Jun 12,2023 09:17
  • నిందితుడిపై చర్యలు కోరుతూ రాస్తారోకో

ప్రజాశక్తి-యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో చిన్న చౌదరి చియాన్‌ అనే యువకుడు ఆదివారం రాత్రి ముస్లిములను, క్రిస్టియన్‌లను కించపరుస్తూ.. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వందలాది మంది స్థానికులు యర్రగొండపాలెం పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మైనార్టీలను కించపరస్తూ పోస్టు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. మత సామరస్యం పాటించాలని నినదించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. మరికొంత మంది 565 జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. టైర్లు కాల్చి నిరసన తెలిపారు. నిందితుడితో బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ జి కోటయ్య స్థానిక యువకులతో మాట్లాడారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోస్టు పెట్టిన యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన విరమించారు.