
కోల్‌కతా : అనుమానాస్పద మృతిగా ఆరోపిస్తున్న ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థి మృతదేహానికి మరోసారి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాల్సిందిగా బుధవారం కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఫైజాన్ అహ్మద్ గతేడాది అక్టోబర్ 14న హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తుండగా... విద్యార్థి తల్లిదండ్రులు తమ కుమారుడిని హత్య చేశారని వాదిస్తున్నారు. అప్పటికే విద్యార్థి మృతదేహానికి అస్సాంలో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకు తప్పనిసరిగా మరోసారి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాలని జస్టిస్ రాజశేఖర్ మంథా ఆదేశించారు. ఈ విషయంలో దర్యాప్తు అధికారి అస్సాం పోలీసుల సమన్వయంతో మృతదేహాన్ని బయటకు తీసి... కోల్‌కతాకు తీసుకువచ్చి మరోసారి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కేసులో కోల్‌కతా ప్రముఖ న్యాయవాది సందీప్ భట్టాచార్య అమికస్ క్యూరీ పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థి శరీరంపై రెండు గాయాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బాధితుడి తల వెనుక భాగంలో వైద్యపరంగా హెమటోమా అని పిలువబడే రెండు గాయాల తాలూకా గుర్తులు ఉన్నాయని, అయితే పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో గాయాల ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. అలాగే మృతదేహాంపై సోడియం నైట్రేట్ రసాయన పదార్థాన్ని పోలీసులు గుర్తించారని తెలిపారు. సాధారణంగా ఈరసాయనాన్ని మాంసం నిల్వ చేసేందుకు వినియోగిస్తారని వివరించారు. మూడురోజులైనా మృతదేహం నుండి ఎలాంటి వాసన రాలేదని, ఒక విద్యార్థి మరణిస్తే తోటి హాస్టల్ విద్యార్థులు గుర్తించకపోవడం అసాధ్యమని పేర్కొన్నారు. మృతదేహంపై రసాయనం ఆనవాళ్ల ప్రకారం.. విద్యార్థి మరణించిన అనంతరం మూడు రోజుల పాటు భద్రపరిచేందుకు వినియోగించి ఉంటారని... ఇది తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్‌లో ఐఐటి ఖరగ్‌పూర్ డైరెక్టర్‌ను తొలగించిన సంగతి తెలిసిందే.