
''భరత్ అను నేను, హామీ ఇస్తున్నాను'' అని పాడుకుంటూ మా ఇంట్లోకి హుషారుగా వచ్చేడు కాశ్యప్, మావాడి క్లాస్‌మేట్. వాళ్ళిద్దరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వాడు వచ్చేసరికి మా అబ్బాయి ధీరజ్ టిఫిన్ తింటున్నాడు.
''ఒరేరు! ఇక మన హీరో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టే'' అని కాశ్యప్ ఉత్సాహంగా ప్రకటించేడు. మా వాడికి అర్ధం కాలేదని వాడి క్వశ్చన్‌మార్క్ ముఖమే చెప్పేస్తోంది. ''నీకు అర్ధం కాలేదు కదూ? మహేశ్‌బాబు భరత్ అను నేను సినిమా రిలీజ్ అయినప్పుడే మా ఆలిండియా మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కి అర్ధం ఐపోయింది. ఇదిగో, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో మా వాడు రంగంలోకి దిగడం ఖాయం. నిండు చందురుడు ఒక వైపూ, చుక్కలు ఒకవైపూ'' అంటూ కాశ్యప్ ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు. వాళ్ళిద్దరికీ దోసెలు వడ్డిస్తున్న నా భార్య కూడా మహేశ్‌బాబు అభిమాని. ఇంక ఆమెకి కూడా ఉత్సాహం వచ్చేసింది. ''ఇంకో దోసె వేసుకోవయ్యా, మొహమాటపడకు'' అంటూనే తన సందేహాన్ని వ్యక్తం చేసేసింది. ''మనవాడు రాజకీయాల్లోకి రావాలని, ఆ సినిమాలోలాగా దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపాలని నేనూ అనుకుంటున్నాననుకో, కాని, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందేమో, ఎన్నికల హడావుడి మొదలైపోయింది, మరో పక్క జమిలి ఎన్నికలు అంటున్నారు'' అంటూ నా ప్రియాతి ప్రియమైన సతీమణి అన్నపూర్ణ అంటూంటే తన రాజకీయ పరిజ్ఞానం చూసి ముచ్చటేసింది నాకు.
''ఎప్పుడొచ్చేం అన్నది కాదాంటీ, బుల్లెట్ దింపామా లేదా అన్నదే ముఖ్యం'' అంటూ అన్నపూర్ణ సందేహాన్ని పటాపంచలు చేసేశాడు కాశ్యప్. ''నీ హీరో రాజకీయాల్లోకి వస్తున్నాడని ఎవరు చెప్పేర్రా?'' అని ధీరజ్ అడిగేడు. ''ఎవరో ఏమిటి? ఇప్పుడు జి-20 సమావేశాలు జరుగుతున్నాయి కదా; వాటిలోనే మనవాడి పేరు ప్రకటించేస్తారు'' అన్నాడు కాశ్యప్. ''నీకెలా తెలిసిందీ అని అడుగుతున్నాను'' అని రెట్టించేడు మావాడు. ''అదేంటి? క్లియర్‌గా కనపడుతూంటే! ఇండియా అని ఉన్న చోటల్లా భరత్ అని మార్చేస్తున్నాడు మోడీ. మనవాడి మీద ఎంత నమ్మకం లేకపోతే అలా చేస్తాడు?'' అని తన పరిజ్ఞానాన్ని బైటపెట్టేడు కాశ్యప్.
విరగబడి నవ్వుతూ ''వార్నీ! అది భరత్ కాదురా, భారత్'' అన్నాడు ధీరజ్. అన్నపూర్ణ ఉత్సాహం పాలపొంగులా చప్పబడిపోయింది. కాని కాశ్యప్ ఇంకా వదల్లేదు. ''బి-హెచ్-ఎ-ఆర్-ఎ-టి-దీన్నెలా చదువుతార్రా. మన క్లాసులో భరత్ గాడు ఉన్నాడు కదా. వాడు కూడా ఇలానే తన పేరు ఇంగ్లీషులో రాస్తాడు. మరి నువ్వేమో ''భ'' ని సాగదీసి ''భా'' అని చదవాలంటున్నావు.'' అని గింజుకున్నాడు. కాని ధీరజ్ తేల్చేశాడు. భరత్ కాదు, భారత్ అని నిర్ధారించేడు.
''మరి, ఇండియా అని మన దేశాన్ని అంటాం కదా, మళ్ళీ ఈ భారత్ ఎందుకు?'' అనడిగేడు కాశ్యప్. ''ఈ మధ్య ప్రతిపక్షాలన్నీ తమ కూటమికి ''ఇండియా'' అన్న అక్షరాలు కలిసొచ్చేలా పేరు ప్రకటించేయి కదా, దానికి పలుకుబడి పెరిగిపోతోందేమో అని భయపడి ఎక్కడా ఇండియా అన్న పదం రాకుండా చేసెయ్యాలని మోడీ అనుకున్నట్టున్నాడు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బదులు గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని వాడడం ప్రారంభించారు.'' అని ధీరజ్ వివరించేడు.
''మరి ఒక దేశం పేరును అలా మార్చెయ్యవచ్చా?'' అని అడిగింది అన్నపూర్ణ. ''మన రాజ్యాంగంలో 'ఇండియా, దటీజ్ భారత్' అని ఉందమ్మా. అందుచేత రెండు పేర్లలో దేన్నైనా వాడుకోవచ్చు.'' అని చెప్పేడు ధీరజ్.
''మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ రైల్వేస్, ఎయిర్ ఇండియా-ఇలా ఉన్న పేర్లన్నింటినీ ఇప్పుడు మార్చేస్తారా? అని కాశ్యప్ అడిగేడు.'' ఏమో మరి, చూడాలి'' అని లేచేడు ధీరజ్
అధినేత అసహనంగా పచార్లు చేస్తున్నాడు. అతని ముఖ్య సలహాదారుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. ''అసలు ఇండియా అన్న పేరు ఎక్కడా ఉండకుండా చేయాలని కదా మన సుప్రీం కమాండర్ చెప్పేరు? వచ్చే పార్లమెంట్‌లో దానిమీద ఒక చట్టం చేయలేమా?'' అని అధినేత అడిగేడు. వెంటనే ముఖ్య సలహాదారుడు న్యాయ సలహా కోసం కబురంపేడు. న్యాయ సలహాదారుడు అటువంటి చట్టం చేయడానికి అవకాశం లేదని, ఆ పదాన్ని నిషేధించాలంటే ముందు రాజ్యాంగాన్నే సవరించాల్సి వుంటుందని, దానికి చాలా తతంగం ఉందని చెప్పేడు. ప్రధాన ప్రతిపక్షాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఇలా చాలా పార్టీలు ఉన్నాయని, వాటిని ఆ పేర్లతోటే ఎన్నికల కమిషన్ గుర్తించిందని చెప్పాడు. ముఖ్య సలహాదారుడు అధినేత దగ్గరగా కూచుని ఇండియా అన్న పదం మీద ఎంత చర్చ జరిగితే ప్రతిపక్ష కూటమికి అంత లాభం అని చెప్పేడు. రాముడి పేరుమీదో, దేశభక్తి పేరు మీదో, ఆవు పేరు చెప్పో, హనుమంతుడి జపం చేసో, లేకపోతే యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనో మనమే దేశ ప్రజల దృష్టిని పక్కకు మళ్ళించాలి తప్ప ''ఇండియా'' కూటమి ఉచ్చులో పడి ఇండియా పేరు చుట్టూ తిరిగితే ప్రజలు ఆ ఇండియా కూటమి గురించే ఎక్కువగా మాల్లాడుకుంటారని, మనల్ని మరిచిపోయే ప్రమాదం కూడా వుండొచ్చని అని నచ్చజెప్పేడు.
మొత్తానికి దేశబత్తులందరికీ 'ఇండియా' అన్న పేరు దడ పుట్టిస్తోంది.
''భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోడానికి బయలుదేరిన కొలంబస్ బృందానికి అల్లంతదూరాన భూమి కనపడేసరికి ''అదుగో! వచ్చేశాం ఇండియా! '' అని అరిచారు. అప్పటి నుండీ ఆ ప్రాంతంలోని దీవులని వెస్ట్ ఇండీస్ అని, అమెరికా ఖండంలో అప్పుడు జీవిస్తున్న మూలవాసుల్ని రెడ్ ఇండియన్స్ అని పిలవడం ప్రారంభించారు.'' చెప్పుకుపోతోంది చరిత్ర మేడమ్. క్లాస్‌లో ఒక చెయ్యి పైకి లేచింది. ''మేడమ్! వెస్ట్ 'ఇండీస్', రెడ్ 'ఇండియన్స్' అని ఎందుకన్నారు? వెస్ట్ 'భరతీస్' అని, రెడ్ 'భరతియన్స్' అని ఎందుకనలేదు? అని అడిగేడు నారద్. మేడమ్ కి ఏం చెప్పాలో తెలియలేదు.
''ఇండియన్ ఓషన్'' అని అంటున్నారే తప్ప ''భరతియన్ ఓషన్'' అని ఎందుకు అనలేదు? అని నారద్ జాగ్రఫీ టీచర్ని అడిగితే ఆయన కూడా సమాధానం చెప్పలేదు. నారద్ హెడ్మాస్టర్, డిఇవో తో కలిసి విజిట్ కి క్లాస్ కి వచ్చినప్పుడు '' సార్, నా డౌట్లకి సమాధానాలు ఇవ్వడం లేదు సార్!'' అని ఫిర్యాదు చేసేరు. ఆ ఫిర్యాదు మీద వెంటనే ఎంక్వైరీ వేసేరు. సిలబస్‌లో లేని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కుదరదని తేల్చేరు. టీచర్లయితే ఊపిరి పీల్చుకున్నారు కాని నారద్ సందేహం తీరలేదు. ఇంటికెళ్ళి తండ్రినడిగేడు.
''మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇండియా అయింది. దానిని భారత్ అని కూడా అనవచ్చునని రాజ్యాంగం చెప్పింది. అంతకు మునుపు ఇండియా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతా కలిపి బ్రిటిష్ ఇండియాగా, బ్రిటిష్ వాళ్ళకి వలసగా ఉండేది.'' వివరించేడు నారద్ తండ్రి బ్రహ్మ. ''మరి అంతకు ముందు?'' అడిగేడు నారద్. అంతకు ముందు మన దేశం వందల చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు కూడా చాలా రాజ్యాలు ఇక్కడ ఉండేవి.'' అని బ్రహ్మ చెప్పేడు. ''ఐతే మరి వాటిల్లో భారత్ అనే రాజ్యం ఏదైనా ఉందా?'' అడిగేడు నారద్. లేదన్నాడు బ్రహ్మ..
''దుష్యంతుడికి శకుంతలకి పుట్టినవాడు భరతుడు గనుక మన దేశానిక ఆ పేరు వచ్చిందని తెలుగు మాస్టారు చెప్పేరు. కాని చరిత్ర చూస్తే ఆ పేరుతో ఏ దేశమూ ఉన్నట్టు కనపడదు. మరి ఈ భారత్ అన్న పేరు ఎక్కడినుంచి వచ్చింది?'' నారద్ సందేహం అలాగే ఉండిపోయింది.
. ఆ వీధి చివరి ఇంట్లో ఉంటున్న హిస్టరీ లెక్చరర్ గారిని కలిసేడు. ''బ్రిటిష్ వాడి పాలన పోవాలని, వాళ్ళ ఏలుబడికింద ఉన్న ప్రాంతంలోని ప్రజలందరూ జాతీయ స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు కదలాలని నడిచిన జాతీయోద్యమంలో ఇండియా అన్న పేరుకు బదులు భారత్ అని, హిందూస్తాన్ అని వాడడం మొదలైంది. ముస్లిం లీగ్ పాకిస్తాన్ కావాలని ఆందోళన మొదలుపెట్టినప్పుడు పాకిస్తాన్, హిందూస్తాన్‌గా రెండు దేశాలుగా విడిపోవాలని అనడం మొదలుబెట్టారు. ఆ తర్వాత విభజన సందర్భంగా లక్షలాది మందిని బలి తీసుకున్న మత ఘర్షణలు జరిగాయి. ఆ విషాదం నుండి బైట పడిన తర్వాత రాజ్యాంగ సభలో అప్పుడే జరిగిన మత ఘÄర్షణల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మతప్రసక్తి లేని పాలన ఉండాలని నిర్ణయించారు. కనుక హిందూస్తాన్ అన్న పేరు బదులు ఇండియా అన్నది వాడాలని నిర్ణయించారు. అది ఇంగ్లీషువాడు పెట్టిన పేరుగనుక వేరే పేరు ఉండాలని కొందరు పట్టుబట్టినప్పుడు రాజీ మార్గంగా ఇండియా, భారత్ అన్న రెండు పేర్లూ వాడవచ్చునని నిర్ణయించారు.'' ఇదీ ఆయన చెప్పిన వివరణ. ''అంటే ఇండియా అన్న పేరుకి, భారత్ అన్న పేరుకి పోటీ లేనట్టే కదా?'' నారద్ అడిగేడు. ఏమీ లేదని లెక్చరర్ గారు క్లారిఫై చేసేరు.
''సార్! మరి గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని ఎందుకు మార్చినట్టు? ఇండియా అన్న పేరుకి భారత్ అన్న పేరుకి మధ్య పోటీ ఎందుకు తెచ్చినట్టు?'' అని నారద్ రెట్టించేడు. ''ఇంతవరకూ తెచ్చిన తగువులన్నీ ఎందుకోసమో ఇది కూడా అందుకోసమే. పేదరికం, ఆకలి, నిరుద్యోగం, వగైరా సమస్యలు నేటి వాస్తవం. దానిని కప్పిపుచ్చి జనాల దృష్టిని మరల్చడానికి దేన్నైనా వాడుకుంటారు'' అని లెక్చరర్ గారు ముగించేరు.
మర్నాడు తనపక్కన కూచున్న మిత్ర బృందానికి నారద్ ఇలా చెప్పేడు. ''ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్.''
బృందంలో ఒకడు ''మరి భారత్' అంటేనో? అని అడిగేడు. నారద్ కాస్సేపు ఆలోచించి ''బహుశా-భగవత్ రాజ్ అదానీ ట్రస్ట్- అయివుంటుందేమో'' అన్నాడు.
సుబ్రమణ్యం