Jun 15,2023 10:26

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద ఎంవిపి కాలనీలోని రూ.25 కోట్లతో నిర్మించిన మల్టీ ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను సహానీ అనే ప్రయివేటు సంస్థకు మహా విశాఖ నగర పాలక సంస్థ(జివిఎంసి) కట్టబెట్టడం దారుణమని సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్‌ బి.గంగరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం మద్దిలపాలెంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులను ప్రయివేటు సంస్థలకు దోచిపెట్టే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఏరినను ప్రయివేటు సంస్థకు ఇవ్వకుండా, దీని నిర్వహణ బాధ్యతను జివిఎంసి చూడాలని కోరారు. ఫీజుల వసూళ్లపై కనీస నియంత్రణలేకుండా కౌన్సిలు అచేతనంగా మార్చిన వైసిపి పాలకవర్గ చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ''ఎరీనాను గత నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. సెంట్రల్‌ ఏసితో కూడిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్లో నాలుగు బ్యాడ్మింటెన్‌ కోర్టులు, రెండు స్విమ్మింగ్‌ పూల్స్‌, బాస్కెట్బాల్‌ కోర్టులు, వాలీబాల్‌ కోర్టు, రెండు టేబుల్‌ టెన్నీస్‌ కోర్టులు, వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్నాజిఎం, డార్మెంటరీస్‌, బోర్డు గేమ్‌ రూమ్స్‌ తదితర అనేక రకాల క్రీడా సదుపాయాలున్నాయి. ఇన్ని సదుపాయాలు కల్గిన ఎరీనాను ప్రజలు వినియోగించుకొనే అవకాశంలేకుండా, ప్రయివేటు సంస్థకు జివిఎంపి అప్పగించింది. స్విమ్మింగ్‌ఫూల్‌కు నెలకు 4వేలు, బాడ్మింటెన్‌ కోర్ట్‌ కు 4 వేలు, వాలీబాల్‌ కు 5వేలు, టేబుల్‌ టెన్నీస్‌ కు రూ.2,500, చెస్‌ కు రూ.1500, యోగాకు 2 వేలు, ఆదివారం రోజున బ్యాడ్మింటెన్‌కు ప్రతీ గంటకు 1000, జిమ్‌ క్రాస్‌ ఫిట్‌ ట్రైనింగ్‌కు 8 వేలు చొప్పున ప్రయివేటు సంస్థ వసూలు చేస్తోంది. అదనంగా 18 శాతం జిఎస్టి చెల్లించాలి. రాబోయే కాలంలో ఈ ధరలు మరింత పెంచనుంది. ఈ ఫీజులు నిర్ణయంలోనూ, ధరల నియంత్రణలోనూ జివిఎంసికి అధికారంలేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. విచ్చలవిడిగా డబ్బులు దోచుకొనే అవకాశం ప్రయివేటు సంస్థకు కల్పించింది. నామమాత్రంగా ఏడాదికి కేవలం కోటి నాలుగు లక్షలు మాత్రమే చెల్లించి, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్లో క్రీడా శిక్షణ పేర అనేక వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకొనే అవకాశమిచ్చింది. నిబంధనలేవీ పాటించకుండా సహానీ అనే సంస్థకు ఇండోర్‌ స్పోర్ట్స్ను ఐదేళ్లు లీజుకు ఇచ్చింది. సహాని కల్పిత సంస్థగా కన్పిస్తోంది. టెండర్లలో సహాని అనే ఒకే సంస్థ పాల్గొన్నా, రద్దు చేయకుండా ఆ సంస్థకు ఆగమేఘాలపై అప్పగించింది. దీనివెనుక జరిగిన భారీ అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం వున్నట్లు తెలుస్తోంది. సహానీ లాభాల కోసం ప్రజల ఆస్తులను నిస్సిగ్గుగా ఫణంగా పెట్టింది. లీజు ఒప్పంద పత్రాన్ని బహిర్గతం చేయలేదు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ ఎరీనాలోకి కొద్దిమంది సంపన్నులకు తప్ప సామాన్యులెవరికి ప్రవేశంలేదు. నగర ప్రజలకు అందుబాటులో వుంచి, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగించాల్సిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్ను వ్యాపార కేంద్రంగా తయారుచేశారు. ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనా ప్రయివేటీకరణను జివిఎంసి కౌన్సిల్‌ అజెండాలో పెట్టలేదు. విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ముసుగులో ప్రయివేటు సంస్థకు అప్పగించారు. స్మార్ట్‌ సిటీ నిధులతో చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ ప్రయివేటుపరం చేస్తున్నారు. జివిఎంసి కౌన్సిల్ను డమ్మీగా మార్చేశారు. ఆర్‌ కెబీచ్‌, గాజువాకలోని స్విమ్మింగూల్ను కోవిడ్‌ పేర మూసేశారు. వీటిని ప్రారంభించాలని చేస్తున్న విజ్ఞప్తులను పక్కనబెట్టి ప్రయివేటీకరించాలన్న ఆలోచనలో జివిఎంసి వుంది. ప్రజల నుంచి పలు రూపాల్లో పన్నులు వసూలుచేస్తున్న జివిఎంసి ప్రజలకు తగిన క్రీడా సదుపాయాలు కల్పించడంలేదు. నాలుగువేల కోట్ల జివిఎంసి బడ్జెట్లో నాలుగు కోట్లు కూడా ఖర్చు చేయడంలేదు. గాజువాక, కంచరపాలెం, అనకాపల్లి, పెందుర్తి, మధురవాడ, మల్కాపురం తదితర ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది'' అని ఆయన అన్నారు.