Oct 08,2023 09:54

తిరువనంతపురం : బిజెపితో చేతులు కలపాలని జెడి(ఎస్‌) అధ్యక్షులు హెచ్‌డి దేవగౌడ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ కేరళ విభాగం తిరస్కరించింది. కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న లెఫ్ట్‌ ఫ్రంట్‌తోనే కలిసి నడవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొచ్చిలో సమావేశమైన కేరళ జెడి(ఎస్‌) యూనిట్‌కు చెందిన కార్యనిర్వాహక కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. 'లౌకికవాదం, సోషలిజం, ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడి ఉన్నందున జెడి(ఎస్‌) కేరళ యూనిట్‌ గత నాలుగున్నర దశాబ్ధాలుగా వామపక్ష ఫ్రంట్‌తో పొత్తును కొనసాగిస్తుంది. బిజెపితో భాగస్వామి కావాలనే నిర్ణయంలో దేవగౌడ చెబుతున్న కారణాలపై మాకు నమ్మకం లేదు' అని జెడి (ఎస్‌) కేరళ యూనిట్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే మాథ్యూ టి.థామస్‌ తెలిపారు. తదుపరి వ్యూహాన్ని రూపొందించేందుకు కార్యనిర్వాహక కమిటీ ఈ నెల 11న మరోసారి సమావేశమవుతుందని చెప్పారు.