Oct 25,2023 15:15

జెరూసలెం :   ఇజ్రాయిల్‌ గాజాపై దాడులను కొనసాగిస్తోంది. గాజాపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడిఎఫ్‌) బుధవారం స్పష్టం చేసింది. ఐడిఎఫ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ హెర్జీ హలేవీ మీడియాతో మాట్లాడుతూ.. ఒక మాట స్పష్టంగా చెప్పదలచుకున్నామని, దేశ దక్షిణ సరిహద్దులో ఉన్న సిబ్బంది గాజాపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. శత్రువుపై దాడి చేయడానికి ప్రతి నిమిషాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.

హమాస్‌ ఉగ్రవాదుల వివరాలు అందించాలని  ఇజ్రాయెల్‌  డిఫెన్స్‌ ఫోర్స్‌ కోరింది. ఉగ్రవాదుల గురించి  చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, వారికి, వారి నివాసానికి రక్షణ కల్పించే బాధ్యత ఇజ్రాయెల్‌ తీసుకుంటుందని హామీ ఇచ్చింది. మీరు ప్రశాంతంగా బతకడంతోపాటు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ మనవతా సహాయాన్ని చేయాలని స్థానికులను హెచ్చరించింది. మీ ప్రాంతంలో బంధీలుగా ఉన్నవారి వివరాలు అందించాలని పేర్కొంది.  వివరాలు అందించిన వారికి నగదు బహుమతి కూడా అందిస్తామని తెలిపింది.