Jul 14,2022 06:24

ఓ వైపు ఆకలి కేకలు.. పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, మహిళలు కనిపించే మన దేశంలో.. మరోవైపు అధిక బరువుతో ఇబ్బందులు పడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే దర్శనమిస్తోంది. శతాబ్దాల నుంచి మనల్ని పోషకాహార సమస్య వెంటాడుతుండగా.. దశాబ్ద కాలంగా ఊబకాయ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. పూర్తి భిన్నమైన సమస్యలను మనదేశం ఒకేసారి ఎదుర్కొంటుండడం గమనార్హం.
భారతదేశాన్ని అనేక ఏళ్లుగా పోషకాహార లోపం పట్టి పీడిస్తోంది. ఇండియాలో దాదాపు 10.2 కోట్ల మంది పురుషులు, 10.1 కోట్ల మంది మహిళలు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు కలిగి ఉన్నారని, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని 2016లో ది లాన్సెట్‌ జర్నల్‌ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. ఐదేళ్ల క్రితం కంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ పోషకాహార లోపంతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) తాజా గణాంకాలు కూడా చెబుతున్నాయి. 2019-20లో సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను తయారుచేశారు. 2015-16 సర్వేతో పోలిస్తే చాలా చోట్ల పిల్లల్లో పోషకాహార సమస్య బాగా పెరిగింది. ఐదేళ్లకన్నా చిన్న పిల్లల్లో పోషకాహార లోపం 44 శాతం నుంచీ 55 శాతానికి పెరిగింది. బరువు తక్కువ పిల్లల శాతం 7.8 నుంచి 13.4కు పెరిగింది. చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పేదవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. పోషకాహార లోపంతో ఉన్న మహిళలకు పుట్టే పిల్లలు కూడా బలహీనంగానే ఉంటున్నారు. దీనికి కారణం మహిళలకు సరైన పోషకాహారం అందకపోవడమే. దశాబ్దంన్నర క్రితం తో పోల్చుకుంటే దేశంలో పోషకాహారలోప బాధితుల సంఖ్య తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి వెల్లడించింది. 2004-06 మధ్య దేశ జనాభాలో 21.6 శాతం పోషకాహార లోపంతో బాధ పడుతుండగా, 2019-21 నాటికి 16.3 శాతానికి దిగి వచ్చిందని తెలిపింది. అయితే గతంతో పోలిస్తే భారతావనిలో ఊబకాయ వయోజనులు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగినట్లు పేర్కొంది.
2019-21 నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే ప్రకారం భారతదేశం లోని 23 శాతం జనాభా స్థూలకాయంతో బాధపడుతున్న వారే. అయితే నాలుగేళ్ల క్రితం అంటే 2015-16లో ఇది కేవలం 17 శాతం మాత్రమే. అంటే నాలుగేళ్లలో ఊబకాయుల సంఖ్య ఆరు శాతం పెరిగింది. అంతేకాకుండా చిన్నారుల్లో సైతం ఊబకాయ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే వరల్డ్‌ ఒబెసిటీ ఫెడరేషన్‌ ప్రకారం 2030 నాటికి భారతదేశ చిన్నారుల్లో 50 శాతం మంది ఊబకాయ సమస్యతో బాధపడతారని అంచనా వేసింది.
అధిక బరువుకు అనేక కారణాలు మనకు కనిపిస్తాయి. మొదటిది జన్యుపరమైన సమస్యలు. మరొకటి...లావుగా ఉండడాన్ని కొంతమంది సంపదకు, శ్రేయస్సుకు, ఆరోగ్యానికి చిహ్నంగా భావించడం. ఇవే కాకుండా... దేశంలో జంక్‌ ఫుడ్‌, ప్యాకేజ్‌ ఫుడ్‌ వినియోగం పెరగడం. ఇలాంటి వాటిలో షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనిషి బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా టీవీ, ఫోన్లు చూసే సమయం ఎక్కువ కావడం. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో పెద్దలు ప్రతి రోజు ఐదు గంటల సమయాన్ని టీవీలు, ఫోన్లు చూడడానికే వెచ్చిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో నిర్వహించిన ఓ సర్వేలో రెండు నుంచి ఐదేళ్ల చిన్నారుల స్క్రీన్‌ టైమ్‌ రెండు గంటలుగా తేలింది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి రోజు టీవీ చూసే వారిలో ఊబకాయం వచ్చే ప్రమాదం 21 శాతం ఎక్కువని తేల్చింది. ఇంకా పట్టణీకరణ పెరగడం. గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలు పెరగడం, రవాణా సౌకర్యాలు మెరుగవ్వడం, శ్రమను తగ్గించేస్తున్న గృహోపకరణాలు కూడా అందుకు కారణాలుగానే చెప్పుకోవచ్చు. పట్టణాల్లోనే కాకుండా ఇటీవల గ్రామాల్లో సైతం ఊబకాయ సమస్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం గ్రామాలు, పట్టణాల మధ్య దూరం తగ్గుతున్న కొద్దీ గ్రామాల్లో ఊబకాయుల సంఖ్య పెరిగిపోతుండడం గమనార్హం.
ప్రభుత్వం ఊబకాయాన్ని కూడా ఒక వ్యాధిగా గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలి. అయితే ప్రతి ఒక్కరు ఆహారం, శారీరక శ్రమ విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటే ఊబకాయ సమస్యను దూరం చేయవచ్చు.

firogkan

 

 

 

 

ఫిరోజ్‌ ఖాన్‌
వ్యాసకర్త సెల్‌ : 9640466464