Feb 21,2023 06:40

(ఆదివారం సంచిక తరువాయి)
స్టాక్‌ మార్కెట్‌ లోను, బాండ్ల మార్కెట్‌ లోను వచ్చిన ఒడిదుడుకుల కారణంగా అదానీ గ్రూపు తన వాటాల అమ్మకాన్ని గాని, డాలర్‌ డినామినేషన్లలో బాండ్ల అమ్మకాన్ని గాని నిలిపివేయవలసి వచ్చింది. యావత్తు భారతదేశఫు పెట్టుబడుల మార్కెట్‌ విశ్వసనీయత, ఈ దేశపు ఆర్థిక వ్యవహారాల నిర్వహణ విశ్వసనీయత ఈ ఉదంతంతో దెబ్బ తిన్నాయి. మరోవైపు క్రెడిట్‌ సూయిస్‌, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ వంటి రేటింగ్‌ ఏజన్సీలు వివిధ రకాల చర్యలకు పూనుకుంటున్నాయి. భారత ప్రభుత్వం గాని, ఇక్కడ నియంత్రణ సంస్థలు గాని ఎంత మౌనం పాటించినప్పటికీ ఈ పరిణామాల ప్రపంచవ్యాప్త ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదేదో అదానీ కంపెనీల భవిష్యత్తుకో లేక హిండెన్‌బర్గ్‌ నివేదికకో పరిమితమైనది కాదు. ''ఆ శతకోటీశ్వరుడి భవిష్యత్తు, అతడి వ్యాపార సామ్రాజ్యం భవిష్యత్తు మాత్రమే కాదు. దానికన్నా పెద్ద విషయం ఇప్పుడు పరిశీలనలోఉంది. కార్పొరేట్‌ వ్యవహారాల నిర్వహణలో భారతదేశపు నిబద్ధత ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది. కొద్దిమంది అతి సంపన్నుల చేతుల్లో భారతదేశపు మౌలిక వసతుల రంగం నిర్వహణ చిక్కుకుపోవడం, వారే విదేశీ పెట్టుబడులలో ముందుండడం అనే విధానం ఇప్పుడు భారతదేశ ఆర్థిక నమూనాగా కనిపిస్తోంది.'' అని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక అభిప్రాయపడింది. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థా ప్రపంచ దృష్టిని తప్పించుకోజాలదు. హిండెన్‌బర్గ్‌ నివేదిక కేవలం ఒక సూచిక మాత్రమే.
ప్రపంచ రేటింగ్‌ సంస్థలు అదానీ గ్రూపు సంస్థల వ్యవహారాన్ని చాలా లోతుగా పరిశీలిస్తున్నాయి. పైపై కబుర్లతో వాస్తవాలను కప్పిపుచ్చడానికి చూస్తే ఆ సంస్థలు అంగీకరించవు.
అందుచేత తాము అన్నింటికీ అతీతం అన్నట్టు అదానీ ఎంత దబాయించినా, ఆ గ్రూపు సంస్థలకు తక్కిన కార్పొరేట్లు ఎంత సంఘీభావాన్ని ప్రదర్శించినా, తమ స్వంత ధనంతోటో, తోటి కార్పొరేట్ల ధనంతోటో అదానీ గ్రూపు షేర్ల ధరలను పెంచి నిలబెట్టే ప్రయత్నాలు ఎన్ని చేసినా, ప్రపంచవ్యాప్త మదుపుదారుల దృష్టిని తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదు. మోడీకి సైద్ధాంతికంగా అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తమ దేశపు హైఫా ఓడరేవును అదానీకి అప్పజెప్పినా అది కూడా అంతర్జాతీయ మదుపరుల అంచనాలను ప్రభావితం చేయజాలదు.
మోడీ ప్రభుత్వ వైఖరి, గౌతమ్‌ అదానీతో కుమ్మక్కైన తీరు క్రోనీ క్యాపిటలిజం హద్దుల్ని సైతం అధిగమించి పోయింది. ప్రభుత్వ మౌలిక వసతుల రంగం యావత్తూ అదానీ గ్రూపు సంస్థలకే మొదటి ప్రాధాన్యతగా అప్పగించడం కాకతాళీయం ఏమీ కాదు. ''సోలార్‌ ప్యానెల్స్‌ ను ఉత్పత్తి చేసే కంపెనీలను స్థాపించాలని ప్రభుత్వం అనుకుంటోందా? ఐతే అందుకు అదానీ సిద్ధంగా ఉన్నాడు. సాంప్రదాయేతర వనరులనుండి విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి పెద్ద లక్ష్యాలను నిర్దేశించాలని ప్రధాని భావిస్తున్నారా? ఐతే ఆ లక్ష్యాలను సాధించడానికి కావలసిన ఒప్పందాలమీద సంతకాలు చేయడానికి అదానీ సిద్ధంగా ఉన్నాడు. ఆయుధాల తయారీలో మనం స్వయంసమృద్ధి సాధించలేకపోతున్నామని ప్రభుత్వం ఆందోళన పడుతోందా? ఐతే అదానీ దేశీయంగా ఇక్కడి పరిస్థితులకు అనువుగా ఉండే రక్షణ వ్యవస్థను 'మేక్‌ఇన్‌ ఇండియా' విధానంలో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. సెమీ కండక్టర్ల సరఫరా విషయంలో విధాన రూపకర్తలు ఆందోళన పడుతున్నారా? ఐతే అదానీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, మన దేశ భౌగోళిక-రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఉండే సరఫరా వ్యవస్థను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు.'' అని ఒక బ్లూంబెర్గ్‌ కాలమిస్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
ఇప్పుడు గనుక అదానీ పతనమైతే దాని పర్యవసానాలు మన దేశం మీద కూడా పడతాయి. తన తప్పుల్ని, అవకతవకల్ని కప్పిపుచ్చుకోడానికి, సమర్ధించుకోడానికి గౌతమ్‌ అదానీ ఈ బలహీనతనే వాడుకుంటున్నాడు. అదానీ మీద దాడి అంటే అది భారతదేశం మీద దాడి అని వ్యాఖ్యానిస్తూ బూటకపు దేశభక్తి ముసుగు మాటున దాక్కుంటున్నాడు.
ఆరెస్సెస్‌ కూడా వెంటనే రంగంలోకి దిగింది. బహిరంగంగా అదానీని సమర్ధించడమే గాక, హిండెన్‌బర్గ్‌ నివేదిక భారతదేశ వ్యతిరేకతతో రూపొందినదంటూ వ్యాఖ్యానించింది. దానికి ఈ దేశంలోని అంతర్గత శత్రువులు తోడ్పాటునిస్తున్నాయంటూ ఆ సందర్భంగా తనకు పుట్టుకనుంచీ అబ్బిన వామపక్ష వ్యతిరేకతను వెళ్ళగక్కింది. గుజరాత్‌ మారణ హోమం అనంతరం ఏర్పడిన మతతత్వ-కార్పొరేట్‌ కూటమి మోడీ ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశాన్ని ఎటువైపు నడిపిస్తోందో ఈ అదానీ ఉదంతం మనకి స్పష్టం చేస్తోంది.
అంతర్జాతీయ పెట్టుబడి పెత్తనంలో, అది ఎటువంటి కుట్రలకు పాల్పడుతూ, ఎప్పటికప్పుడు తన రంగులు మార్చుకుంటూ సాగుతున్నప్పటికీ, ఇది అంతిమంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగమే. అదానీ సంస్థల నిర్వహణ తీరుతెన్నులపైన విచారణ జరిపించాలన్న డిమాండ్‌ తో, పారదర్శకంగా, చట్టబద్ధంగా వ్యవహారాలు సాగాలన్న డిమాండ్‌ తో మోడీ ప్రభుత్వం మీద, అది అదానీతో కుమ్మక్కై సహకరించిన తీరు మీద పోరాటం సాగాలి. అందుకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయవలసివుంది. స్వతంత్రమైన ఉన్నతస్థాయి విచారణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
'పెట్టుబడి' గ్రంథంలో మార్క్స్‌ చేసిన విలువైన వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేసుకుందాం. పారిశ్రామిక పెట్టుబడి ఏ విధంగా పుట్టిందో వివరించిన అధ్యాయం ముగింపులో ''తన శరీరంలో తల నుండి కాళ్ళ వరకూ, ప్రతీ రంధ్రం నుంచీ రక్తాన్నీ మురికినీ స్రవిస్తూ పెట్టుబడి పుట్టుకొస్తుంది.'' అన్నాడు. ఆ తర్వాత ''తగు మాత్రపు లాభం వస్తుందంటే పెట్టుబడి చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఓ పది శాతం లాభం గ్యారంటీ అనుకుంటే ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి తయారౌతుంది. ఒక ఇరవై శాతం లాభం వస్తుందీ అనుకుంటే తెగ ఆత్రుతను ప్రదర్శిస్తుంది. 50 శాతం లాభం వస్తుందంటే మొండిగా బరితెగిస్తుంది. 100 శాతం లాభం కోసం అయితే అన్ని మానవ చట్టాలనూ తొక్కిపారేయడానికి సిద్ధమౌతుంది. ఇక 300 శాతం లాభం గనుక వస్తుందనుకుంటే అది చేయడానికి సిద్ధపడని నేరం అంటూ ఏదీ ఉండదు. దాని బరితెగింపుకు హద్దు ఉండదు. ఆఖరికి తన యజమానిని కూడా ఉరి తీయడానికి అది వెనుకాడదు.'' అని జోడించాడు. అదానీ ఉదంతం ఆ వ్యాఖ్యను కళ్ళకి కట్టినట్టు చూపిస్తోంది.                                                                    (ముగిసింది)

bassu

 

 

 

 

 

 

నీలోత్పల్‌ బసు