Aug 27,2023 06:26

తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ వచ్చే ఎన్నికల కోసం తమ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజు నుంచి కమ్యూనిస్టు పార్టీలపై అవహేళనలూ అపహాస్యాలూ, ఆరోపణలూ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. బిఆర్‌ఎస్‌లో టికెట్‌ రానివారి నిరసనలు, ధిక్కారాలు, తిరుగుబాట్ల వార్తల కంటే వామపక్షాల భంగపాటు పేరిట కథనాలు, భవిష్యత్‌ ఎన్నికల అడుగులపై ఉచిత సలహాలు, ఊహాగానాలు ఎక్కువయ్యాయి. షరామామూలుగా కమ్యూనిస్టులెప్పుడూ ఇంతే అనో, అసలీ ఎన్నికల రాజకీయాలే తప్పనో ఈసడింపులు సరేసరి. తప్పెవరిది దెప్పెవరికి అన్నట్టు ఇక్కడ కమ్యూని స్టులపై విసుర్లు, వికృత వ్యాఖ్యానాలు దేనికో బోధపడదు. ముంజేతి కంకణానికి అద్దం అన్నట్టు అన్నీ కళ్ల ముందు జరిగాయి. అధినేతల విన్యాసాలు అందరూ చూశారు. ఇలా జరగవచ్చనే సందేహాలు ముందే పుష్కలంగా వినిపించాయి. అయినా తీరా జరిగాక ఇందులో ప్రధాన పాత్రధారులనూ సూత్రధారులనూ వారి వారి ఉద్దేశాలనూ అవకాశవాద వ్యూహాలను వదలిపెట్టి, ఒకే విధానంతో ఒకే మాట మాట్లాడుతున్న కమ్యూనిస్టులపై దాడికి దిగడం వింతల్లో వింత. సందర్భం ఏదైనా సారాంశం ఏమైనా తేలిగ్గా దాడికి దొరికేది కమ్యూనిస్టులేనని కొంతమంది ఉద్దేశం. కొన్ని మీడియాల అంచనా. కమ్యూనిస్టుల స్వంత పాత్రనూ ఉద్యమాలనూ తక్కువ చేసి చూపడం, ఎన్నికలలో వారితోనో వీరితోనో కలిపి మాత్రమే చూపడం, అందుకు మళ్లీ వారినే నిందించడం గేలి చేయడం ఈ తరహా విమర్శకులకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్నది అలాంటి ప్రహసనమే. ఇందులోనే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయా లనూ కలగలిపి ఓ రాయి విసిరి కక్ష తీర్చుకునేవారు మరికొందరు. ఈ పరిణామాలపై ఉభయ కమ్యూని స్టు పార్టీల రాష్ట్ర నాయకత్వాలూ విడివిడిగానూ ఉమ్మడిగానూ చర్చించి చెప్పవలసింది చెప్పాయి. భవిష్యత్‌లో ఏం చేయాలనేదానిపై ఆయా కమిటీలు సమీక్షిస్తున్నాయి. ఆ నిర్ణయాలు ఎలాగూ వస్తాయి, పాలక పార్టీలలో వలెగాక వామపక్ష పార్టీలలో సమిష్టిగా తీసుకున్న విధాన నిర్ణయమే శిరో ధార్యమవుతుంది. కాకపోతే సందట్లో సడేమియా తరహాలో ఈ చాటున వాస్తవాలను వక్రమార్గం పట్టించే వారికి వాస్తవాలతోనే జవాబు చెప్పవలసి వస్తున్నది.

బిజెపిపై పోరాటం, మునుగోడు విజయం

వాస్తవానికి ఈ కథ ఎక్కడ మొదలైంది? కెసిఆర్‌ హఠాత్తుగా ఒక రోజున బిజెపి మతోన్మాదం, కేంద్ర పెత్తనం, ప్రధాని మోడీ నిరంకుశ పోకడలపై తీవ్ర భాషలో ధ్వజమెత్తారు. వామపక్షాల జాతీయ నాయకులతో చర్చలు జరిపారు. బిఆర్‌ఎస్‌గా జాతీయ రూపం తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నాటికి బిఆర్‌ఎస్‌ దాదాపు ఎన్నికల సంఘం గుర్తింపు పొందింది. అయినా మునుగోడు ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌గానే పోటీ చేశారు. ఆ ఎన్నికలో వామపక్షాల మద్దతు కోరడం, వారు కీలకంగా సహకరించడం జరిగాయి. నిజానికి అది సిపిఐ గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానమైనా వామపక్షాలు మనస్ఫూర్తిగా సహకరించాయి. అప్పుడే బిజెపి కేంద్రం ఆపరేషన్‌ ఫాంహౌస్‌కు పాల్పడింది. మరోవైపున ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ పేరిట కెసిఆర్‌ ప్రభుత్వంపైన, కుటుంబంపైన దారుణమైన దాడి సాగించింది. మునుగోడు విజయం వామపక్షాల మద్దతువల్లనేనని అందరూ అంగీకరించారు, ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా బిజెపి నిరంకుశత్వానికి, కక్ష సాధింపులకూ వ్యతిరేకంగా మిగిలిన ప్రతిపక్షాలతో కలసి బిఆర్‌ఎస్‌ గొంతు కలిపింది. ఈడీ దాడులను నిలవరించాలని సుప్రీం కోర్టులో మిగిలిన వారితో పాటు కేసు వేసింది. ప్రతి సందర్భంలోనూ బిజెపికి వ్యతిరేకంగా కలసి పనిచేస్తామని సంకేతాలిస్తూ వచ్చారు. వామపక్షాలు సహజంగానే అందుకు సానుకూలంగానే స్పందించాయి. వీలైనన్ని లౌకిక పార్టీలను బిజెపి మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా సమీకరించాలని కోరుకునే వామపక్షాల వైఖరి కారణంగానే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వంటి వారు హైదరాబాద్‌ వచ్చినప్పుడు కెసిఆర్‌ను కలిసి మాట్లాడారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శులు కూడా కలిశారు. ఈ అన్ని సమయాల్లోనూ కూడా మీడియా ఎన్నికల పొత్తుల గురించి అడగడం, బిజెపికి వ్యతిరేకంగా లౌకిక పార్టీలు ఒక తాటి మీదకు రావడం అవసరమని వారు చెప్పడం జరుగు తూ వచ్చింది. తెలంగాణ ఖచ్చితంగా ఏం జరుగుతుందనేది వారెప్పుడూ చెప్పింది లేదు.

నిజంగా జరిగిందేమిటి? ఎవరి విధానం మారింది?

గవర్నర్‌ తమిళసైతో ప్రభుత్వం పట్ల ప్రతికూల వైఖరి తీసుకోవడం, బిల్లులను నిర్ణయాలను నిలిపివేయడం, ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్‌ షా వంటి వారు అప్పటి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజరు వంటి వారు కెసిఆర్‌పై తీవ్రంగా దాడి చేయడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. పార్లమెంటు ఓటింగులోనూ బిఆర్‌ఎస్‌ ప్రతిపక్షాలతో బిజెపి వ్యతిరేక వైఖరినే తీసుకుంది. ఇన్ని కారణాల వల్ల నిర్దిష్టంగా ప్రతిపాదనలు, స్పష్టమైన చర్చలు జరగక పోయినా బిఆర్‌ఎస్‌, వామపక్షాల సర్దుబాట్లు వుంటాయనే భావన బలపడింది. సరైన సమయంలో కెసిఆర్‌ నిర్ణయం తీసుకుంటారని కెటిఆర్‌ వంటి వారు చెబుతూ వచ్చారు. మరోవైపున కమ్యూనిస్టులకు ఒక అసెంబ్లీ, ఒక కౌన్సిల్‌ స్థానమివ్వాలని కెసిఆర్‌ భావిస్తున్నట్టు మీడియా కథనాలు ఇచ్చింది. మధ్యలో బిఆర్‌ఎస్‌ కీలక నేతలు కొందరు కెసిఆర్‌ దూతలుగా లేక పార్టీ తరపు నాయకులుగా పేర్లతో సహా ఇదే ప్రతిపాదన తెచ్చినపుడు కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనంగీకారం తెలిపాయి. కెసిఆర్‌తో ముఖాముఖి మాట్లాడాలని ప్రతిపాదించాయి. వారికి చెప్పడమే గాక ఆయనను కలుసుకోవాలనే సూచన బహిరంగంగానే చేశాయి. కెసిఆర్‌ మాటల్లో బిజెపిపై విమర్శల తీవ్రత తగ్గి కాంగ్రెస్‌పై దాడి పెరుగుతున్నదనే అంశం ఈలోగా చర్చనీయమైంది. కవితపై కేసు ద్వారా మోడీ ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నట్టు వార్తలు వస్తున్నా వామపక్షాలు తమ విధానం యథాతథంగా కొనసాగించాయి. ప్రాంతీయ పాలక పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం బిజెపితో చేతులు కలపడం వల్లనే అది బలపడిందనీ బిజెపి వ్యతిరేక రాజకీయ కూటమి నిర్దిష్ట రూపం కూడా ఆ క్రమంలో ఎన్నికల తర్వాత గాని స్పష్టం కాదని సిపిఎం చాలాసార్లు చెప్పింది. నిజానికి సీతారాం ఏచూరి దేశంలో ఎన్నికల ఫలితాల తర్వాత (పోస్ట్‌ పోల్‌) మాత్రమే కూటములు సాధ్యమని చాలాసార్లు చెప్పారు. బిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌, బిజెపిల స్థానే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడం గురించి మాట్లాడినపుడు కూడా అందులో సవాళ్లను వామపక్షాలు ఎన్నడూ విస్మరించింది లేదు. బిజెపి వ్యతిరేక లౌకిక పక్షాల ఐక్యత, అందులో కాంగ్రెస్‌ కూడా వుండాల్సిన అవసరం గురించి వైఖరి మార్చుకున్నదీ లేదు.

నిరాధార ఆరోపణలెందుకు?

కెసిఆర్‌, నితీశ్‌కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ వంటి వారు తామే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అనేక కథనాలు వచ్చాయి. వామపక్షాలు తమ విధానాన్ని బిఆర్‌ఎస్‌ నాయకత్వానికి కూడా స్పష్టంగా చెప్పాయి. కెసిఆర్‌ తప్ప మిగిలిన వారు నెమ్మదిగా కలసి రావడంతో ఈ క్రమంలో 'ఇండియా' కూటమి ఏర్పడింది. ఇందులో ఏదీ కొత్త విషయం గానీ ఏకపక్షంగా లోలోపల జరిగింది కానే కాదు. ''తెలుగు రాష్ట్రాలలో కమ్యూనిస్టుల ధోరణి వారి జాతీయ ప్రాధాన్యాలకు భిన్నంగా కనిపిస్తున్నది'' అని ఒక తెలుగు పత్రిక సంపాదకుడు రాయడం నిరాధార ఆరోపణ. ఆ విధానాన్ని నిలబెట్టడం కోసమే వారు ఇంత ఓపిగ్గా క్లిష్ట పరిస్థితుల మధ్య పోరాడవలసి వచ్చింది. కమ్యూనిస్టులతో అవగాహన అంటూ ప్రతినిధులను పంపించి, తామే ఏకపక్షంగా ముగించి తమ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బిఆర్‌ఎస్‌ నేతలు లేదా వారి మీడియా ఇప్పుడు ఇండియా కూటమిలో వామపక్షాల చేరిక వల్ల ఇలా జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదం. సూటిగా చెప్పలేని ఇరకాటం, కేంద్రం ఒత్తిడి వంటి రాజకీయ కారణాలు వుండొచ్చునని చాలామంది భావించడానికి కారణమదే. బిజెపిపై వున్న పెద్ద ఫిర్యాదే అది.

సముచిత విధానంతో ముందుకు

ఏ ఒక్కరోజు వామపక్షాలు తమ జాతీయ విధానాన్ని దాచిపెట్టుకోవు. బిజెపికి వ్యతిరేకంగా మరిన్ని లౌకిక పార్టీలను కలుపుకుని పోరాడాలనేది వామపక్షాల నికరమైన వైఖరి. ఆ మాటకొస్తే ఎ.పి లో వైసిపి, టిడిపి, జనసేన బిజెపికి అనుకూలంగా లోబడి వుండటంపై సిపిఎం ఎప్పుడూ విమర్శ ఆపింది లేదు. ''ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ తన దుష్పరిపాలనతో ప్రజాందోళనలకూ అవకాశం కల్పిస్తున్నది. అయినా వారి తీరు అక్కడ నిస్పృహనే కలిగిస్తున్నది'' అని పై సంపాదకుడు రాస్తున్నారు. నిజంగా ఆ మూడు ప్రాంతీయ పార్టీలు అసహన రాజకీయాలతో పరస్పర దూషణలలో మునిగి తేలుతూ నిజమైన సమస్యలను విస్మరిస్తుంటే వాటిపై పోరాడుతున్నది ప్రజల ఎజెండాను ముందుకు తెస్తున్నది వామపక్షాలు ప్రజా సంఘాలు మాత్రమే. మరి ఈయన చెబుతున్న నిస్పృహకు కారణమేమిటో అర్థం కాదు. బహుశా బిజెపి అండ కోసం నిరీక్షిస్తున్న పార్టీలతో కలసి పోతామని ప్రకటించాలని కోరుతున్నారేమో. ఎ.పి సిపిఐ విషయమై ఏవో ఊహాగానాలు కొందరు చేస్తే సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు తాము అలా భావించడం లేదని సమాధాన మిచ్చారు. బిజెపితో కలసి పని చేసే పార్టీలతో వామపక్షాలు కలసే ప్రసక్తి వుండదని కూడా అన్నారు. ఈ జాతీయ విధానానికి ఏ రాష్ట్రం మినహాయింపు కాదు, ఇంత స్పష్టమైన విధానం, పారదర్శక వైఖరి వుండకూడదనన్నట్టు కొందరు మాట్లాడడం మరీ విడ్డూరం. దాగుడు మూతలు ఆడాల్సిన అవసరం వామపక్షాలకేముంది? వారేదో బిఆర్‌ఎస్‌ గురించి భ్రమపడిందీ ఆశపడి భంగపాటుకు గురైంది అంతకన్నా లేదు. కరివేపాకులా తీసేశారనీ, పాలక పార్టీల ముందు మోసపోయారని కొందరు సానుభూతి వొలకబోయడం కూడా వృథా ప్రయాసే. ఇన్ని దశాబ్దాలలోనూ పాలక పార్టీల తీరు తెన్నులు, తమ స్వంత వైఖరిని ఉద్యమాలనూ కాపాడుకోవలసిన అవసరం కమ్యూనిస్టులకు తెలియవనుకోవడం పొరబాటు. ఏదోలా పొత్తు పెట్టుకోవడమే పరమార్థమైతే ఇంత చర్చ వుండేదే కాదు. అలాగే ఇప్పుడు ఏం జరగాలనేది కూడా రాజకీయ పరిణామాలను అవకాశాలను విధానపరంగా నిర్ణయించుకుంటాయి. ఈ క్రమంలో ఎవరు నేర్చుకోవలసింది వారే నేర్చుకోకతప్పదు. ప్రమాదకరమైన ప్రతీఘాత శక్తులతో పోరాడవలసిన కర్తవ్యం, మతోన్మాదాన్ని నిరోధించాల్సిన సవాలు తీవ్రత తక్కువ చేస్తూ ప్రజాస్వామిక శక్తులను అవహేళన చేయడం తగని పని.

తెలకపల్లి రవి