Feb 19,2023 06:49

'ఈ గాలి ఈ నేలా ఈ ఊరు సెలయేరు' అంటాడో సినీకవి. పంచభూతాల్లో ప్రధానమైన గాలి, నీరు సమస్త జీవకోటికి జీవనాధారం. నీరు అమూల్యమైన వనరు. ప్రపంచంలో దేనికైనా విశ్రాంతి వుంటుందేమోగానీ నీటికి వుండదు. ప్రకృతిలో అనుక్షణం మేల్కొని వుండేది... ప్రతి నిమిషం ఎక్కడోచోట పారుతూనే వుండేది నీరు. ప్రతి రుతువూ నీటి రుతువే. నీరుంటే ప్రతి రుతువు వసంతమే. 'జలం ఒక సంస్కృతి/ జలం ఒక చారిత్రక కృతి/ జలం సకల విన్యాసాల ఆవిష్కృతి' అంటారు డా.ఎన్‌.గోపి. 'చెరువు/ ఊరుకు బువ్వగిన్నె/ చెరువు/ ఊరుకు అమ్మ పాలరొమ్ము/ చెరువు/ ఊరుకు నాన్న గుండె నది' అంటాడో కవి. చెరువు, సరస్సు, నది, సముద్రం... మనిషితో పెనవేసుకున్న నీటి బంధం. అది మనిషికి ప్రకృతి ప్రసాదించిన వరం.
మనిషి ప్రాథమిక హక్కయిన నీటిని సరళీకరణ కబళిస్తోంది. తాగడానికి నేనిస్తాను... నువ్వు కొనుక్కో అంటోంది. లక్షలాది మంది ప్రజలు తాగునీటి కోసం మైళ్లదూరం నడిచి వెళ్లాల్సి వస్తోంటే... లాభాలను పెంచుకోడానికి, వచ్చిన లాభాలను పంచుకోడానికి నీటి వనరులను ప్రైవేటుపరం చేయ పూనుకోంటోంది బిజెపి ప్రభుత్వం. పెరుగుతున్న కాలుష్యాన్ని సాకుగా తీసుకుని పీల్చే గాలిని సైతం ప్రైవేటీకరించనుంది 'నా నీళ్లు బహుళజాతి కంపెనీలకు/ అమ్మకం సరుకైనాయి/ నా నీళ్లు బాటిల్‌లో నింపబడి/ మార్కెట్‌ అయినాయి/ నా నీళ్లు నాకు కాకుండాపోయాయి/ నా నీళ్లను నేనే కొనుక్కు తాగాలి/ ఇప్పుడు నా నీళ్లకు నేను పరాయిదాన్ని' అంటారు కవయిత్రి మహెజబిన్‌. నీటి వనరులు కార్పొరేట్లకు ధారాదత్తం అవుతున్నాయి. మంచినీటి మీద కార్పొరేట్ల అజమాయిషీ, పెత్తనం పెరిగింది. ప్రాణిగా వుండవలసిన నీరు... అమ్మకపు వస్తువై... సీసాల్లో నిల్వ సరుకైంది. అందరికీ సురక్షిత నీటిని అందించాలనే సంకల్పనానికి బదులు డబ్బును చెల్లించేవారికే నీటిని అందించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. నీటి వ్యాపారం కోసం ప్రపంచ ప్రమాణాలను అధ్యయం చేయడానికి నీతి ఆయోగ్‌ ప్రణాళికలు సిద్ధం చేయడమే ఇందుకు నిదర్శనం. తద్వారా ప్రైవేట్‌ సంస్థలు నీటిపైనా, నీటి వనరులపైనా చట్టబద్ధమైన యజమానులుగా ఉంటాయి. ప్రజలందరి ప్రకృతి వనరు బంగారం, వెండి వలే అమ్ముడుపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మేరకు ప్రతి మనిషికి రోజుకు 40 లీటర్ల నీరు అవసరం. నీరు వాణిజ్య సరుకుగా మారిన తరువాత గొంతు తడుపుకునే వీలుంటుందా అన్నది ప్రజలను కలవరపెట్టే అతిపెద్ద ప్రశ్న. ఇప్పటికే పేదల కుటుంబాల్లో అత్యధికులు, అధిక సమయం నీటి సేకరణపైనే దృష్టి పెట్టాల్సి వస్తోంది. భారత్‌ వంటి దేశాల్లో నీటి వ్యాపారం అనే ఆలోచన సమానత్వ భావనకే సవాలుగా నిలుస్తుంది. అందరికీ తాగునీరు, సాగునీరు అనే దానికి బదులుగా డబ్బులు చెల్లించేవారికే నీరు అనే దిశగా ప్రభుత్వాల ఆలోచనలు సాగుతున్నాయి. అంతేకాదు... నీటి వ్యాపారంతో ఏర్పడే కొత్త అసమానతలు... నీటి ఘర్షణలు, యుద్ధాలకు దారి తీస్తాయి.
నీతి అయోగ్‌ కుటిలనీతి... దేశ ప్రజల నీటి భద్రతకు తీరని ముప్పు. ఇది జల విషాదానికి... జన విలాపానికి కారణమౌతుంది. స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ, ప్రభుత్వాలు ఈ బాధ్యతను గాలికొదిలి, నీటి వనరులను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నాయి. ఇప్పటికీ బాటిళ్లలో అమ్మకపు సరుకైన నీటికంటే... మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో సరఫరా అవుతున్న నీరే స్వచ్ఛమైనదని నిపుణులు చెబుతున్నారు. బాటిళ్లలోని నీటిలో వుండాల్సినంతగా ఖనిజాలు, లవణాలు వుండటంలేదు. దానివల్ల ఆ నీరు అనారోగ్యానికి కారణమౌతోంది. ప్రజలకు నీటిని అందించే బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగించి, వాటికి అవసరమైన నిధులను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రకృతి వనరులను కాపాడుకుంటూ, భూగర్భజలాలు ఒట్టిపోకుండా... ప్రతి బొట్టును ఒడిసిపెట్టి, దాచిపెట్టి భవిష్యత్తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మనిషికి జీవనాధారమైన నీటితో వ్యాపారం చేసే ప్రభుత్వాలను, ప్రకృతిని విధ్వంసం చేస్తూ జలవనరులను హరిస్తున్న కార్పొరేట్లను అడ్డుకోవాల్సిన బాధ్యతా ప్రజలదే.