- 24 గంటల్లో 700 మంది పైగా పౌరుల మృతి
- 400కి పైగా లక్ష్యాలపై వైమానిక దాడులు
గాజా, జెరూసలేం : అమెరికా, బ్రిటన్ అండదండలతో ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. విరామం లేకుండా వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. ఆసుపత్రులపైనా బాంబుల వర్షం కురిపిస్తోంది. వందలాది మంది ప్రాణాలను తోడేస్తోంది. మంగళవారానికి గడిచిన 24 గంటల్లోనే ఇజ్రాయిల్ సాగించిన వైమానిక దాడుల్లో గాజా ప్రాంతంలో 704 మంది చనిపోయారు. ఈ నెల 7న దాడులు ప్రారంభమైన తర్వాత 24 గంటల వ్యవధిలో మృతి చెందిన వారి సంఖ్య ఇదే అధికం. దీంతో ఇజ్రాయిల్ దాడిలో గాజా, పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 5100కు చేరిందని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో సుమారు 2000 మంది చిన్నారులున్నట్లు పేర్కొంది. వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయని, దాదాపు పది లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలిపోయారని తెలిపింది. ఆసుపత్రుల్లో జనరేటర్ల కోసం ఇంధన నిండుకుందని, చిన్నారులు, రోగులు అవస్థలు పడుతున్నారని గాజా ఆసుపత్రుల అధికారులు దయనీయస్థితిలో వేడుకుంటున్నా ఇజ్రాయిల్ కనికరించడం లేదు. ఇంధన ట్యాంకులు ఆసుపత్రులకు చేరకుండా సరిహద్దు ప్రాంతాల్లోనే నిలిపివేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఎ) సైతం గాజాకు మానవతా సాయం అత్యవసరంగా అందాల్సివుందని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ప్రత్యేకించి ఇంధనం చాలా కీలకంగా మారిందని, ఈ దశలో పూర్తి స్థాయిలో సురక్షితమైన మానవతా సాయం అందాల్సి వుందని డబ్ల్యుహెచ్‌ఎ ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల డైరెక్టర్ డాక్టర్‌ర ఇక్ బ్రెన్నన్ కోరారు. తమ సహాయ కార్యకర్తలకు ఎలాంటి రక్షణ కల్పించడం లేదని ఐక్యరాజ్య సమితి సంస్థలు తెలిపాయి. గాజాలోకి మరింత సాయం వెళ్ళేలా చూడాలని ఐక్యరాజ్య సమితి ఇజ్రాయిల్‌ను మరోమారు కోరింది. వేలాదిమంది ప్రజలు విపత్కర పరిస్థితుల్లో వున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
- యుద్ధానికి కాలుదువ్వుతున్న పదాతి దళాలు
ఇజ్రాయిల్, గాజాకు సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో ఇజ్రాయిల్ ట్యాంక్‌లు, బలగాలు మోహరించి వున్నాయి. పదాతి దళ దాడికి ఆదేశాలు కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. గతరాత్రి గాజాలో 400కి పైగా మిలిటెంట్ లక్ష్యాలపై దాడిచేశామని ఇజ్రాయిల్ మిలటరీ తెలిపింది. ముగ్గురు డిప్యూటీ కమాండర్లతో సహా పెద్ద సంఖ్యలో హమస్ మిలిటెంట్లను హతమార్చామని వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయిల్‌కు తమ పూర్తి మద్దతు వుంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రకటించారు. మంగళవారం టెల్ అవీవ్ చేరుకున్న ఆయన నెతన్యాహుతో భేటీ అయ్యారు. అయితే హమస్‌తో యుద్ధం చేసే సమయంలో నిబంధనలు అతిక్రమించరాదని ఆయన స్పష్టం చేశారు.