రాజమహేంద్రవరం: విశాఖ ఉక్కు ప్రైవేటుపరం అవుతుంటే ఆపలేని దౌర్భాగ్య స్థితిలో ఎపి సీఎం వైఎస్ జగన్ ఉన్నారని , రానురాను ప్రజల్లో తన విశ్వసనీయతను కొల్పోతున్నారని టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. 151 సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన జగన్.. ఇప్పటివరకు తీసుకురాలేక పోయారని అన్నారు. అధిక ధరలతో రాష్ట్ర ప్రజల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో గోరంట్ల మీడియాతో మాట్లాడారు.''సీఎం జగన్ అధికారం చేపట్టిన మూడేళ్లలోనే రూ.9 లక్షల కోట్లు అప్పు చేశారు. 20వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. జగన్ పుట్టిన రోజు ఎంతైనా ఖర్చు పెడతారు.. కళాకారులకు పింఛన్ ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం వద్ద డబ్బులుండవు. మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉండటం విశ్వసనీయతా? ప్రజల్లో జగన్ తన విశ్వసనీయత కోల్పోయారు. బంధుగణానికి రూ. కోట్లు ఇచ్చి సలహాదారులుగా పెట్టుకున్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాల్లో వైకాపా ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది. జగన్‌ను సాగనంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజలే ఇందుకు నిదర్శనం. అవినీతిలో వైసిపి నాయకులు బరితెగించారు'' అని గోరంట్ల మండిపడ్డారు.










