
కర్ణాటకలో ఈ నెల 10వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘోరంగా ఓడిపోయింది. 150 సీట్లు గెలుస్తామని ప్రచారం ప్రారంభించి 66 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది బిజెపి. 'ఆపరేషన్ కమల్'కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు స్పష్టమైన, సురక్షితమైన మెజారిటీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దేశంలోని లౌకిక ప్రజాస్వామ్యవాదులలో సంతోషాన్ని, ఆశను నింపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లు తీవ్ర మతతత్వ ప్రచారం చేసినా, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించలేకపోయారు. ప్రజల జీవితం చాలా దుర్భరంగా మారింది. అవినీతి, దుష్పరిపాలన వల్ల బసవరాజు బొమ్మై ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనదిగా తయారైంది. ఈ ప్రజా వ్యతిరేక సెంటిమెంట్‌ను కాంగ్రెస్ ఓట్లుగా మార్చుకోగలిగింది.
- బిజెపి వ్యతిరేక శక్తులను బలోపేతం చేయాలి
కర్ణాటకలో బిజెపి ఎప్పుడూ స్పష్టమైన మెజారిటీ సాధించలేదు. డబ్బు, హోదా హామీ ఇచ్చి కాంగ్రెస్‌తో సహా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బిజెపి ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఓటింగ్ శాతంలో బిజెపి కంటే కాంగ్రెస్ ఎప్పుడూ ముందుండేది. అంటే కాంగ్రెస్ ప్రాభవం కోల్పోని రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలిగారు. మోడీని, బిజెపి ని గద్దె దించవచ్చునన్న సందేశాన్ని కర్ణాటక ఇస్తోంది. 2019 ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన చాలా రాష్ట్రాల్లో బిజెపి ఓడిపోయింది. హిందీ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హర్యానాలలో మాత్రమే బిజెపి అధికారంలో ఉంది. బీహార్, హిమాచల్‌లు అధికారాన్ని కోల్పోయాయి. పంజాబ్, ఢిల్లీలో పరాజయాలు దయనీయంగా ఉన్నాయి. త్రిపురలో తిప్ర మోత పార్టీ లేకుంటే బిజెపి ఓడిపోయేది. అస్సాం మినహా ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపికి పెద్దగా ప్రభావం లేదు. అంటే వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలవడం కష్టమే. కర్ణాటకలో విజయం సాధించామన్న మిడిసిపాటుతో ఇతరులను విస్మరించనారంభిస్తే, అది బిజెపి వ్యతిరేక శక్తుల సమన్వయానికి ఆటంకంగా తయారవుతుంది. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు అడిగి పోటీ చేసిన కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు కోల్పోయి అధికారం దక్కకపోవడానికి కారణమైందన్న ఆర్‌జెడి మాటను మరిచిపోకూడదు. బిజెపి ని కాంగ్రెస్ ఒక్కటే ఓడించలేదు. అందుకే బిజెపి వ్యతిరేక చిన్న, పెద్ద లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నింటినీ రాష్ట్ర ప్రాతిపదికన సమీకరించేందుకు ప్రయత్నించాల్సిన అవసరముంది.
- రాజకీయ వాస్తవికతను గుర్తించాలి
కర్ణాటకలో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలలో కూడా విజయం సాధిస్తుందని భావించలేం. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజకీయ పరిస్థితి ఉంటుంది. అధికారం కోల్పోయిన అనేక రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి కూడా కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిందన్నది వాస్తవం. ఉదాహరణకు 1967లో తమిళనాడులో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ 55 ఏళ్లు దాటినా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది. మండల్ రాజకీయాల రాకతో 1988-89లో ఉత్తరప్రదేశ్, బీహార్‌లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. 1977లో పశ్చిమ బెంగాల్, 1995లో గుజరాత్, 2000లో ఒడిశాలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ఆ తర్వాత కోలుకోలేదు. ఉత్తరాది రాష్ట్రాలలో ఇదివరకటి బలాన్ని మళ్లీ తెచ్చుకుంటే తప్ప కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని పొందుతుందనుకోలేం. ఈ రాజకీయ వాస్తవికతను స్వీకరించే ఆచరణాత్మక విధానాన్ని అనుసరించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలి. అప్పుడే బిజెపికి వ్యతిరేకంగా ఇతర శక్తులు ఏకం కాగలవు.
- ప్రజావ్యతిరేక ఆర్థిక విధానం, కార్పొరేట్ సేవ
కాంగ్రెస్ ఇంతటి పతనావస్థకు చేరుకోవడానికి ప్రధాన కారణం దాని విధానాలే. నయా ఉదారవాద విధానాలతో ముందుకు సాగడం మొదలు పెట్టడంతో కాంగ్రెస్ వేగంగా పతనం కాసాగింది. రాజీవ్ గాంధీ కాలంలోనే ఈ విధాన మార్పుకు సంబంధించిన ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే నయా ఉదారవాదాన్ని ఆర్థిక విధానంగా స్వీకరించి కార్పొరేట్లకు కలల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొదలెట్టింది పి.వి.నరసింహారావు ప్రభుత్వమే. సామాజిక భద్రతా పథకాలు ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తాయనే సాకుతో ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునే పథకాలను వదిలేశారు. దీంతో పింఛన్ వ్యవస్థ, ఇతరత్రా రద్దు చేశారు. దీంతో పాటు విద్య, ఆరోగ్య రంగాలు ప్రయివేటు రంగానికి తలుపులు తెరిచాయి. ఇవి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. దానితో పాటు కార్పొరేట్లకు ఉచితంగా అందించడమే ఆర్థికాభివద్ధికి ఏకైక మార్గంగా భావించాయి. పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను కూడా తక్కువ ధరకు ప్రైవేటు రంగానికి అప్పగించడం ప్రారంభించాయి. ఈ విధానం వల్ల ఆర్థిక అసమానతలు, పేదరికం పది రెట్లు పెరిగాయి. సిపిఎం, వామపక్షాలు అప్పుడూ ఇప్పుడూ ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. మొదట్లో స్వదేశీ నినాదాలు చేస్తూ నయా ఉదారవాద విధానాన్ని వ్యతిరేకించిన బిజెపి అధికారంలోకి వచ్చాక అదే విధానాన్ని మరింత ఊపుగా అమలు చేయడం మొదలెట్టింది. బహుశా ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగ షేర్ల విక్రయం కోసం మంత్రిత్వ శాఖను ప్రారంభించింది బిజెపి ప్రభుత్వమేనేమో (వాజ్‌పేయి హయాంలో). మోడీ ప్రభుత్వ ప్రధాన లక్షణం కార్పొరేట్ సేవ. అదానీలు, అంబానీలు సూపర్ ధనికులుగా ఎదిగే కొద్దీ పేదలు నిరుపేదలుగా మారుతున్నారు. ఈ విధానం వల్ల ఆర్థిక అసమానతలు, పేదరికం పది రెట్లు పెరిగాయి. సిపిఎం, వామపక్షాలు అప్పుడూ ఇప్పుడూ ఈ విధానాన్ని వ్యతిరేకించాయి.
- కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకుంటుందా?
ఈ విధానంపై పోరాడేందుకు కాంగ్రెస్ విముఖత స్పష్టంగా కనిపిస్తోంది. భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకుగాను మోడీ ప్రభుత్వం మూడు బిల్లులు తెచ్చినప్పుడు, ఈ విధానం పట్ల తమకు అభ్యంతరం లేదన్న కారణంగా కాంగ్రెస్ దానికి వ్యతిరేకంగా రైతుల సమ్మెలో ముందుండేందుకు సిద్ధపడలేదు. యుపిఎ-1 ప్రభుత్వ హయాంలో, వామపక్షాల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి ఫలితంగా మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సి వచ్చింది. అందులో ఉపాధి హామీ పథకం ఒకటి. దీంతో పాటు విద్యాహక్కు చట్టం, అటవీ హక్కుల చట్టాన్ని కూడా ఆమోదించారు. ఈ చట్టాలన్నీ నయా ఉదారవాద తర్కానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు సొంతంగా మెజారిటీ లేనందున, అరవై మందికి పైగా ఎంపీలతో వామపక్షాలు...ఆ ప్రభుత్వానికి కీలకమైన మద్దతు ఇవ్వడంతో వాటిని అమలు చేయాల్సి వచ్చింది. అటువంటి నయా ఉదారవాద వ్యతిరేక చట్టాన్ని రూపొందించడం వలన యుపిఎ ప్రభుత్వానికి ప్రజాకర్షక ప్రతిష్ట లభించింది. అంతేగాక 2009 లోక్‌సభ ఎన్నికలలో మళ్లీ విజయం సాధించడానికి సహాయపడింది. కానీ వామపక్షాల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి ఫలితంగా అవలంబించిన ప్రజాకర్షక విధానాన్ని నీరుగార్చి యుపిఎ-2 ప్రభుత్వం తిరిగి ఉదారవాదం వైపు మళ్లింది. బొగ్గు కుంభకోణం, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం మొదలైనవి ఈ విధానంలో భాగంగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నేపథ్యం కూడా అదే. దీంతో గుణపాఠం నేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతుందా అన్నది ప్రశ్న. అదేవిధంగా మృదు హిందూత్వను విడిచిపెట్టి లౌకికవాదానికి కట్టుబడి ఉండేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలి. కరడుగట్టిన హిందూ మతోన్మాదాన్ని మృదు హిందూత్వ ఓడించదు. నికరమైన లౌకికతత్వంతో మాత్రమే దీనికి పరిష్కారం లభిస్తుంది.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో క్రైస్తవులపై దాడి జరిగినప్పుడు..కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేదన్న ఆరోపణను క్రైస్తవ మత పెద్దలే లేవనెత్తారు. గూండాలు మైనారిటీలను వేటాడుతున్నప్పుడు బాధితులను పరామర్శించడానికి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా లేరన్నది సామాజిక, రాజకీయ విశ్లేషకుల మాట. ఇలాంటి విధానపరమైన లోపాలను సరిదిద్దేందుకు కర్ణాటకలో విజయం కాంగ్రెస్‌కు స్ఫూర్తినిస్తుందని భావించవచ్చు.
వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.వి. గోవిందన్