
ఆధిపత్య కులాల దురహంకారాన్ని, దౌర్జన్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఘటన కారంచేడు మారణహోమం. ఈ నరమేధంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. తర్వాత కొడుకు హత్యకు ప్రత్యక్ష సాక్షి అయినందుకు దుడ్డు ఆలీసమ్మను విష ప్రయోగంతో హత్య చేశారు. నేటికీ బాధితులు ఆశించిన స్థాయిలో నేరస్తులకు శిక్షలు పడలేదు. ఆనాడు జరిగిన అన్యాయాన్ని దినపత్రికలు పతాక శీర్షికలతో ప్రపంచానికి తెలియజేశాయి. ఎంతోమంది కవులు, కళాకారులు, ఉద్యమకారులు, సామాజికవేత్తలు...కారంచేడు ఘటనను తమ ఆటపాటల ద్వారా ఈ సమాజానికి తెలియజేసి వారిలో ఆత్మస్టైర్యం నింపారు. ఆనాటి పోరాటాల నుంచి నిత్యం స్ఫూర్తి పొంది దేశంలోని దళితులందరూ ఏటా జులై 17వ తేదీన ''కారంచేడు మృతవీరుల సంస్మరణ' దినంగా జరుపుతుంటారు. కారంచేడు ఉద్యమం దేశంలో అనేక చట్టాల రూపకల్పనకు ప్రేరణగా నిలిచింది. 1989 ఎస్సీ/ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్టు (అత్యాచారాల నిరోధక చట్టం) రావడానికి కారణమైంది. 1991లో జరిగిన చుండూరు నరమేధం ఘటనలో ప్రత్యేక కోర్టును ఘటన జరిగిన ఊరిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటివరకు హరిజనులుగా, ఎస్సీలుగా పిలువబడుతున్న వారిని దళిత, బహుజన అనే చైతన్యవంతమైన పదాల్ని ప్రజలకి పరిచయం చేసింది కారంచేడు ఉద్యమం. దళితుల సంక్షేమ చట్టాల రూపకల్పనలో కారంచేడు ఘటన ప్రభుత్వాలకు ఒక రిఫరెన్సులా నేటికీ ఉపయోగపడుతుంది. కారంచేడు మృతవీరులు అందించిన స్ఫూర్తితో దళిత బహుజన సమాజం ముందుకు నడవాలని ఆశిస్తూ మృతవీరులకు జోహార్లు.
- డా|| మున్నంగి నాగరాజు, కారంచేడు బాధితుడు.