Sep 23,2023 19:53

'బింబిసార' దర్శకుడు వశిష్ఠ మెగాస్టార్‌ చిరంజీవి 157వ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) తర్వాత చిరంజీవిని మనం ఫాంటసీ చిత్రాల్లో చూడలేదు. ఈ సినిమా అప్పటి పిల్లలను బాగా ఆకట్టుకుంది. ఈతరం పిల్లలకు చిరంజీవిని అదే తరహాలో చూపించాలనుకుంటున్నా. ఫాంటసీ సినిమాలు, కార్టూన్లూ చూస్తూ, చందమామ కథలు చదువుతూ పెరిగాను. మార్వెల్‌, డీసీ సూపర్‌హీరోల స్టోరీలు, విఠలాచార్య చిత్రాలను బాగా ఇష్టపడతా. ఓరోజు పాత మిక్కీ మౌస్‌ కార్టూన్‌ చూస్తున్న సమయంలో 'బింబిసార' సినిమా కథాలోచన వచ్చింది. ఇలాంటి కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో స్వేచ్ఛ తీసుకోవచ్చు. గుర్రాలు, ఏనుగులు గాల్లో ఎరగడంలాంటి ఎన్నో మ్యాజిక్స్‌ను జోడించొచ్చు. 'అవతార్‌'లా కొత్త ప్రపంచాన్ని రూపొందించడం, ప్రేక్షకులను అందులో లీనమయ్యేలా చేయడంలో ఆనందం ఉంది. అయితే అన్నింటికీ మించి స్టోరీ, స్క్రీన్‌ప్లేనే సినిమాకు బలమనేది నా అభిప్రాయం'' అని పేర్కొన్నారు. నవంబరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. చిరుకు జోడీగా అనుష్క, నయనతార పేర్లు ప్రచారంలో ఉన్నాయి.