
దేశంలోని అన్ని రకాల వాహనాలు టోల్ ప్లాజా ద్వారా వెళుతూ టోల్ పన్ను చెల్లిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రోడ్లు నిర్మించినందుకు తిరిగి రావలసిన పెట్టుబడిని లాభంతో సహా కాంట్రాక్టరు రాబట్టుకోవడానికి టోల్ పన్నులను వసూలు చేస్తున్నట్లు మనం నమ్ముతున్నాం. ఇది నిజమేనా? వాస్తవానికి రహదారుల అభివృద్ధి సెస్ పేరుతో ప్రతి లీటర్ పెట్రోల్ పైన రూ.5, ప్రతి లీటరు డీజిల్ పైన రూ.2 అదనంగా వసూలు చేస్తున్నారు. 2017-18 బడ్జెట్ కాలం నుండి మోడీ ప్రభుత్వం దీన్ని 'రోడ్డు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్'గా మార్చేసింది. దీని అర్థం ఏమంటే ఈ మొత్తాన్ని రోడ్డు నిర్మాణానికి, నిర్వహణకు ఉపయోగించాలి. పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ శాఖ లెక్కల ప్రకారం (పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ) 2021-22 ఆర్థిక సంవత్సరంలో 30,849,000 మెట్రిక్ టన్నుల పెట్రోలు, 76,659,000 మెట్రిక్ టన్నుల డీజిల్ అమ్ముడుపోయింది. దానిపై ప్రభుత్వం రోడ్డు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ కింద 2,70,000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇదే ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 1000 టోల్ ప్లాజాల ద్వారా 34,778 కోట్ల రూపాయలను కూడా వసూలు చేసింది. మౌలిక వసతుల అభివృద్ధి సెస్ వసూలు చేసిన తర్వాత మరలా టోల్ పన్ను వసూలు చేయడం ఏ విధంగా న్యాయం? పన్ను ఎంత వసూలు చేసింది, ఎంత ఖర్చు చేసింది అనే విషయంలో పారదర్శకత లేదు. చివరకు ప్రభుత్వం టోల్ రేట్ నిర్ణయించే ముందు లేదా దానిని పెంచే ముందు నోటీసు ఇచ్చి ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. కానీ అవేమీ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం చేస్తున్నారు.
ఇక రెండో విషయం ఏమంటే...రోడ్ల మీద ప్రతి రోజు ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి? ఎన్ని సంవత్సరాలు లాభంతో కూడిన పెట్టుబడిని టోల్ పన్ను ద్వారా తిరిగి వసూలు చేసుకోవాలి? అంచనా వేసి టోల్ చార్జీలు నిర్ణయించాలి. నిర్దిష్ట కాల పరిమితి తర్వాత టోల్ పన్ను వసూళ్లను నిలిపివేయాలి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే చాలా టోల్ ప్లాజాలు వారి నిర్ణీత గడువు కాలం దాటినా ఇంకా టోల్ పన్నును వసూలు చేస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా-ఎన్.హెచ్.ఎ.ఐ) టోల్ చార్జీలను ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉన్నది. ఎన్.హెచ్.ఎ.ఐ ఇప్పటికే ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది ప్రజలను తప్పుదారి పట్టించి దోపిడీ చేయడమే. భారత ప్రభుత్వం ప్రజలపై ఈ విధంగా దాడి చేస్తున్నప్పుడు మనం మౌనంగా, స్పందించకుండా, ప్రశ్నించకుండా ఉండగలమా?
వాహన యజమానులు, ప్రజలు మార్చి 31వ తేదీన మధ్యాహ్నం 12.00 గంటల నుండి 12.10 గంటల వరకు (పది నిమిషాల పాటు) వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేసి నిరసన తెలియ జేయాల్సిందిగా విజ్ఞప్తి.
- ఆర్. లక్ష్మయ్య, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి.