Jul 26,2023 14:22
  • సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత తెలియని సిఎం
  • ఒక్క జివోతో 102 ప్రాజెక్టుల పనులు రద్దు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రచరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం రాయలసీమకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై టిడిపి కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీనికి నాలుగేళ్లలో సీమ ప్రాజెక్టుల పనులు జరిగిన తీరే నిదర్శనమని చెప్పారు. వైసిపి ప్రభుత్వం మొత్తం 198 ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు మొత్తాన్ని ప్రీక్లోజర్‌ చేసిందని, అందులో రాయలసీమలో 102 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. వీటిలో ప్రధానంగా కర్నూలులో 9, చిత్తూరులో 29, కడపలో 14, అనంతపురంలో 38, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు 16 ఉన్నాయని వివరించారు. ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులను పూర్తిచేయరని, తనకు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు మాత్రం అవసరం లేకపోయినా సిఎం పనులు అప్పగిస్తారని విమర్శించారు. గుండ్లకమ్మ ఏమైంది? పులిచింతల గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయి? సుంకేశుల ప్రాజెక్టు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 2020 నాటికి పూర్తిచేస్తామన్న తెలుగుగంగ, హంద్రీనీవా, సోమశిల, ఏబిఆర్‌ ఫేజ్‌-2 ప్రాజెక్టులకు అతీగతీ లేదన్నారు. మడకశిర బ్రాంచ్‌కెనాల్‌ ప్రాజెక్టు నిర్వహణ గాలికి వదిలేశారన్నారు. టిడిపి హయాంలో వేదవతి ప్రాజెక్టుకు రూ.1,942 కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు. జరిగిన పనులకు ఒక్కపైసా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. గాలేరు నగరి ఫేజ్‌-1, 2 పనులు వామికుంట, సర్వరాయసాగర్‌ వరకు వెళ్లి ఆగిందని, వైసిపి ప్రభుత్వం రూపాయి ఖర్చుపెట్టలేదని పేర్కొన్నారు. 93శాతం పనులు పూర్తయిన ఎస్‌ఆర్‌బిసి రిజర్వాయర్‌ను పూర్తి చేయడానికి నాలుగేళ్లు సరిపోలేదని విమర్శించారు. టిడిపి ముచ్చుమర్రికి రూ.549కోట్లు ఖర్చుపెడితే వైసిపి కేవలం రూ.5కోట్లతో సరిపెట్టి ప్రాజెక్టు నిర్వహణను పూర్తిగా పక్కనపెట్టిందని చెప్పారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు తమ ప్రభుత్వ హయంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.8291కోట్లు ఖర్చు చేస్తే, వైసిపి ప్రభుత్వం రూ.2011 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తాను అధికారంలోకి వచ్చాక పట్టిసీమ నిర్మించి, కృష్ణా జలాలను సీమకు అందించానని తెలిపారు. నదుల అనుసంధానం ప్రాజెక్టులో ఇది తొలి అడుగు అని చెప్పారు. గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులతో కలిపి మొత్తం రాష్ట్రంలో చిన్నవి పెద్దవి 69 నదులు ఉన్నాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ నీటిని నేరుగా వివిధ మార్గాల్లో ఇచ్చాపురం వరకు అందించేలా ప్రణాళికలు వేశామన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే నదుల అనుసంధానంలో భాగంగా రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తామన్నారు. జగన్‌ ప్రీక్లోజర్‌ చేసిన 102 ప్రాజెక్టుల్ని మరలా తెరిపించి పూర్తిచేస్తామని చెప్పారు.