Nov 12,2022 08:13
  • కిలో లీటరు నీటికి రూ.50 నుంచి రూ.120కు పెంపు

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : పరిశ్రమలకు సరఫరా చేసిన నీటి ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. కంపెనీ ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా, అచ్యుతాపురం, రాంబిల్లి ఎస్‌ఇజెడ్‌, ఇతర పరిశ్రమలు, బ్రాండిక్స్‌కు 30 వేల కిలోలీటర్ల నీటిని ఎపిఐఐసి సరఫరా చేస్తోంది. ఈ నీటికి గతంలో ఏడాదికి రూ.54 కోట్లు చెల్లించిన పరిశ్రమలు ఇప్పుడు రూ.129.60 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. పరిశ్రమలకు సరఫరా చేసే నీటి ఛార్జీల పెంపుపై ఈ ఏడాది జనవరి 12న ప్రభుత్వం జిఒ విడుదల చేసింది. దీనిపై ప్రభుత్వ సూచిన మేరకు పరిశ్రమాధిపతుల నుంచి విశాఖపట్నం ఇండిస్టియల్‌ వాటర్‌ సప్లయి కంపెనీ (విస్కో) అభిప్రా యాలను సేకరించింది. నీటి ఛార్జీలు పెంచొద్దని వచ్చిన అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. నీటి సరఫరా ఛార్జీలు పెంచింది. ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పలు పరిశ్రమలకు, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి)కు ప్రభుత్వం నిర్దేశిత ధరల ప్రకారం విస్కో నీటిని సరఫరా చేస్తోంది. పరిశ్రమలకు గతంలో ఎపిఐఐసి కిలోలీటరు (వెయ్యి లీటర్లు)కు రూ.50 వసూలు చేసింది. ప్రభుత్వం ధర పెంచి ఏప్రిల్‌ నుంచి కిలోలీటరుకు రూ.120 చొప్పున వసూలు చేస్తోంది. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా, అచ్యుతా పురం, రాంబిల్లిలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌), నాన్‌ సెజ్‌లోని పరిశ్రమాధిపతులు నీటి భారం ఎక్కువుగా ఉందని ఆందోళన చెందుతున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి సెజ్‌, బ్రాండిక్స్‌ ఇతర పరిశ్రమ లకు ఎపిఐఐసి ట్రీట్‌మెంట్‌ చేయకుండా కిలోలీటరుకు రూ.120 చొప్పున వసూలు చేస్తున్నారు.
 

                                                         ర్యాంకీకి రూ.80 నుంచి రూ.85కే

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ర్యాంకీకి మాత్రం రూ.80 నుంచి రూ.85కు నీటిని సరఫరా చేస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు 'ప్రజాశక్తి'కి తెలిపారు. ర్యాంకీ మాత్రం ట్రీట్‌మెంట్‌ చేసిన నీటికి కిలోలీటరుకు రూ.120 చొప్పున ఫార్మా కంపెనీల నుంచి వసూలు చేస్తున్నట్లు పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. పరిశ్రమలకు రోజుకు 30 వేల కిలోలీటర్లు నీటిని ఎపిఐఐసి సరఫరా చేస్తోంది. కిలోలీటరుకు గతంలో యాభై రూపాయలు చొప్పున రోజుకు రూ.15 లక్షలు చెల్లించిన పరిశ్రమలు నేడు కిలోలీటరు రూ.120 చొప్పున రూ.36 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో, పరిశ్రమలపై నెలకు రూ.10.80 కోట్లు చొప్పున ఏడాదికి రూ.129.60 కోట్ల భారం పడుతోంది.