Aug 02,2023 17:56

కొత్తగూడెం : టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపు రెండునెలలుగా రేటు విపరీతంగా పెరిగింది. కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 దాకా పలుకుతున్నది. టమాట కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెంకు చెందిన ఓ ఫొటోగ్రాఫ్‌ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించాడు. స్టూడియోకు వచ్చి పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు దిగే వినియోగదారులకు టమాటలు ఉచితంగా ఇస్తున్నాడు. కొత్తగూడెం టీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని స్టూడియోలో ఎనిమిది పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు తీసుకునే వినియోగదారులకు ప్యాకెట్‌ టమాట ప్యాకెట్లను అందించాడు.ఇటీవల కాలంలో వ్యాపారం సాగకపోవడంతో టమాట ధర భారీగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు పట్టణంలోని ప్రధాన కేంద్రాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఫొటో స్టూడియో ఓనర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ ఇటీవల కలెక్టరేట్‌తో పాటు కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ పాల్వంచ సమీపంలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయానికి సముదాయానికి మారాయని చెప్పాడు. ఫలితంగా బస్టాండ్‌ సెంటర్‌లో తనతో పాటు చాలామంది వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఆనంద్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. కార్యాలయాలు మారక ముందు స్టూడియోకు నిత్యం 20 నుంచి 30 మంది కస్టమర్లు వచ్చేవారని, ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు కూడా రావడం లేదని వాపోయాడు.ఈ పరిస్థితుల్లో రెండు రోజుల కిందట పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫొటోలు తీసుకుంటే టమాటలు ఇస్తున్నట్లు తెలిపారు. పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలకు రూ.100 ఖర్చు అవువుతుండగా.. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాట ధర రూ.200 పలుకుతున్నది. వినియోగదారులకు ప్యాకెట్‌లో పావు కిలో టమాటలు ఇస్తుండగా.. ఇందుకు రూ.50 ఖర్చవుతున్నది. ఆఫర్‌ కారణంగా లాభాలు తగ్గినా.. కనీసం వ్యాపారం కొనసాగుతుందని ఆనంద్‌ పేర్కొన్నాడు. ఫొటోలకు టమాట ఆఫర్‌ను ప్రకటించడంతో స్టూడియోకు రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది మంది వస్తున్నారని తెలిపాడు. టమాట ధరలు తగ్గే వరకు ఆఫర్‌ను కొనసాగిస్తానని ఆనంద్‌ తెలిపాడు.