Jun 16,2022 06:18

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 29 పంచదార ఫ్యాక్టరీలు వుండేవి. నేడు కేవలం ఐదు మాత్రమే నడుస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం అనేక మంది భూస్వాములు పంచదార ఫ్యాక్టరీల యజమానులుగా మారారు. వారిలో ఉయ్యూరు మహారాజా, నైజాం నవాబుకు చెందిన నిజాం షుగర్స్‌, తణుకు ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌లు ఈ కోవకు చెందినవారే. రైతులు స్వాతంత్య్ర స్ఫూర్తితో మహిళల మెడ లోని మంగళ సూత్రాలు అమ్మి కో-ఆపరేటివ్‌ పంచదార ఫ్యాక్టరీలకు షేర్‌ ధనం చెల్లించారు. కో-ఆపరేటివ్‌ రంగంలో సాధారణ రైతుల వాటాలతో పంచదార ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. ఈ కో-ఆపరేటివ్‌్‌ ఫ్యాక్టరీలు మూడు తరాల నుంచి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. అటువంటి కో-ఆపరేటివ్‌ ఫ్యాక్టరీలను నేడు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల కోసం షుగర్‌ ఫ్యాక్టరీలను ఒక పథకం ప్రకారం మూసివేస్తున్నది. నష్టాలొచ్చాయనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 6 షుగర్‌ ఫ్యాక్టరీలను మూసివేస్తూ 2022 మార్చి 16న జీవో నెం.15ను జారీ చేసింది. దీని తరువాత ఈ సంవత్సరం నుంచి మూసివేసిన అనకాపల్లి జిల్లా లోని ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలు, విజయనగరం జిల్లా లోని భీంసింగి ఫ్యాక్టరీలను తరువాత శాశ్వతంగా మూసివేస్తారు. దీనివల్ల వేలాది మంది చెరకు రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ ఫ్యాక్టరీలన్నీ నష్టాల పేరుతో కొంతకాలం మూసివేసి, ఇప్పుడు శాశ్వతంగా మూసివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీ, గాజుల మాండ్యం షుగర్‌ ఫ్యాక్టరీ, కడప షుగర్‌ ఫ్యాక్టరీ, నెల్లూరు జిల్లా లోని కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ, గుంటూరు జిల్లాలో జంపని షుగర్‌ ఫ్యాక్టరీ, అనకాపల్లి పి.వి రమణ షుగర్‌ ఫ్యాక్టరీలు ఇందులో వున్నాయి. ప్రతి ఫ్యాక్టరీ లోను 50 నుంచి 100 ఎకరాలు భూములున్నాయి. ఈ ఆరు ఫ్యాక్టరీలలో వున్న వందలాది ఎకరాలను కబ్జా చేసి, అస్మదీయులకు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఈ కంపెనీలు మూసివేసినా ఆందోళన రాకుండా వుండేందుకు రైతులకు బకాయిలు చెల్లిస్తామని, కార్మికులకు వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీిం అమలు చేస్తామని...ఈ జీవో ద్వారా రూ.105.59 కోట్లు అప్పుగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ చర్య రైతులను, కార్మికులను తడిగుడ్డతో గొంతు కోయడమే. అశేష త్యాగాలతో నిర్మించిన కో-ఆపరేటివ్‌ పంచదార రంగాన్ని నిలువునా ఉరి తీయడమే.
దేశంలో పంచదార రంగంలో, పంట అభివృద్ధిలో అనేక మార్పులొచ్చాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పంచదార రికవరీ 9 నుంచి 12 శాతం అటూఇటే. మేలిమి వంగడాల వాడడం వల్ల పంచదార రికవరీ ఇతర రాష్ట్రాల్లో పెరిగినా మన రాష్ట్రంలో 9 శాతం లోపే వుంది. కేంద్రం ఇచ్చే మద్దతు రేటుతో పాటు ఇతర రాష్ట్రాలన్నింటా చెరకు సలహా ధర బాగా పెరిగింది. అంతే కాకుండా కొన్ని రాష్ట్రాలు చెరకు రవాణా ఖర్చులు, కటింగ్‌ ఖర్చులలో కొంత భాగం చెల్లిస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సహాయం చెరకు రైతులకు ఏమీ చేయడంలేదు. అందువల్లనే మన రాష్ట్రంలో పంచదార ఉత్పత్తి తగ్గింది. ముఖ్యంగా మన పొరుగునే వున్న కర్ణాటకలో చెరకు ఉత్పత్తి బాగా పెరిగింది. మన రాష్ట్రంలో ఆధునికమైన పంచదార పరిశోధన కేంద్రాలున్నా అవి నిరుపయోగంగా వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరాల తరబడి బకాయిలు చెల్లించకుండా వాయిదాలు వేస్తున్నది. చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు రూ.32 కోట్లు పైగా బకాయిలు చెల్లించాలి. కార్మికులకు జీతాలు మరో రూ.3 కోట్లు చెల్లించాలి. అప్పులు తెచ్చి పంటలు పండించి ఫ్యాక్టరీకి చెరుకు తోలిన తర్వాత కూడా రైతులకు సంవత్సరాల తరబడి బకాయిలు చెల్లించకపోతే రైతు ఏ విధంగా బతకగలడు? రైతులను అనివార్యంగా చెరకు పంట వదిలేసే విధంగా ప్రభుత్వం కావాలని బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్నది. చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ తమ పంచదార మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ డిపోల్లో ప్రజలకు అందించేందుకు సివిల్‌ సప్లై డిపార్ట్‌మెంట్‌కు సరఫరా చేస్తున్నది. కాని రాష్ట్ర ప్రభుత్వం పంచదార బిల్లులు ఫ్యాక్టరీలకు చెల్లించడంలేదు. రైతులకు బకాయిలు పడడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పంచదార ఫ్యాక్టరీల మూసివేతకు ఒక పథకం ప్రకారం అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం సాగుతున్నది. దేశవ్యాప్తంగా పంచదార వాడుక కంటే ఉత్పత్తి అధికంగా పెరిగింది. 2016-17లో 2.03 కోట్ల టన్నుల ఉత్పత్తి కాగా 2017-18లో 3.25 కోట్ల టన్నుల ఉత్పత్తి పెరిగింది. సాధారణంగా దేశ అవసరాలకు ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు 50 లక్షల టన్నులను గోడౌన్‌లో స్టాక్‌ ఉంచుతాయి. కాని నేడు విదేశాలకు పంచదార ఎగుమతులు అనుమతించినా 96 లక్షల టన్నుల పంచదార స్టాక్‌ గోడౌన్లలో మూలుగుతున్నది.
దేశంలోని అదనపు పంచదారను ఎలా ఉపయోగించాలి?
మన రాష్ట్రం లోని ప్రైవేట్‌ కంపెనీలు కెసిపి షుగర్స్‌ (ఉయ్యూరు), చిత్తూరు (ఎస్‌ఎన్‌జె షుగర్స్‌), ఇఐడి ప్యారీ కంపెనీలు డిస్టలరీల ద్వారా ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. తద్వారా లాభాలు గడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే అదనపు పంచదారను ప్రతి షుగర్‌ ఫ్యాక్టరీ లోను తమ పంచదార ఉత్పత్తిలో 20 శాతాన్ని ఇథనాల్‌గా మార్చుకోవచ్చు. దీనికి అనుగుణంగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ 2-6-21న నోటిఫికేషన్‌ జారీచేసింది. అంతేకాకుండా ఇథనాల్‌ ఫ్యాక్టరీలు పెట్టడం కోసం సింగిల్‌ విండో ప్రాజెక్టు పేరుతో రూ.100 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వడానికి 2022 మార్చి 24న నిర్ణయం చేసింది. ఈ స్కీమ్‌ను అమలు చేస్తే మన రాష్ట్రంలో ఒక్క షుగర్‌ ఫ్యాక్టరీని కూడా మూసివేయవలసిన అవసరం లేదు. అన్ని ఫ్యాక్టరీలు కూడా లాభాల్లోకి వస్తాయి. విశాఖ జిల్లాలోని అనకాపల్లి, ఏటికొప్పాక, తాండవ, చోడవరం ఫ్యాక్టరీలో ఒక చోట ఇథనాల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే 4 ఫ్యాక్టరీలు లాభాల్లోకి వస్తాయి. నాలుగు ఫ్యాక్టరీలు తమ ఫ్యాక్టరీల లోని 20 శాతం పంచదారను ఇథనాల్‌గా మార్చడానికి ఉపయోగించవచ్చు. ఇథనాల్‌ ప్లాంట్‌ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చ పెట్టనక్కర్లేదు. రూ.100 కోట్లు నేరుగా కేంద్ర ప్రభుత్వం లోన్‌ ఇస్తుంది. అంతేకాకుండా గతంలో ఇథనాల్‌ ఉత్పత్తిపై జిఎస్టీ 18 శాతం నుండి 5 శాతం తగ్గించింది. మన దేశంలో ఆయిల్‌ కంపెనీల్లో పెట్రోలియం ఉత్పత్తిలో (పెట్రోల్‌, డీజిల్‌ వగైరా) ఉత్పత్తికి 8 శాతం ఇథనాల్‌ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం మన దేశంలో ఆయిల్‌ కంపెనీలకు 7.29 కోట్ల లీటర్లు అవసరం వుంది. కాని మన దేశంలో ఇథనాల్‌ 2.7 కోట్లు లీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. ఒక వంతు దేశంలో ఉత్పత్తి అయితే రెండు వంతులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనం దిగుమతి చేసుకునే దేశాల్లో ఉక్రెయిన్‌ ఒకటి. ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల దిగుమతి సమస్య మరింత తీవ్రమైంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇథనాల్‌ ప్లాంట్లను 2025 నాటికి విస్తారంగా పెంచి స్వయంసమృద్ధిని సాధించాలని నిర్ణయించింది. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటే పంచదార ఫ్యాక్టరీల సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతుల పట్ల, కార్మికుల పట్ల తప్పుడు వైఖరి అవలంభిస్తున్నది. ఇప్పటికైనా చెరకు రైతులకు ప్రోత్సహించే విధానాన్ని, పంచదార ఫ్యాక్టరీలను సక్రమంగా నడిపే విధానాన్ని అమలు చేయాలి. కాని పాలక వర్గానికి రియల్‌ ఎస్టేట్ల మీద, కార్పొరేట్ల మీద వున్న అభిమానం రైతులు, కార్మికుల పట్ల లేదని అర్ధమౌతున్నది. కనుక రైతులు, కౌలుదారులు, కూలీలు, కార్మికులు ఐక్యంగా రాష్ట్రంలో పెద్ద ఉద్యమం నడపవలసిన కర్తవ్యం నేడు ఎంతైనా వుంది.

narsigarao

 

 

 

 

 

 

 

 

 

 

 వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు 
సిహెచ్‌. నరసింగరావు