Oct 29,2023 15:02

గాజా  :  గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్‌ అటు వైమానిక దాడులు, ఇటు భూతల దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిపై ఇజ్రాయిల్‌  దాడికి దిగింది. రోగులతో పాటు వేలాది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న ఈ ఆస్పత్రిపై వైమానిక దాడి చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రి కింద హమాస్‌ కమాండ్‌ పోస్ట్‌ ఉందంటూ ఇజ్రాయిల్‌ ఆరోపిస్తోంది.

హమాస్‌పై ఇజ్రాయిల్‌ యుద్ధం '' రెండో దశ '' కు చేరుకుంటుందని ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు బెంజిమన్‌ నెతన్యాహూ ప్రకటించిన మరుసటి రోజు ఈ దాడులు చేపట్టడం గమనార్హం. వైమానిక, భూతల, సముద్రం మీదుగా దాడులు చేపట్టేందుకు వీలుగా గతవారం గాజా సరిహద్దులోకి యుద్ధ ట్యాంకులను, సైన్యాన్ని మోహరించింది. గాజాలో వైమానిక దాడులను పెంచుతున్నామని ఇజ్రాయిల్‌ సైనిక ప్రతినిధి డేనియల్‌ హగరీ కూడా ప్రకటించారు. అలాగే క్షేత్రస్థాయిలో పదాదీ బలగాలను పెంచి భూతల దాడులను విస్తరింపజేస్తున్నామని వెల్లడించారు.

ఇజ్రాయిల్‌ భూతల దాడులను పెంచితే వేలాదికి పైగా పౌరులు మరణించే అవకాశం ఉందని ఐరాస మానవ హక్కుల హై కమిషనర్‌ వోల్కర్‌ టర్క్‌ హెచ్చరించారు. శుక్రవారం నుండి గాజాలో ఇంటర్నెట్‌తో పాటు టెలీ కమ్యూనికేషన్‌ను నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు.

ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇప్పటి వరకు 7,703 మంది మరణించినట్లు గాజా వైద్య శాఖ మంత్రి తెలిపారు. వీరిలో 3,500 మందికి పపైగా చిన్నారులు ఉన్నట్లు ప్రకటించారు.