Sep 03,2023 15:15

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగవ తేదీ మండల కేంద్రంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం మండల పార్టీ కార్యదర్శి యద్దనపూడి మధు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని నాదెళ్ల వారి పాలెంలో ఆదివారం సమరభేరి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం సమరభేరి వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్‌ మీటర్లు తీసివేయాలని, సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 400 రూపాయలకే వంట గ్యాస్‌ ఇవ్వాలని, సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా సరఫరా చేయాలన్నారు. పెట్రోల్‌ డీజిల్‌ ధరలు నియంత్రించాలని అన్నారు. ధరల నియంత్రణ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా పంపిణీ ద్వారా నిలిపివేసిన నూనె, కందిపప్పు పునరుద్ధరించాలన్నారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. తొలితగా మొవ్వ ప్రధాన కూడలిలో సమరభేరి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి మేడేపల్లి వెంకటేశ్వరరావు, రాంబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.