Aug 17,2023 06:34

మణిపూర్‌పై ప్రధాని నోరు విప్పడానికి ఏకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాల్సి వచ్చింది. ఐనప్పటికీ దిద్దుబాటు చర్యలు వుండబోతున్నాయన్న సంకేతాలు రాలేదు సరికదా, పూర్తిగా ప్రతి విమర్శలకే పరిమితమయ్యారు. సాక్షాత్తూ ప్రధానే ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగితే పరివారమంతా అదే చేస్తుందిగా! రాహుల్‌ గాంధీ చేసిన ఒక సంజ్ఞను...ఫ్లయింగ్‌ కిస్‌గా భావించి భంగపడిన స్మృతి ఇరానీ గారికి మహిళలను నగంగా ఊరేగించినా బాధ కలగలేదు! ఇన్నేళ్ల మోడీ పాలనలో ప్రధానంగా కనిపిస్తున్నది ఏమంటే... అన్యాయాన్ని వ్యతిరేకించిన వారిపైనే దాడి జరుగుతున్నది. ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనను దేశం కళ్ళారా చూసింది. జరిగిన 72 రోజుల తర్వాత గాని ఈ అంశం బాహ్య ప్రపంచం దృష్టికి రాలేదు.
జరిగిన అఘాయిత్యాలను, జరగని పోలీసుల చర్యలను ఖండించడం ఒక బాధ్యత. అలా ఖండించినప్పుడు మోడీ అంధభక్తులు విద్వేషాలతో ఊగిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు మరొక రాష్ట్రంలో జరగలేదా? మానభంగాలు, మర్డర్లు మరెక్కడా జరగలేదా? అంటూ సమర్ధించుకుంటూ ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు. మహిళలపై జరిగిన అకృత్యాలను సమర్థించుకునేదా సంస్కారం అంటే? మహిళలకు జరిగిన అన్యాయాలపై తిరగబడిన ఒక యువకుడి తల నరికి ఇంటి ముందున్న తడికెకు వేలాడదీసిన ఫోటో జులై 22వ తారీకున ఓ తెలుగు పత్రికలో దర్శనమిచ్చింది. వెంటనే భక్తులు రంగంలోకి దిగి ''కాశ్మీరీ పండిట్లకు జరిగిన అన్యాయం సంగతి చెప్పండి'' అంటున్నారు. జరుగుతున్న అన్యాయాలన్నింటికీ చారిత్రక తప్పిదాలే సమాధానాలా? బిజెపి నాయకురాలు విజయశాంతి, తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి స్మిత సబర్వాల్‌ లాంటివాళ్ళు ట్విట్టర్‌ వేదికగా ఈ అంశాన్ని ఖండించినందుకు వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇదేనా సంస్కారం అంటే? జగన్మాత, భారత మాత, కాళీమాత అంటూ ఏవేవో పేర్లు పెట్టి మహిళలకు గౌరవం ఇస్తున్నట్టుగా ఫోజులు కొట్టేవాళ్ళు మహిళలపై జరుగుతున్న దాడులను కనీసం ఖండించడానికి మొహం చాటేస్తున్నారు. ఇది సిగ్గుచేటు కాదా? మత ఛాందసవాదులు, ముఖ్యంగా రాజకీయాలను మతంతో ముడిపెట్టి, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలను నడిపిస్తున్న నేటి పాలకులు వారి అనుయాయులు, వారి మాధ్యమాలు ఎన్నడూ మహిళల గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే ఆధిపత్య భావజాలంలో అది అసాధ్యం.
ఇక తమ ఆగడాలను కప్పిపుచ్చుకోవడానికి దేశం, మతం అభద్రతలో ఉన్నాయనే ముసుగును కప్పుకుంటున్నారు. 'దేశంలోకి మయన్మార్‌ ప్రాంతం నుండి రోహింగ్యాలు చొరబడుతున్నారు. ఇది మయన్మార్‌, చైనాల కుట్ర' అంటూ అసత్య ప్రచారాలతో ఊదరగొడుతున్నారు. పదేళ్ల నుంచి పాలిస్తున్న వారు, దేశ సరిహద్దులను తమ హద్దులలో పెట్టుకున్న వారు, ఈ మాట అంటుంటే నమ్మడానికి మనకున్న వివేకం ఏమైనట్లు. ప్రతి సంఘటనను విదేశీ కుట్రతో ముడి పెట్టడం కుసంస్కారం కాదా? ఇక మణిపూర్‌లో హిందూ మతం అభద్రతలో పడిందంటూ క్రైస్తవ మతం ఆధిపత్యం చెలాయిస్తుందంటూ మరో అసత్య వాదనకు నిస్సిగ్గుగా తెర తీస్తున్నారు. మైదాన ప్రాంతంలో నివసించే వారంతా మైతేయులని, వారంతా హిందువులని, అదేవిధంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారంతా కుకీ జాతికి చెందిన గిరిజన క్రైస్తవులని తెలుస్తుంది. దేశంలో ఎక్కడైనా కొండ ప్రాంతంలో ఉన్న వారికి రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. కొండ ప్రాంతంలో ఉన్న భూమిని ఇతరులు ఎవరూ కొనకుండా 370 అధికరణం కింద ఆంక్షలు ఉన్నాయి. మరి ఈ రోజు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మైదానంలో ఉండే మైతేయులకు ఎస్టీ హోదా కల్పించడంలో ఉన్న ఆంతర్యం ఏమంటే కొండ ప్రాంతాల్లో కూడా వాళ్ళు భూమిని కొనవచ్చు, సొంతం చేసుకోవచ్చు. కొండ లోయల్లో విరివిగా పండే నల్ల మందు వంటి వాణిజ్య పంటలను, విలువైన ఖనిజాలను హస్తగతం చేసుకోవడం కోసమే కదా ఈ రకమైన రాజకీయ ఎత్తుగడ బిజెపి ప్రభుత్వం వేసింది! పేదరికపు నిష్పత్తి గిరిజనులకు మించిన స్థాయిలో మిగతా సమూహాల్లో ఉన్నదా? అయినప్పటికీ బిజెపి రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా తన రాజకీయ నిర్ణయాన్ని ఏ నాటి నుంచో ప్రకటిస్తూనే ఉన్నది. ఇది చాలదా వారి అసలైన ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడానికి? ఈ ఆర్థిక ఆధిపత్యపు అంశాన్ని పక్కనపెట్టి...జాతుల మధ్య, మతాల మధ్య జరుగుతున్న రచ్చగా బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇది తెలియని అంధ భక్తులు హిందూ మతం ప్రమాదంలో పడింది, భవిష్యత్తులో ఇతర మతాలు ఆధిపత్యం చెలాయిస్తాయి, అనే న్యూనతాభావంతో అనవసర విద్వేషాలకు లోనవుతున్నారు.
మూడు నెలల నుంచి జరుగుతున్న ఈ సంఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించి భారతదేశ పరువును బజార్లో పెట్టాయి. భారతదేశంలో మత సహనం లేదని, ఒక్క మణిపూర్‌ లోనే 250 పైగా చర్చిలు కూల్చబడ్డాయని ఐక్యరాజ్యసమితిలో చర్చ జరిగింది. యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్లో, ఇంగ్లాండ్‌ లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభలో ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ఇలాంటి పర్యవసానాలు దేశానికి నష్టదాయకం కావా?
మణిపూర్‌ ప్రజలపై నిప్పుల వర్షం కురుస్తుంటే కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పూలజల్లు కురిపించుకోవడానికి పరుగులు తీసిన పెద్దలు దీనికి బాధ్యత వహించాలి. పంతాలు, పట్టింపుల కన్నా పరిష్కారానికి చొరవ చూపాల్సిన సమయం, సందర్భం ఇది.

- జి. తిరుపతయ్య