-ఓడిన బిజెపి
-డిపాజిట్ దక్కని కాంగ్రెస్
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో :మునుగోడులో బిజెపి పాచికలు పారలేదు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి ఏదోవిధంగా ఉప ఎన్నికలో విజయం సాధించాలనుకున్న కమలనాధులకు దిమ్మతిరిగేలా ఫలితం వచ్చింది. కమ్యూనిస్టుల సహకారంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమీప బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,307 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టిఆర్‌ఎస్‌కు 97,003, బిజెపికి 86,696 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 23,864 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బిఎస్‌పి 4,145 ఓట్లు మాత్రమే తెచ్చుకుంది. మునుగోడులో జోరుగా ప్రచారం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ.పాల్‌కు 805 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 482 ఓట్లు వచ్చాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు నల్గండ గిడ్డంగుల శాఖ గోదాములో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 15 రౌండ్లు ఓట్లు లెక్కింపు జరగ్గా రెండో రౌండు, మూడో రౌండు మినహా మిగిలిన 13 రౌండ్లలోనూ టిఆర్‌ఎస్ ఆధిక్యం కనబర్చింది. స్వల్ప మెజార్టీలు నమోదవుతుండడంతో రౌండ్‌రౌండ్‌కూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పట్టణ ప్రాంతాలైన చౌటుప్పల్, చండూరుపై బిజెపి పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. అక్కడ కూడా టిఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ రావడంతో పదో రౌండ్‌కే బిజెపి ఆశలు వదులుకుంది. ఐదో రౌండ్ తర్వాత బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఫలితాలను ఆలస్యంగా ప్రకటిస్తున్నారని ఎన్నికల సంఘం అధికారులపై బిజెపి నాయకులు పలు ఆరోపణలు చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రోజు నుంచే మునుగోడు ఉప ఎన్నిక తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఎం కెసిఆర్... మునుగోడులో బలమైన క్యాడర్ ఉన్న వామపక్షాల సహకారం తీసుకున్నారు. కేంద్రంలోని బిజెపి మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలను వామపక్ష కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి వివరించారు. ఫలితాల అనంతరం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ గెలుపులో ముఖ్యపాత్ర పోషించిన వామపక్ష నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఆల్ ఫేక్ పార్టీ బిజెపికి కర్రుకాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజల చైతన్యానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నానని పేర్కొన్నారు. మునుగోడులో టిఆర్‌ఎస్ విజయం రాష్ట్ర రాజకీయాల్లో మంచి పరిణామమని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ ఫలితం బిజెపికి చెంపపెట్టులాంటిదని తెలిపారు. టిఆర్‌ఎస్, కమ్యూనిస్టుల కలయికే ఈ విజయానికి ప్రధాన కారణమని చెప్పారు. టిఆర్‌ఎస్ విజయంతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సంబరాలు మిన్నంటాయి. నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. టపాసులు, తీన్మార్ దరువులతో తెలంగాణ భవన్ మార్మోగింది.