Apr 24,2023 12:34

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : రైతు భరోసా, పిఎం కిసాన్‌ల డబ్బులు పడాలంటే... వన్‌ బి కి ఆధార్‌ లింక్‌ , వెబ్‌ లైన్‌ లింక్‌ ఉండాలి అనే నిబంధన ఉండటంతో రైతులంతా ఆధార్‌ లింక్‌ కోసం వీఆర్వో వద్దకు వెళుతున్నారు. గ్రామ రైతులకు ఆధార్‌ లింక్‌ చేయాలంటే... తనకు డబ్బులివ్వాలని లేకపోతే లింక్‌ చేయబోనని వీఆర్వో తేల్చి చెప్పుతుండటంతో.... గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం ఆత్మకూరు మండల పరిధిలోని తలుపురు గ్రామ రైతులు ప్రజాశక్తితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. వీఆర్వో రెవెన్యూ కార్యాలయంలో గత 6 నెలలుగా రెగ్యులర్‌ రెవెన్యూ తహశీల్దార్‌ లేనప్పటికీ, మండల పరిధిలోని తలుపురు రెవెన్యూలో పనిచేస్తున్న విఆర్‌ఓ వన్‌ బి అడంగలకు ఆధార్‌ లింక్‌ కావాలంటే రైతులు డబ్బులు ఇవ్వకుండా పని జరగట్లేదు అని వాపోయారు. రైతు భరోసా కేంద్రంలో రైతు భరోసా పిఎం కిసాన్‌ డబ్బులు పడాలంటే వన్‌ బి కి ఆధార్‌ లింక్‌, వెబ్‌ లైన్‌ లింక్‌ ఉండాలని నిబంధనలు పెట్టడంతో తామంతా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నామనీ కానీ డబ్బులు లేనిదే పనులు జరగట్లేదని గ్రామ రైతులు కంటతడిపెట్టారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి వీఆర్వో పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.