జెరూసలెం : ఇజ్రాయెల్, పాలస్తీనాల్లో ఎన్నో రోజులుగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌లో షబ్బత్ (వారంలోని ఏడవ రోజు అంటే శనివారం) సందర్భంగా పాలస్తీనా మిలిటెంట్ల గ్రూపు హమాస్ ఇజ్రాయెల్‌లో రాకెట్ దాడి చేసింది. ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా దాదాపు 5 వేలకు పైగా రాకెట్లతో హమాస్ దాడి చేసినట్లు తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ గ్రూప్ దాడితో గాజా పరిసర ప్రాంతాల్లో రాకెట్ల మోతతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. దీంతో గాజా సరిహద్దు 80 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయెల్ ఎమర్జెనీని విధించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో హమాస్ గ్రూప్‌కి చెందిన ఉగ్రవాదుల చొరబాటుపై ఆ దేశ రక్షణ దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ రాకెట్ దాడి అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు త్వరలో భద్రతా దళాధిపుతల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. తన చర్యలకు హమాస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నెతన్యాహు ప్రభుత్వం హెచ్చరించింది.
కాగా, గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి అనేక మంది హమాస్ మిలిటెంట్లు చొరబడ్డారు. గాజా పరిసర ప్రాంతాల్లోని నివాసితులు తమ ఇళ్లలోనే ఉండమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్‌లో పేర్కొంది. పవిత్ర నగరమైన జెరూసలెంతో సహా ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా పలుచోట్ల రాకెట్ దాడి ప్రభావం పడింది. ఇక ఈ దాడి తామే చేసినట్లు హమాస్ గ్రూపు వెల్లడించింది. 'ఆపరేషన్ ఆల్-అక్సా ఫ్లడ్'ను ప్రారంభించినట్లు హమాస్ ప్రకటించింది. మొదటి సమ్మెలో భాగంగా 20 నిమిషాల్లో ఐదు వేల రాకెట్లను పేల్చినట్లు హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ ఆక్రమణ నేరాలను అంతం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా హమాస్ గ్రూప్ పేర్కొంది.
హమాస్ రాకెట్ దాడిలో ఇజ్రాయెల్‌కి చెందిన ఓ వృద్ధ మహిళ మృతి చెందింది. అలాగే 15 మంది గాయపడ్డారని అత్యవసర సేవల విభాగం తెలిపింది. ఈ రాకెట్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ పౌరులు షెల్టర్ల దగ్గర ఉండాలని, గాజా సమీపంలో ఉన్నవారు తమ ఇళ్లల్లోనే తలదాచుకోవాలని నెతన్యాహు ప్రభుత్వం పౌరుల్ని కోరింది.