు కేతు విశ్వనాథరెడ్డి మరణం తీరని లోటని సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, అధ్యక్షులు కెంగార మోహన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సంతాప ప్రకటన విడుదల చేశారు. సాహితీ స్రవంతికి ప్రారంభం నుంచి తోడ్పాటునందించి సాహిత్య ప్రస్థానం మాసపత్రికలో అనేక కథలు, వ్యాసాలు అందించారని, కథా సాహిత్యంలో ఆయన చిరస్మరణీయమైన కృషి చేశారని అన్నారు. అభ్యుదయ రచయితల ఉద్యమంలో విశాలాంధ్ర ప్రచురణాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. పాఠ్యపుస్తకాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయ సిలబస్‌ను రూపొందించడంలో భాష మాండలిక ప్రయోగాల అధ్యయనంలో రాయలసీమ వేదనలకు అక్షర రూపమివ్వడంలో ఆయనది గొప్పముద్ర అని పేర్కొనానరు. కేతు విశ్వనాథరెడ్డి మరణం పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.

Ketu-Vishwanath-Reddy-famous-Telugu-story-writer-literature-passed-away



                                                      పాత్రికేయుడుగా ఉద్యోగ జీవితం ప్రారంభం...

విశ్వనాథ్‌ రెడ్డి కడప జిల్లా గ్రామనామాలు అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను ఆయన డాక్టరేట్‌ పొందారు. పాత్రికేయుడుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాదు లాంటి చోట్ల అధ్యాపకుడుగా పనిచేసి డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్‌సిఈఆర్‌టి సంపాదకుడుగా వ్యవహరించారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి వరకు అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాఠ్యప్రణాళికలను రూపొందించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

Ketu-Vishwanath-Reddy-famous-Telugu-story-writer-literature-passed-away


                                                                          సాహిత్య రంగం

విశ్వనాథ్‌ రెడ్డి తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నారు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా పనిచేశారు. విశ్వనాథ్‌ రాసిన సాహితీవ్యాసాలు ''దఅష్టి'' అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో ుశీతీషష్ట్ర bవaతీవతీర అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం ''ఈభూమి'' పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నారు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించారు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్‌ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్‌ మీద వెలువడిన మొట్టమొదటి నవల. విశ్వనాధరెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి చదువుకథలు అనే కథల సంపుటిని సంకలనం చేశారు.

పురస్కారాలు...
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (న్యూ ఢిల్లీ),
భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా),
తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు),
రావిశాస్త్రి అవార్డు,
రితంబరీ అవార్డు
ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.
అధ్యాపకుడుగా
విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం.
వివిధ పత్రికలలో ప్రచురితమైన వీరి కథలు కొన్ని...
1991 కేతు విస్వనాథరెడ్డి కథలు....... ఆంధ్రజోతి వార పత్రిక.
1975 ద్రోహం. విశాలాంధ్ర దిన పత్రిక.
1977 ఆత్మ రక్షణ. వీచిక మాస పత్రిక.
1977 మన ప్రేమకథలు. ఆంధ్ర జోతి మాస పత్రిక.
1978 విశ్వరూపం స్వాతి మాస పత్రిక.
1979 ఆరోజులస్తే... నివేదిత మాస పత్రిక.
1980 పీర్ల సావిడి. స్వాతి మాస పత్రిక.
1991 ఎస్‌.2 బోగీలు. ఉదయం వార పత్రిక.
1997 ఒక జీవుడి ఆవేదన. ఆదివారం ఆంధ్రభూమి.
2001 కాంక్ష రచన మాస పత్రిక.
2003 అమ్మవారి నవ్వు. ఇండియా టుడే.