Oct 30,2023 12:29

ఆసుపత్రి సమీపంలో బాంబుల వర్షం
ఇజ్రాయిల్‌ దాష్టీకాన్ని ఖండించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
గాజా సిటీ :
   హమస్‌ను అణిచేసే పేరుతో మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్‌ మరింతగా రెచ్చిపోయి అమానవీయ దాడులకు తెగబడుతోంది. గాజా సిటీలోని అల్‌ ఖుదాస్‌ ఆసుపత్రికి అతి సమీపంలో ఆదివారం సాయంత్రం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 116 మంది వైద్య సిబ్బందితో సహా 200 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, పెద్ద సంఖ్యలో గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. చనిపోయినవారిలో సివిల్‌ డిఫెన్స్‌కు చెందినవారు 18 మంది ఉండగా, 35 మంది పాత్రికేయులు కూడా ఉన్నట్లు గాజా మీడియా ప్రతినిధి మౌరఫ్‌ తెలిపారు.
ఆసుపత్రిని ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయిల్‌ ఆ వెంటనే వైమానిక దాడులతో విరుచుకుపడింది. క్షతగాత్రులు, సాధారణ రోగులకు వైద్య సేవలందించడంతో పాట దాదాపు 14 వేల మందికి సహాయక శిబిరంగానూ ఈ ఆసుపత్రి ఆశ్రయాన్ని కల్పిస్తోంది. ఆసుపత్రులను లక్ష్యం చేసుకొని ఇజ్రాయిల్‌ దాడులకు తెగబడటాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తీవ్రంగా ఖండించింది. గాజాలో సాగిస్తున్న కాల్పులను, దాడులను తక్షణమే నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి కూడా పదేపదే ఇజ్రాయిల్‌ను కోరుతోంది. కానీ ఇజ్రాయిల్‌ మాత్రం యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది.

గాజాలో యుద్ధం మరింత కాలం, మరింత తీవ్రంగా కొనసాగుతుందని ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి నెతన్యాహూ హెచ్చరించారు. వైమానిక దాడులు, భూతల దాడులు మరింతగా విస్తురించాయి. ఆసుపత్రులను లక్ష్యం చేసుకొని దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి కాదు. ఇదే నెల 17న సైతం గాజాలోని అల్‌ అహ్లీ అరబ్‌ హాస్పిటల్‌పై ఇజ్రాయిల్‌ బాంబుదాడులకు పాల్పడింది. నాటి ఘటనలో 500 మంది చనిపోయారు. వీరిలో అత్యధికులు చిన్నారులు, మహిళలే. కాగా ఇజ్రాయిల్‌ భూతల దాడులను అంతకంతకూ విస్తరిస్తూపోతోంది. పెద్ద సంఖ్యలో సైనిక బలగాలు గాజా చేరుకొని అక్కడి ప్రభుత్వ కార్యాలయాలను, పాఠశాలలను ఆక్రమిస్తున్నాయి. 80 ప్రభుత్వ భవనాలను ఇజ్రాయిల్‌ ఆక్రమిత బలగాలు స్వాధీనం చేసుకొన్నాయని, 47 వరకు మసీదులను ధ్వంసం చేశారని స్థానిక మీడియా తెలిపింది. 208 పాఠశాలలను కూడా ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
ఈ నెల 7 నుంచి సాగిస్తున్న ఇజ్రాయిల్‌ దాడుల్లో ఒక్క గాజా సిటీలోనే ఆదివారం నాటికి 8005 మంది చనిపోయారు. వీరిలో 3500 మంది వరకు చిన్నారులే ఉన్నారు. మరోవైపు గాజాలో టెలికమ్యూనికేషన్ల వ్యవస్థను వేగంగా పునరుద్ధరిస్తున్నారు.

చిన్నారులు విలవిల్లాడిపోతున్నారు : ఐసిసి
గాజాలో మానవసాయానికి ఇజ్రాయిల్‌ ఆటంకాలు సృష్టిస్తుండటం పట్ల అంతర్జాతీయ సంస్థలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు, మహిళలు ఆహారం, కనీస అవసరాల కోసం విలవిల్లాడిపోతున్నారని రఫా సరిహద్దు వద్ద అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి) ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా సాయానికి ప్రత్యేకించి చిన్నారులకు, మహిళలకు, సాధారణ పౌరులకు అందించే మానవతా సాయానికి ఏవిధమైన అడ్డంకీ ఉండకూడదని ఆయన అన్నారు. ఇది చాలా ప్రాథమికమైన హక్కు అని పేర్కొన్నారు. గాజా ప్రజలంతా అమాయకులని, సాయాన్ని పొందడం అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం వారి హక్కు అని స్పష్టం చేశారు. చట్టాన్ని పరిరక్షించి సహాయాన్ని అందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని, ఈ నేరాలకు ఒడిగడుతున్నవారిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.