
ప్రజాశక్తి - ఎఎన్‌యు (గుంటూరు జిల్లా):ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురు, శుక్రవారాల్లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో 900 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారని వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు ముగింపు సభలో పలువురికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ కృషి, పట్టుదల, నిరంతర శ్రమ, సృజనాత్మకతలే విజయ సోపానాలని తెలిపారు. ఇప్పుడు ఉద్యోగం సాధించని వారు నిరుత్సాహపడకుండా మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. విద్యార్థుల భవితకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా వర్సిటీ పరిశ్రమిస్తోందని, భవిష్యత్తులో ప్రతి ఏడాదీ మెగా జాబ్‌మేళా నిర్వహిస్తామని తెలిపారు. వర్సిటీలో చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. చెన్నైకు చెందిన సిటిజన్ ఫర్ చేంజ్ ఇంటర్ నేషనల్ సీనియర్ డైరెక్టర్ అయ్యలరెడ్డి కిరణ్‌బాబు వందకు పైగా కంపెనీలను విశ్వవిద్యాలయానికి చేరువ చేయడంలో చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ పి.వరప్రసాద్‌మూర్తి, ప్రిన్సిపాళ్లు, పాల్గొన్నారు.