Jun 08,2023 06:32

ఇంటర్‌ విద్యా వ్యాపారం మూడు పువ్వులు పదహారు కాయలుగా విలసిల్లుతున్నది. దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆరు నుండి పది లక్షల కోట్ల రూపాయల విద్యా వ్యాపారం జరుగుతుండగా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నర కోట్ల రూపాయల కార్పొరేట్‌ విద్యా వ్యాపారం వర్ధిల్లితున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్‌ విద్యాసంస్థల ఇంటర్‌ వ్యాపారం ప్రతి సంవత్సరం 12 శాతం వృద్ధితో ఇతర అన్ని రంగాల కంటే వేగంగా విస్తరిస్తున్నది. విద్య అనే ఖరీదైన సరుకును కొనలేక పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక కష్టాల్లో, మానసిక ఆందోళనల్లో కూరుకుపోతున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు అడుగంటడం, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, వృత్తులు క్షీణించడం, మాల్స్‌ పోటీకి చిన్న, మధ్యతరహా వ్యాపారాలు మూతపడడం, మధ్యతరగతి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆందోళనలు, కార్పొరేట్‌ విద్యాలయాల వ్యాపార ప్రకటనలు కలిపి విద్యా వ్యాపారానికి బలమైన పునాదులు వేశాయి. ఈ పునాదులపై నిర్మిస్తున్న విద్య ఖరీదైన సరుకుగా మారింది. ఆ సరుకును కొనడం భవిష్యత్‌ తప్పనిసరి అవసరంగా మార్చేశారు. ఈ పరిస్థితి కార్పొరేట్‌ విద్యాసంస్థలకు వరంగా...పేద, మధ్యతరగతి ప్రజలకు శాపంగా... విద్యార్థులకు యమపాశంగా తయారయింది.

  • కార్పొరేట్‌ కబ్జాకు బలైన ఇంటర్‌ విద్య

2022లో దేశవ్యాప్తంగా కార్పొరేట్‌ విద్యాసంస్థలు రూ. 6.58 లక్షల కోట్ల రూపాయల విద్యావ్యాపారం జరిగింది. అందులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రూ. లక్ష 12 వేల కోట్ల విద్యా వ్యాపారం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 78 శాతం ఇంటర్మీడియట్‌ విద్యదే కావడం తీవ్ర ఆందోళనకరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం విద్యార్థులు సుమారు 29.50 లక్షల మంది వుండగా, అందులో 15.35 లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్‌ సంస్థల్లో చదువుతున్నారు. గుర్తింపులేని ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య కలిపితే 60 నుండి 72 శాతం వుంటుంది. ఇంటర్మీడియట్‌ స్థాయిలో ప్రభుత్వ కాలేజీలు 439, ఎయిడెడ్‌ 131 (వీటిని మూత వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రయత్నం చేసింది.) వుండగా, ప్రైవేట్‌ కాలేజీలు మాత్రం 1550 పైగా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ కళాశాలల్లో గత 10-15 సంవత్సరాలుగా ఏ విధమైన నియామకాలు జరగలేదు. ఉన్న లెక్చరర్లను పిల్లల సంఖ్య సాకుతో ఇతర కళాశాలలకు పంపించివేసి కొన్ని కాలేజీలను శాశ్వతంగా మూసివేశారు. విశాలమైన కళాశాలలు, సమర్థులైన అధ్యాపకులు, ల్యాబ్‌లు, ఆటస్థలాలు, సామాజిక, రాజకీయ చైతన్య కేంద్రాలుగా నాడు విలసిల్లిన ఇంటర్‌ కళాశాలలు నేడు పాడుబడిన బూత్‌ బంగ్లాల్లాగా మారుతున్నాయి. గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వాలు కుట్రపూరితంగా ప్రభుత్వ ఇంటర్‌ విద్యను నాశనం చేసి, కార్పొరేట్‌ సంస్థలను ప్రోత్సహించాయి. ఈ సంస్థల్లో లాభపడిన వారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, కార్పొరేట్‌ ఆసుపత్రుల నిర్వహణ, వివిధ వ్యాపారాల్లో భాగస్వాములుగా వుండడమే కాక కొందరు రాజకీయాల్లోకి జొరబడ్డారు. మరికొందరు అధికార పార్టీలతో సర్దుబాటు చేసుకుంటూ తమ వ్యాపారానికి అడ్డులేకుండా చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసిపి ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలపై ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలపై చేసిన హడావుడిలో రాజకీయ కోణమే తప్ప విద్యా ప్రైవేటీకరణను అడ్డుకోవాలనే చిత్తశుద్ధి లేనట్లు అనుభవం చెబుతున్నది.

  • ఫీజులను నియంత్రించలేని ప్రభుత్వ జీవోలు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్‌. కాంతారావు చైర్మన్‌గా విద్యారంగ నిపుణులతో 2021లో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ వేసింది. ఈ కమిషన్‌ సిఫారసుల మేరకు ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు ఫీజులు నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 53, 54 విడుదల చేసింది. గ్రామ పంచాయితీల్లో అయితే నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు రూ. 10 వేలు, పట్టణాల్లో రూ. 11 వేలు, నగరాల్లో రూ. 12 వేలు వసూలు చేయాలి. ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు గ్రామాల్లో రూ.12 వేలు, పట్టణాల్లో రూ. 15 వేలు, నగరాల్లో రూ. 18 వేల ఫీజు నిర్ణయించారు. అలాగే ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్‌, సైన్స్‌ గ్రూపులకు గ్రామాల్లో రూ. 15 వేలు, పట్టణాల్లో రూ. 17.5 వేలు, నగరాల్లో రూ. 20 వేల వరకు వసూలు చేసుకోవాలి. ఫీజుల బోర్డులు, తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాని ఆచరణలో ఒక్కటీ అమలు కావడంలేదు. కార్పొరేట్‌ విద్యాలయాలు పట్టణాల్లో నర్సరీ చదువుకే రూ. 6 నుండి రూ. 10 వేలు, ఒకటో తరగతికి రూ. 6,500 నుండి రూ. 11 వేలు, ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్‌, సైన్స్‌ గ్రూపుల్లో డే స్కాలర్లకు రూ. 60 వేల నుండి రూ. లక్ష, హాస్టల్‌ విద్యార్థులకు రూ. లక్షన్నర నుండి రూ. రెండు లక్షలకు పైగా ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. పుస్తకాలు, బట్టలు...ఇలా ఎన్ని రూపాల్లో వీలైతే అన్ని రూపాల్లో తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆకర్షణీయమైన కోర్సుల కోచింగ్‌ పేరుతో ప్రతి సంవత్సరం భారీగా ఫీజులు పెంచుకుంటున్నాయి. ఫీజుల నియంత్రణ మీద మొదట్లో హడావుడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా నూతన విద్యావిధానాన్ని దేశంలో అందరికంటే ముందుగా అమలు చేసి కార్పొరేట్‌ విద్యా వ్యాపారాన్ని మరింతగా ప్రోత్సహించే విధానాలను అమలు చేస్తున్నది.

  • కార్పొరేట్‌ ప్రచార గారడీ

లేనిది ఉన్నట్లు, వున్నది లేనట్లు చేసేదానిని గారడి విద్య అంటాము. మార్కులు, ర్యాంకుల పేరుతో గారడీ ప్రచారం చేసి తమ సంస్థల్లో చేర్చుకోవడానికి నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్‌ విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నాయి. మార్కులు, ర్యాంకులన్నీ వీరి కళాశాల గ్రౌండ్‌లో పండుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం మార్కులు, ర్యాంకులను నిషేధించిన గ్రేడ్ల పేరుతో ప్రచారం కొనసాగుతూనే వుంది. ఈ ప్రచార మాయాజాలంలో తల్లిదండ్రులు బలైపోతున్నారు. కార్పొరేట్‌ సంస్థలలో చదివితే నీట్‌, జెఇఇ లలో ర్యాంకులు పొంది ఐఐటి, ఐఐఎం లాంటి ఉన్నత విద్యాలయాల్లో సీట్లు వస్తాయని, దేశంలో, విదేశాల్లో మంచి ఉద్యోగాలు వస్తాయనే భ్రమ మధ్యతరగతి ప్రజల్లో కల్పించడంలో ఈ విద్యాసంస్థలు జయప్రదం అయ్యాయి. కార్పొరేట్‌ విద్యాలయాలలో చదవకపోతే చదువు రాదని, పిల్లలకు భవిష్యత్‌ వుండదనే భయాన్ని తల్లిదండ్రుల్లో ఈ విద్యాసంస్థలు సృష్టించగలిగాయి. తమ ఆర్థికశక్తితో సంబంధం లేకుండా విద్యను కొనేందుకు దిగువ మధ్యతరగతి కుటుంబాలు పోటీలు పడి అప్పుల వలయంలో చిక్కుకుంటున్నాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో జరుగుతున్న వాస్తవ విషయాలను తల్లిదండ్రులు గుర్తించకుండా చేయగలుగుతున్నారు. 2022 సంవత్సరంలో సుమారు 17 లక్షల మంది విద్యార్థులు నీట్‌ ప్రవేశ పరీక్షలు రాయగా 9,93,069 విద్యార్థులు మాత్రమే సీటు పొందేందుకు అర్హత సంపాదించారు. అలాగే జెఇఇ సీటు కోసం 1,55,538 మంది పరీక్షలు రాయగా 40,712 మంది విద్యార్థులు మాత్రమే అర్హత సాధించారు. దేశంలో 70 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ప్రైవేట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నట్లు నేషనల్‌ శ్యాంపిల్‌ సర్వే అంచనా వేసింది.
ఇంటర్‌లో ప్రవేశ పరీక్షల ప్రత్యేక కోచింగ్‌ల పేరుతో పిల్లలపై మానసిక ఒత్తిడి, తల్లిదండ్రులపై ఆర్థిక ఒత్తిడి పెంచిన తర్వాత కూడా ఎందుకు అర్హత సాధించలేకపోతున్నారు? కార్పొరేట్‌ విద్యాలయాల్లో ఇంటర్‌లో చేరిన వారి సంఖ్య ఎంత? పాస్‌ అవుతున్న వారి సంఖ్య ఎంత? ఇంటర్‌ తర్వాత ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో రూ.లక్షలు కట్టి సీట్లు కొంటున్న స్థితి చూస్తూనే వున్నాము. ఈ సంవత్సరం బిటెక్‌ సిఎస్‌ఇ కోర్సులో చేరడానికి కనీసం రూ. నాలుగు లక్షల నుండి రూ. ఆరు లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. కాలేజి బ్రాండ్‌ను బట్టి ఈ ఫీజు మరింత ఎక్కువగా వుంటుంది. డొనేషన్‌, హాస్టల్‌ ఫీజుల పేరుతో మరిన్ని రూ. లక్షలు లాగేస్తున్నారు. నయా ఉదారవాద విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత సామాజిక శాస్త్రాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్‌ చదువంటే ఎంపిసి, బైపిసి అనే పరిస్థితి ఏర్పడింది. ఇంజనీరింగ్‌ కాలేజీలలో కూడా సాప్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో కంప్యూటర్‌ సైన్స్‌ల డిమాండ్‌ను పెంచడంతో కోర్‌ సబ్జెక్టులు ముఖ్యంగా సివిల్‌ ఇంజనీరింగ్‌ లాంటి విభాగాలు మూతపడుతున్నాయి. మరోవైపు ఉద్యోగ నియామకాలు ప్రతి సంవత్సరం భారీగా తగ్గిపోతున్నాయి. 2020-21లో 13,86,721 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు చదివితే 3,73,363 మంది మాత్రమే ప్లేస్‌మెంట్‌ పొందారు. విద్య విజ్ఞానం కోసం అన్న స్థానంలో విద్య ఉపాధి కోసం అనే విధంగా కార్పొరేట్‌ సంస్థలు మార్చాయి. ఇంటర్‌ దశలో పెట్టుబడితే ఆ తర్వాత ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నట్లు ఆశ కలిపిస్తున్నాయి.

  • కార్పొరేట్‌ విద్య దుష్ఫలితాలు

మార్కులు తప్ప వేరే ప్రపంచం తెలియని నిర్బంధ జైళ్లు కార్పొరేట్‌ విద్యాసంస్థలు. విద్యార్థుల స్థాయి, కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా బట్టీ పెట్టే విధానం అమలు చేస్తున్నారు. 14 నుండి 16 గంటల వరకు చదివించడం తమ గొప్ప అయినట్లు ఈ సంస్థలు చెప్పుకుంటున్నాయి. తమ సంస్థల పేరుప్రఖ్యాతుల కోసం అడ్డదారులు తొక్కి పేపర్‌ లీకేజీలకు పాల్పడుతున్నారు. క్రీడలు, విజ్ఞాన చర్చలు, వినోదం లాంటివి విద్యార్థులకు అందుబాటులో వుండడంలేదు. దీనివల్ల వారు మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణకు దూరమవుతున్న పిల్లలు కాలేజీలలో ప్రవర్తిస్తున్న తీరు, డ్రగ్స్‌ లాంటి వాటికి అలవాటు పడుతున్న ఘటనలు ఆందోళన పరుస్తున్నాయి. లక్షల రూపాయలు కట్టలేని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పిల్లల భవిష్యత్‌ గురించి పాలకులు ఆలోచించడంలేదు. చదువుల కొనుగోలులో మధ్యలోనే ఆగిపోతున్న యువత ఏమౌతున్నదో వారికి పట్టడంలేదు. చిన్న వయసు నుండే తల్లిదండ్రులకు దూరంగా పొందే విద్య మార్కుల జ్ఞానాన్ని ఇస్తుందేమో గాని, సామాజిక జ్ఞానాన్ని ఇచ్చే అవకాశం తక్కువ. పిల్లల భవిష్యత్‌ వికాసాన్ని, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకి నెడుతున్న కార్పొరేట్‌ విద్యా వ్యాపారాన్ని అడ్డుకోవాలి. అందరికీ ప్రభుత్వ విద్య రాజకీయ ప్రధాన ఎజెండాగా మారాలి.

RAM

 

 

 

 

 

 

వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి. రాంభూపాల్‌