ప్రజాశక్తి-చందర్లపాడు (ఎన్‌టిఆర్) : డిమాండ్ల సాధనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూన్ 30న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని లని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు సంబందించిన వాల్ పోస్టర్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ, పంటల భీమా వెంటనే విడుదల చేయాలన్నారు. రైతుకు అయిన ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని, సాగునీటి ప్రాజెక్టులన్ని పూర్తి కావడానికి అవసరమైన నిధులన్నీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేవారు. రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించవద్దని, నకిలీ విత్తనాలు చలామణిలోకి రాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విత్తన చట్టం చేయాలని, ఉద్యానవన పంటలకు సబ్సిడీపై పరికరాలు, నష్టపరిహారాలు, మద్దతు ధరలు పంటల భీమా ఇవ్వాలని,మామిడి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, అన్ని రకాల భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం మండల అధ్యక్షుడు జి.ఏడుకొండలు,రైతు సంఘం నాయకులు రాయిడి వెంకటేశ్వరరావు, నాగినేని వెంకట రామారావు,తోట రామారావు,షేక్ హుస్సేన్, షేక్ ఉద్దండు , కాశీం తదితరులు పాల్గొన్నారు.










