
శాంతి నెలకొనాల్సిన చోట మరింత అశాంతి తలెత్తేలా జో బైడెన్ సర్కార్ ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబులు పంపింది. సంక్షోభాన్ని మరింత తీవ్రతరం కావించేందుకు, రష్యా మీద మరిన్ని ఆంక్షలతో నష్టపరిచేందుకు నాటో కూటమి పూనుకుంది. దానికి ప్రతిగా దాడులను మరింత తీవ్రం గావించటంతో పాటు, ఉక్రెయిన్ నుంచి నల్లసముద్రం ద్వారా జరుగుతున్న ధాన్య ఎగుమతుల ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంది. ఆదివారంతో ముగిసిన ఒప్పందాన్ని అది పొడిగించలేదు. దీంతో 45 దేశాలకు ఉక్రెయిన్ ధాన్య ఎగుమతులపై అనిశ్చితి ఏర్పడింది. నౌకలకు భద్రత లేనందున రవాణా నిలిచిపోనుంది. గత ఏడాది టర్కీ చొరవతో ఐరాస మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు ఉక్రెయిన్ రేవుల దిగ్బంధనాన్ని రష్యా ఎత్తివేసింది. దానికి ప్రతిగా తమ ఆహార ధాన్యాలు, ఎరువుల ఎగుమతులపై పశ్చిమ దేశాలు ఆంక్షలను తొలగించలేదని పుతిన్ విమర్శించాడు. మూడు ఉక్రెయిన్ రేవుల నుంచి వివిధ దేశాలకు 3.28 కోట్ల టన్నుల గోధుమలు, ఇతర ధాన్యాలు, పొద్దుతిరుగుడు పువ్వుల నూనె ఎగుమతి జరిగింది. వీటిలో 46 శాతం ఆసియా, 40 శాతం పశ్చిమ ఐరోపా, 12 శాతం ఆఫ్రికా, రెండు శాతం తూర్పు ఐరోపా దేశాలకు వెళ్లాయి. దాంతో గత ఏడాది మార్చి నుంచి ఇటీవలి వరకు ప్రపంచ మార్కెట్లో ఆహార ధరలు 23 శాతం వరకు తగ్గినట్లు తేలింది. తిరిగి పరిస్థితి మొదటికి రావటంతో సోమవారం నాడు చికాగో మార్కెట్లో గోధుమల ముందస్తు ధర 3.5 శాతం పెరిగింది. వెంటనే ఒప్పంద పునరుద్ధరణ జరగకపోతే భారత్‌తో సహా అనేక దేశాల మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఒప్పందాన్ని కొనసాగించలేదనే ఆగ్రహంతో క్రిమియా ద్వీపాన్ని రష్యా ప్రధాన భూ భాగాన్ని కలిపే వంతెన పేల్చివేసేందుకు ఉక్రెయిన్ దాడి జరిపింది. పాక్షికంగా దెబ్బతిన్న వంతెనను వెంటనే రాకపోకలకు పునరుద్ధరించినట్లు పుతిన్ సర్కార్ ప్రకటించింది. దీనికి ప్రతిగా భారీ ఎత్తున నల్లసముద్రం లోని రేవు, ఉక్రెయిన్ ఇతర ప్రాంతాల మీద రష్యా పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరుపుతున్నట్లు మంగళవారం నాడు వార్తలు వచ్చాయి. తమ తూర్పు ప్రాంతంలో పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నప్పటికీ తమ అదుపులోనే ఉందని ఉక్రెయిన్ మిలిటరీ అధికారి చెప్పాడు. లక్ష మందికి పైగా మిలిటరీ, తొమ్మిది వందలకు మించి ట్యాంకులను రష్యా మోహరించిందని అన్నాడు.
మానవ హక్కుల బృందాలు విమర్శించినా ఖాతరు చేయకుండా నిషేధిత క్లస్టర్ బాంబులను (పలు రకాల బాంబుల గుత్తి) ఉక్రెయిన్‌కు సరఫరా చేసి సంక్షోభాన్ని ప్రమాదకర మలుపు తిప్పేందుకు అమెరికా పూనుకుంది. ఎనభై కోట్ల డాలర్ల విలువగల ప్యాకేజీలో భాగంగా ఇప్పటికే వాటిని అక్కడకు తరలించింది. ఒకవేళ వాటిని తమ మీదకు వదిలితే తాము కూడా ప్రయోగించేందుకు తమ దగ్గర భారీగా నిల్వలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ హెచ్చరించాడు. ఒక రష్యా జర్నలిస్టుతో మాట్లాడినపుడు ఈ అంశాన్ని చెప్పాడు. గతంలో అమెరికా వీటిని ప్రయోగించిన ప్రాంతాలలో జరిగిన ప్రాణ నష్టం, వనరుల విధ్వంసం కారణంగా వాటిని నిషేధించారు. కొన్ని సందర్భాలలో కొన్ని బాంబులు పేలవు. వాటి గురించి తెలియక ఎవరైనా ముట్టుకుంటే సంవత్సరాల తరువాత కూడా మందుపాతరల మాదిరి పేలే ముప్పు ఉంది. గగనతలం నుంచి విమానాలు, భూమి, సముద్రాల మీద నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. గతంలో ఇవి పేలినపుడు మరణించిన వారిలో 94 శాతం మంది పౌరులు కాగా 40 శాతం మంది పిల్లలు ఉన్నారు. వీటిని రూపొందించే పద్ధతిని బట్టి ఒక్కో గుత్తిలో కొన్ని డజన్ల నుంచి గరిష్టంగా ఆరు వందల బాంబులను అమర్చవచ్చు. తక్కువ మంది మిలిటరీ, పరిమితమైన విమానాలు, ఓడలు, రాకెట్ వాహనాలతో భారీ నష్టం కలిగించవచ్చు.
ఈ బాంబులను రకరకాలుగా రూపొం దిస్తున్నారు. మామూలుగా ఒక బాంబును వేస్తే ఒక చోటే నష్టం కలిగిస్తుంది. కానీ ఈ గుత్తి బాంబు వేసిన తరువాత అది అనేకంగా విడిపోయి విస్తృత ప్రాంతంలో పేలుళ్లకు కారణమౌతుంది. మనుషులను చంపటంతో పాటు రోడ్లు, వాహనాలు, విద్యుత్ లైన్లు ఇలా ఆ ప్రాంతంలో ఏవి ఉంటే వాటిని ధ్వంసం చేస్తాయి. కొన్ని సందర్భాలలో మానవాళి, పంటలకు ముప్పు కలిగించే జీవ, రసాయనాలతో కూడా బాంబులను రూపొందిస్తున్నారు. యుద్ధం, ఇతర సందర్భాలలో పౌరులను హెచ్చరించేందుకు, బెదిరించేందుకు రూపొందించిన కరపత్రాలను కూడా ఈ బాంబుల ద్వారా వెదజల్లిన ఉదంతాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో ఇవి కలిగించిన అపార నష్టాన్ని చూసిన తరువాత 2008 మే 30వ తేదీన డబ్లిన్ నగరంలో 107 దేశాలు వీటి ఉత్పత్తి, వినియోగం, బదిలీ, నిల్వ చేయరాదని ఒక అవగాహనకు వచ్చాయి, అదే ఏడాది డిసెంబరు మూడున ఓస్లో నగరంలో ఒప్పందం మీద సంతకాలు చేశాయి. 2010 ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం 111 దేశాలు సంతకాలు చేసి పార్లమెంట్లలో ఆమోద ముద్ర వేశాయి, మరో పన్నెండు దేశాలు సంతకాలు చేసినా తదుపరి ప్రక్రియను పూర్తి చేయలేదు. మన దేశం, అమెరికా, చైనా, రష్యా, ఉక్రెయిన్, పాకిస్తాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఒప్పందంలో చేరలేదు. నాటోలోని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ వంటి పద్దెనిమిది దేశాలు కూడా ఒప్పందాన్ని అమలు చేస్తున్నవాటిలో ఉన్నాయి. అవి కూడా అమెరికాను నివారించేందుకు పూనుకోలేదు. అయిష్టంగానే తాము ఉక్రెయిన్‌కు అందచేస్తున్నట్లు జో బైడెన్ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశారు.
రష్యా ఉక్రెయిన్ మీద వేసినట్లు గతంలో నాటో కూటమి ఆధారం లేని ఆరోపణలు చేసింది. తాజాగా అమెరికా వాటిని ఇవ్వటాన్ని సమర్ధించుకొనేందుకు ముందుగానే ఈ ప్రచారం చేసినట్లు దీన్ని బట్టి అర్ధం అవుతోంది. పట్టణాల మీద వీటిని వేయకూడదని రాతపూర్వకంగా ఉక్రెయిన్ నుంచి హామీ పొందినట్లు నమ్మించేందుకు అమెరికా చూస్తోంది. కొంత మంది ఇలా అందచేతతో తలెత్తే చట్టపరమైన అంశాల గురించి చర్చలు చేస్తున్నారు. 'నాటో' లోని కొన్ని అమెరికా మిత్రదేశాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. తప్పని చెబుతూనే ఉక్రెయిన్ ఆత్మరక్షణకు ఇస్తున్నారు గనుక అర్ధం చేసుకున్నామంటూ సమర్ధించాయి. ఐదు వందల రోజుల సంక్షోభం తరువాత ఎందుకు ఇప్పుడు వీటిని అమెరికా సరఫరా చేస్తున్నది అనే ప్రశ్న తలెత్తటం సహజం. రష్యా అదుపులో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు తాము ప్రతిదాడులు జరుపుతున్నట్లు జెలెన్‌స్కీ ప్రకటించాడు. దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఎలాంటి పురోగతి లేకపోగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు వార్తలు. ట్యాంకులు, శతఘ్నులను పెద్ద ఎత్తున నష్టపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతాలలో రష్యన్లు భారీ సంఖ్యలో మందుపాతరలను అమర్చినట్లు, కందకాలను తవ్వినట్లు వెల్లడి కావటంతో ఉక్రెయిన్, నాటో మిలిటరీ అంచనాలు తప్పాయి. వాటిని దాటుకొని ముందుకు పోవటం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవటమే. అందుకే ఆ ప్రాంతాల మీద క్లస్టర్ బాంబులను వేయటం తప్ప మరొక మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇవి కందకాల మీద, బహిరంగంగా ఉన్న ట్యాంకులు, శతఘ్నులను పేలుళ్లు జరిపి నష్టపరుస్తాయి. పేలని బాంబులు, వాటితో పాటు జారవిడిచే మందుపాతరలను తప్పించుకొని పుతిన్ సేనలు ముందుకు పోవటం కూడా ఇబ్బందే.
క్లస్టర్ బాంబులను గతంలో ప్రయోగించిన ప్రాంతాలన్నీ మిలిటరీ, పౌరులు కలసి ఉన్న ప్రాంతాలే కావటంతో అనేక మంది వీటిని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ బాంబులలో రెండు నుంచి నలభై శాతం వరకు పేలే అవకాశం లేదని, చెట్లు, గుట్టలు, బురద ప్రాంతాల్లో పడినవి తరువాత ఎవరైనా వాటిని కదిలించినపుడు లేదా అవేమిటో తెలియని పిల్లలు, ఇతరులు వాటిని ముట్టుకున్నపుడు పేలి ప్రాణాలు తీస్తాయి. తాము ఉక్రెయిన్‌కు పంపిన ఈ బాంబుల్లో పేలనివి 2.35 శాతమే ఉంటుందని, ఎంతో మెరుగుపరచిన పరిజ్ఞానంతో రూపొందించినట్లు అమెరికా నమ్మించ చూస్తోంది. అయితే దాని రక్షణశాఖ జరిపిన పరీక్షల్లో పేలనివి 14 నుంచి 20 శాతం అంతకంటే ఎక్కువే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌కు వాటిని అందించటమంటే అక్కడి సంక్షోభాన్ని మరో మలుపు తిప్పటమే కాదు, తీవ్ర పర్యవసానాలకూ దారి తీస్తుంది. ఉద్రిక్తతలను ఎగదోసే యుద్ధోన్మాదాన్ని ఎండగట్టాలి.
ఎం. కోటేశ్వరరావు