Sep 08,2022 06:45

దేశ ప్రజలందరికీ విద్యనందించాలనే సదుద్ధేశ్యంతో రాజ్యాంగ నిర్మాతలు విద్యను ఒక హక్కుగా రాజ్యాంగంలో పొందుపరిచారు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచాయి. పాలకులు అనుసరించిన విధానాల కారణంగా చదువు సంతలో సరుకుగా మారింది. కార్పొరేట్‌ విజృంభణతో సర్కారీ బడులు వెలవెలపోయాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు పిల్లలను చదివించడం తలకు మించిన భారంగా మారింది. దీంతో విద్యా రంగంలో తీవ్ర అసమానతలు నెలకొన్నాయి. కరోనా విజృంభణతో అసమానతల వికృత రూపం బట్టబయలైంది. మరోవైపు కార్పొరేట్‌ విద్యాసంస్థలు ర్యాంకర్లను తయారుచేసే కర్మాగారాలుగా, విద్యార్థులు ముడిసరుకుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పిఎం-శ్రీ) పథకం కింద దేశ వ్యాప్తంగా 14,500 పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేస్తామంటూ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు దీనిని విస్తరిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
విద్యారంగమంటే కేరళ రాష్ట్రం గుర్తురావడం అత్యంత సహజం. దశాబ్దాల కిందటే నూరు శాతం అక్షరాస్యత సాధించిన ఆ రాష్ట్రం ప్రతి ఒక్క విద్యార్థికి చదువును అందిస్తోంది. సమ్మిళిత (ఇంక్లూజివ్‌) వ్యవస్థల గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుతుంటే, విద్యారంగంలో ఆ లక్ష్యాన్ని ఎప్పుడో సాధించడమే కేరళ ప్రత్యేకత! కరోనా సమయంలో ఆన్‌లైన్‌ వ్యవస్థను విస్తరించడం ద్వారా విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకుంది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో 4,600కు పైగా పాఠశాలల్లో 45 వేలకు పైగా తరగతి గదులను స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌గా తీర్చిదిద్దింది. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన తరగతి గదులను, పాఠశాలలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయడానికి అవసరమైన మౌలికవనరుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు వివిధ సర్వేలు తేలుస్తున్నాయి. అందుకే, విద్యారంగంలో కేరళ మోడల్‌ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం కూడా విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచి, ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర బడ్జెట్‌లో 25 శాతం నిధులను అక్కడి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఉపాధ్యాయుల శిక్షణ, సిలబస్‌ రూపకల్పనపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్టాలిన్‌ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ దిశలో అడుగులు వేస్తోంది. స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, మోడల్‌ స్కూళ్లగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతోంది. మన రాష్ట్రంలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొనడం బాధాకరం. ప్రభుత్వ పాఠశాలలను మరింత పెంచడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం విలీనం బాట పట్టింది. ఫలితంగా డ్రాప్‌అవుట్లు పెరుగుతాయన్న ఆందోళనను పట్టించు కోవడం లేదు. యాప్‌ల పేరుతో ఉపాధ్యాయులపై అసలు పనికన్నా కొసరు బరువును ఎక్కువగా మోపిన ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం గళం విప్పితే క్రిమినల్‌ కేసులు పెట్టడం ఘోరం. బడులు దూరాభారమై విద్యార్థులు, అభద్రతతో ఉపాధ్యాయులు సతమత మయ్యే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.
స్థానిక అవసరాలు, సంస్కృతులకు అనుగుణంగా విద్యా వ్యవస్థను, సిలబస్‌ను రూపొందించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చింది. అయితే, వివిధ రంగాలపై జరుపుతున్న దాడుల తరహాలోనే విద్యారంగంపై కూడా మోడీ ప్రభుత్వం దృష్టి సారించింది. నూతన విద్యా విధానాన్ని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం ద్వారా వాటి హక్కులను కబళిస్తోంది. దీనిలో భాగంగానే అశాస్త్రీయమైన భావజాలాన్ని, మూఢనమ్మకాలను పెంచే పాఠ్యాంశాలను, చరిత్రకు సంబంధంలేని కట్టుకథలతో విద్యార్థుల మెదళ్లను కబళించడానికి ప్రయత్నిస్తోంది. ఈ తరహా ప్రయత్నాలు విద్యార్ధుల భవిష్యత్తును దెబ్బ తీయడంతో పాటు దేశాభివృద్ధిని శతాబ్దాల వెనక్కి తీసుకుపోతాయన్న అభిప్రాయాలను మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజాగా ప్రకటించిన పాఠశాలల అప్‌గ్రేడ్‌ ప్రక్రియకు నూతన విద్యా విధానానికి కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టింది. దేశంలోని విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికే ఈ పథకాన్ని చేపట్టినట్టు మోడీ చేసిన ప్రకటనలో చిత్త శుద్ధి ప్రశ్నార్థకం.