నబ్లస్ : ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌పై దాడి చేసి అనేక మందిని కాల్చి చంపిన ఇజ్రాయిల్ తాజాగా మళ్లీ విరుచుకుపడింది. ఇజ్రాయిల్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్లు మృతి చెందారు.. ఇరు పక్షాల మధ్య హింస పెచ్చరిల్లకుండా వుండేందుకు అర్ధవంతమైన రాజకీయ క్రమం చేపట్టాలంటూ ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. వెస్ట్ బ్యాంక్ ఉత్తర ప్రాంత నగరమైన నబ్లస్‌పై ఇజ్రాయిల్ మిలటరీ దాడి సందర్భంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ఇద్దరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ సైనికులు కూడా గాయపడ్డారని ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. శుక్రవారం ఉదయం నబ్లస్‌లోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ బలగాలు పాత సిటీలోని ఒక ఇంటిని చుట్టుముట్టాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జెనిన్ పట్టణంపై దాడులకు ప్రతీకారంగా గురువారం పాలస్తీనా యోధుడు నబ్లస్ సమీపంలో ఇజ్రాయిల్ పైనికుడిని కాల్చి చంపారు. ఆ దాడికి ప్రతి దాడిగా శుక్రవారం నాటి కాల్పులు జరిగాయి.










