తిరువనంతపురం : కేరళలోని కాలమస్సేరి వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 3కి చేరింది. మలయత్తూర్‌కి చెందిన 12 ఏళ్ల బాలిక సోమవారం ఉదయం మరణించినట్లు అధికారులు తెలిపారు. కాలమస్సేరిలోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ఉదయం జహోవా సాక్ష్యం పేరిట ప్రత్యేక ప్రార్థనా కూటమిని నిర్వహించారు. ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన వరుస పేలుళ్లలో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఒకరు తొడుప్పుజాకి చెందిన 53 ఏళ్ల కుమారి కాగా, మరొకరిని గుర్తించాల్సి వుందని అధికారులు తెలిపారు.
పేలుళ్లకు తానే కారణమంటూ లొంగిపోయిన నిందితుడు డొమినిక్ మార్టిన్‌ను సోమవారం కొచ్చిలోని ప్రిన్సిపల్ డిస్టిక్ మరియు సెషన్స్ కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితునిపై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.