Oct 18,2022 15:05

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చియార్డును కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బృందం మంగళవారం పరిశీలించింది. యార్డుకు వస్తున్న మిర్చి రకాలు, క్రయ విక్రయాలు, మిర్చి సీజన్‌ ఎప్పటి నుండి మొదలు అవుతుంది, ఎప్పటికి ముగుస్తుంది, ఎంత మంది రైతులు ఎన్ని క్వింటాళ్ల మిర్చిని యార్డుకు తీసుకువచ్చారు, క్రయ విక్రయాలను ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మిర్చి యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ.. గుంటూరు నుంచి వివిధ దేశాలకు మిర్చి ఎగుమతులు జరుగుతుంటాయన్నారు. రోడ్డు మార్గాన గతంలో పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌కు 15 రోజుల్లో ఎగుమతి చేసేవారమని, ప్రస్తుతం రైల్వే వ్యాగన్ల ద్వారా 36 గంటల్లో రవాణా చేయగలుగుతున్నామని తెలిపారు. సరుకు అమ్మిన సాయంత్రానికే రైతులకు నగదు చెల్లిస్తున్నామని వివరించారు. పంట ఎక్కువగా వచ్చినప్పుడు, ధరలు లేనప్పుడు కోల్డ్‌ స్టోరేజీల్లో పంటలను నిల్వ చేస్తున్నామన్నారు. కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. అనంతరం వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడులోని మిర్చి పంటను ఈ బృందం పరిశీలించింది. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు పెట్టుబడి అవుతుందని రైతు శ్రీనివాసరావు బృందానికి వివరించారు. కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులను రైతులు, అధికారులు సత్కరించి గుంటూరు మిరప కారం ప్యాకెట్లను బహుమతిగా అందించారు. కేరళ బృందంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డి. సజిత్‌ బాబు, సిఎండి సంజీబ్‌ కుమార్‌ పట్జోషి, ప్రదీప్‌ కుమార్‌ ఉన్నారు.