Oct 21,2023 09:21
  • ఒంగోలు భూ కుంభకోణాలపై సిఎంఓ ఆదేశం
  • ఉన్నతాధికారులకు దిశా నిర్ధేశం

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఒంగోలు భూ కంభకోణాల దర్యాప్తు ప్రక్రియలో సిఐడి సహకారం కూడా తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) ఆదేశించింది. ఈ విషయంలో జాప్యం జరిగిందని ఇప్పటికైనా విచారణ ప్రక్రియను సాధ్యమైనం త్వరగా పూర్తి చేయాలని దిశా నిర్ధేశం చేసింది. కొంత కాలంగా జిల్లాలో వెలుగుచూస్తున్న భూ కుంభకోణాలు అధికారయంత్రాంగానికి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. అధికారపార్టీ నేతలపై ఆరోపణలు వస్తుండటం, వీటి కేంద్రంగా గ్రూపుల పోరు తీవ్రమవుతుండటం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిని అవకాశంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతోంది. వెలుగులోకి వస్తున్న అక్రమాలపై అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ, కొత్త అక్రమాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదయ్యాయి. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పై స్థాయి నుండి వచ్చిన ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్‌పి మల్లికా గార్గే సిఎంఓ ముఖ్యకార్యదర్శి ధనుంజరు రెడ్డిని శుక్రవారం కలిశారు. జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ధనుంజరురెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనల తీరునూ, తీసుకున్న చర్యలను కలెక్టర్‌. ఎస్‌పి వివరించారు. ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేయడం, ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు, పెద్ద ఎత్తున నకీలీ పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే, అసలు నేరస్తులను పట్టుకోవాల్సిఉందని వారు చెప్పడంతో విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని, సిఐడి సహకారం కూడా తీసుకోవాలని దినేష్‌రెడ్డి ఆదేశించారు. దీంతో ఈ దిశలో శనివారం నుండే చర్యలు తీసుకోవడా నికి అధికారయంత్రాంగం కసరత్తు చేస్తోంది.
 

                                                                               ఏం జరుగుతోంది..

నకిలీ స్టాంపులతో ప్లాట్లు, ఇళ్లకు కొందరు ఎసరు పెట్టారు. మార్కాపురం, కనిగిరి వంటి ప్రాంతాల్లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదు చేశారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ స్టాంపు పత్రాలు, నకిలీ రబ్బరు స్టాంపులు, నకిలీ డెత్‌ సర్టిఫికెట్లు, తహశీల్దారు కార్యాలయం నుంచి ఇచ్చే ఖాళీ పొజిషన్‌ సర్టిఫికెట్లు, పట్టాలు, పలు రకాల నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆక్రమణల వ్యవహరంలో పాలకపక్ష నేతలూ పాత్రధారులుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పోలీసులు కొన్ని రబ్బరు స్టాంపులను పరిశీలించగా, ఒరిజినల్స్‌ తయారైన తేదీల్లోనే నకిలీవి కూడా తయారు చేసినట్లు గుర్తించారు.. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన ఓ నిందితుడిని డాక్యుమెంటు రైటర్‌గా గుర్తించారు. ఆయన వద్ద 130 రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎన్ని ఫేక్‌ ఉన్నాయి? ఎన్ని నిజమైనవి? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ డాక్యుమెంట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో పాలకపక్ష నేతలు కొందరు నగరం వదిలి పారిపోయారనే ప్రచారం సాగుతోంది.