
గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో 2021లో బలవన్మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది 1.64 లక్షల మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) పేర్కొంది. ప్రతి లక్ష మందికి ఆత్మహత్యల రేటు ఇప్పటి వరకు అత్యధికంగా 2010లో 11.3గా నమోదు కాగా 2021లో ఇది 12కు ఎగబాకింది. గృహ సమస్యలు (33.2 శాతం), ఆనారోగ్య సమస్యలు (18.6 శాతం) ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే బలవన్మరణాలకు పాల్పడినవారిలో అత్యధికులు రోజువారీ కూలీలు (25.6 శాతం), గృహిణులు (14.1 శాతం) కావడం గమనార్హం. జీవనోపాధులు మృగ్యమైపోయి..బతుకుజీవుడా అంటూ వలస వెళ్తే కోవిడ్ మహమ్మారి కారణంగా వెళ్లిన చోట పనిలేక..ఉన్నచోటుకు తిరిగి రాలేక దారిమధ్యలోనే దినసరి కూలీకి నూరేళ్లు నిండడం విషాదకరం. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాల మాటున నిబ్బరం కోల్పోతున్న నిరుపేదల నిజజీవితాల దుర్భర స్థితికి ఎన్‌సిఆర్‌బి గణాంకాలు అద్దం పడుతున్నాయి. ముతక బియ్యాన్ని ప్రజలకు విదిల్చి 'ఆత్మ నిర్భర్ భారత్' ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ నిధులన్నీ కార్పొరేట్ మిత్రుల గల్లా పెట్టెల్లోకి చేరిపోవడంతో పేదలంతా నివ్వెరపోయారు.
దేశంలో హింసా ప్రవృత్తి తీవ్రత అధికంగా ఉండే నేరాల సంఖ్య కూడా బాగా పెరిగిపోయినట్లు ఎన్‌సిఆర్‌బి నివేదించింది. అత్యాచారం, కిడ్నాప్, పిల్లలపై అఘాయిత్యాలు, దోపిడీలు, హత్యలు వంటి క్రూరమైన నేరాల నమోదు 2021లో గణనీయంగా పెరిగాయి. స్థూల నేరాల రేటు (ప్రతి లక్ష మంది జనాభాకు) 2020లో 487.8 ఉండగా.. 2021లో 445.9కి తగ్గినట్టు ఎన్‌సిఆర్‌బి పేర్కొంది. వాస్తవానికి గతంతో పోలిస్తే 2020లో నేరాలు తగ్గుముఖం పట్టినట్టు గణాంకాల్లో వెల్లడిం చారు. అప్పటికీ, ఇప్ప టికీ నేరాల నమోదులో తగ్గుదల కనిపించడానికి కోవిడ్ ఆంక్షలు, లాక్‌డౌన్ పర్యవసానాలతో కేసుల నమోదుకు వీలులేకపోవడమే ప్రధాన కారణం. మహమ్మారి ఆంక్షల వల్ల నమోదుకు నోచుకొని నేరాలెన్నో. ఈ కాలంలోనే గృహ హింస బాగా పెరిగిందన్న సంగతి ఎన్‌సిఆర్‌బితో పాటు అనేక సర్వేల్లో తేలింది.
2021లో క్రూర నేరాల సంఖ్య కోవిడ్ ముందు స్థితికి ఎగబాకడం ఆందోళనకర పరిణామం. మహిళలపై 'భర్త లేదా అతని బంధువుల క్రూరత్వం' సంబంధిత నేరాలు 2019లో 30.9 శాతంగా ఉండగా, అది 2020లో 30.2కు తగ్గినట్లు నమోదు కాగా 2021లో ఈ నేరాల శాతం 31.8కి పెరిగాయి. ఫ్యూడల్ వ్యవస్థ అవశేషాల్లో ప్రధాన సమస్యయైన గృహ హింస 5జి రోజుల్లోనూ పెను సవాలుగానే మిగిలిపోవడం మహిళల పట్ల పాలకుల వివక్షాపూరిత విధానాలకు నిదర్శనం. హింసాత్మక నేరాలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినా ఛార్జిషీట్లు దాఖలు చేయడంలో దర్యాప్తు సంస్థలు తీవ్ర అలక్ష్యం వహిస్తున్నాయి. 2020లో ఛార్జిషీట్ల దాఖలు రేటు 75.8 శాతంగా ఉండగా 2021లో అది 72.3 శాతంగా మాత్రమే నమోదైంది. దీనివల్ల నేర నిర్ధారణ రేటు కూడా 59.2 శాతం (2020లో) నుంచి 57 శాతానికి పడిపోయింది. హింసాత్మక నేరాల పట్ల పాలనా వ్యవస్థ నిర్లిప్తతను ఇది ఎత్తిచూపుతోంది. రాష్ట్రాలవారీగా చూసినప్పుడు ప్రతి లక్ష జనాభాకు అస్సాంలో 76.6 గాను, ఢిల్లీలో 57 గాను, పశ్చిమ బెంగాల్‌లో 48.7గా ఉంది. సైబర్ నేరాలు కూడా ఈ కాలంలో 5.9 శాతానికి ఎగబాకడం డిజిటిలీకరణ పర్యవసానాల ప్రమాదాన్ని సూచిస్తోంది. మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరగడం డిజిటల్ అక్షరాస్యత ఆవశ్యకతను, ఆర్థిక మోసాలను నివారించేందుకు కఠిన చట్టాల రూపకల్పన, మౌలిక సదుపాయాల విస్తృతి అవసరాలను తెలియజేస్తోంది. తక్కువ నేరాల నమోదుతో కేరళ మరో మారు సురక్షిత నివాసయోగ్యమైన రాష్ట్రంగా ఆదర్శంగా నిలిచింది. మన రాష్ట్రంలో తీవ్ర నేరాల సంఖ్య నమోదు తగ్గినా..ఆత్మహత్యల విషయంలో దేశంలోనే మూడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే పరిణామం.
నిరుపేదల ఆత్మస్థైర్యాన్ని పెంచాలంటే వారి కనీసావసరాలు తీరే విధంగా ఆదాయం లభించాలి. ఆ మేరకు వారికి ఉపాధి కల్పించాలి. లేదా ఇంకొన్నాళ్లపాటు కనీసం ఆహార పదార్థాలనైనా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. కార్పొరేట్ల కొమ్ముకాస్తున్న కేంద్ర సర్కారు మెడలు వంచి సాధించుకునేలా ప్రజా ఉద్యమాలు సాగించాలి. పోరాడి మనుగడ సాగించడమే మార్గమని సామాన్యులు భావించేలా యావత్ సమాజమూ వారికి అండగా నిలవాలి.