Sep 25,2023 08:48

నౌరోశామ్‌ శరణార్థి శిబిరం (వెస్ట్‌బ్యాంక్‌): యూదు దురహంకార ఇజ్రాయిల్‌ తాజాగా మరో ఘాతుకానికి పాల్పడింది. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ ఉత్తర ప్రాంతంలోని నౌరోశామ్‌ శరణార్థి శిబిరంపై ఆదివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఇజ్రాయిలీ సైన్యం దాడి చేసి ఇద్దరు పాలస్తీనీయులను కాల్చి చంపినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చనిపోయిన ఇద్దరిని ఒసైడ్‌ అబుల్‌ అలీ(21), అబ్ద్‌ అల్‌ రెహ్మాన్‌ అబు దగాష్‌ (32)గా గుర్తించారు. ఇజ్రాయిల్‌ సైన్యం హమాస్‌ కార్యాలయాలను, ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడింది. శరణార్ధి శిబిరంలోని మౌలిక సదుపాయాలను నాశనం చేసింది. పాలస్తీనా అథారిటీని దెబ్బ తీసి ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ఎవరూ సవాల్‌ చేయకూడదన్న దాంతో ఇజ్రాయిల్‌ ఈ విధమైన అఘాయిత్యాలకు తెగబడుతోంది. ఇటీవల కాలంలో పాలస్తీనీయులపై దాడులు పెరిగిపోయాయి. ఈ ఏడాది ఇంతవరకు 241 మంది అమాయక పాలస్తీనీయులను ఇజ్రాయిల్‌ సైన్యం పొట్టనపెట్టుకుంది.